చిన్న పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కరోనా తర్వాత భారీ సంఖ్యలో చిన్న పట్టణాలకు తిరిగి వలసపోవడమే కారణమని హౌసింగ్ డాట్ కామ్ నివేదిక తెలియజేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇళ్ల కొనుగోలు, అద్దె ఇళ్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ‘‘హౌసింగ్ డాట్‌కామ్ ప్లాట్‌ఫామ్‌పై గడిచిన కొన్ని నెలల కాలంలో నివాసిత గృహాలకు ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అమృత్సర్, చండీగఢ్, నాగ్‌పూర్, విజయవాడ, కోయంబత్తూర్ తదితర పట్టణాల విషయంలో ఈ పరిస్థితి కనిపించింది’’ అంటూ ఎలారా టెక్నాలజీస్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు.
హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్ పోర్టళ్ల మాతృ సంస్థయే ఎలారా టెక్నాలజీస్. ‘‘కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం.. ఉద్యోగపరమైన అనిశ్చితులు ప్రజలను తిరిగి తమ ప్రాంతాలకు తరలిపోయేందుకు దారితీసింది. అసంఘటిత రంగంలోని వారితోపాటు.. సంఘటిత రంగంలోనూ ఉద్యోగాలు పోవడం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎక్కువ మంది తిరిగి సొంత పట్టణాలు, చిన్న పట్టణాలకు వలసబాట పట్టారు’’ అని నివేదిక వివరించింది. దీనివల్ల చిన్న పట్టణాల్లో ఇళ్ల కొనుగోలుకు, అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడమే కాకుండా, ఈ కామర్స్ సంస్థల వృద్ధికి కూడా తోడ్పడినట్టు తెలిపింది.
పెద్ద పట్టణాల్లో పడిపోయిన అమ్మకాలు
ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్
దేశంలోని ఏడు ప్రథమ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 29,520 యూనిట్లు అమ్ముడుపోయాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలు 55,080 యూనిట్లతో పోలిస్తే 46 శాతం తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణేలో కరోనా కారణంగా డిమాండ్ స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 57% క్షీణించి 87,460 యూనిట్లు (ఒక యూనిట్:ఒక ఇల్లు/ఫ్లాట్)గా ఉన్నాయి. కానీ, 2019 ఇదే కాలంలో 2,02,200 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 12,730 యూనిట్లకు పడిపోగా, తర్వాతి త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌లో విక్రయాలు రెట్టింపునకు చేరినట్టు అన్‌రాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. కరోనా ముందస్తునాటితో పోలిస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో విక్రయాలు 65 శాతం సాధారణ స్థితికి చేరినట్టు చెప్పారు.