Russells viper
-
కాటేసిన విషసర్పాన్ని చంపి.. ఆస్పత్రికి పట్టుకెళ్లిన బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పాము కాటేసినా ఏ మాత్రం భయపడలేదు. వెంటపడి చంపేశాడు. చచ్చిన పామును చేతబూని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. ఈ సాహసం చేసింది ఏడేళ్ల బాలుడు కావడం విశేషం. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటుండగా ఏదో కరిచినట్లు గ్రహించాడు. ఆ బాలుడు వెంటనే అక్కడ వెతకగా రక్తపింజరి జాతి విషనాగు పాకుతూ వెళుతుండగా చూశాడు. పొలంలోని మొక్కల మధ్య దానిని వెంటాడి వేటాడి పట్టుకుని రాళ్లతో కొట్టి హతమార్చాడు. చచ్చిన పామును చేతపట్టుకుని ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండురోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఇంటికి పంపే ముందు ఆ బాలుడితో ‘ఆస్పత్రికి చచ్చిన పామును తీసుకుని ఎందుకు వచ్చావు’ అని వైద్యులు ప్రశ్నించగా ‘నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది’ అని బదులివ్వడంతో బిత్తరపోయారు. వైద్య బృందం అంతా కలిసి బాలుడి సాహసాన్ని, సమయోచిత తెలివితేటలను అభినందించారు. -
స్కూల్ బ్యాగ్‌లో బుస్ బుస్
మహబూబాబాద్: ఓ విద్యార్థి పుస్తకాల సంచిలో రక్తపింజర దాగి ఉన్న సంఘటన, కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన అజ్మీరా అఖిల అనే ఐదవ తరగతి విద్యార్థిని కోమటిపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో చదువుతోంది. నిత్యం ఆటోలో తండా నుంచి తోటివిద్యార్దులతో కలిసి వచ్చే ఆమె రోజుమాదిరిగానే తన బ్యాగ్‌ను ఆటోకి తగిలించి పాఠశాలకు చేరుకుంది. తరగతి గదిలో బ్యాగ్ పెట్టి, ప్రార్ధనకు వెళ్లింది. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి తన బ్యాగ్‌లో నుంచి పుస్తకం తీయడానికి చేయిపెట్టింది. చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్‌ను పూర్తిగా తెరిచి చూడగా లోపల పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా అరిచి ఏడ్చుకుంటూ క్లాస్ టీచర్ క్రిష్ణయ్య వద్దకు వెళ్లి చెప్పింది. దీంతో క్లాస్‌టీచర్, హెచ్ఎం సోమిరెడ్డిలు గదిలో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించి, బ్యాగ్‌ను దులిపించడంతో రక్తపింజర బయటపడింది. వెంటనే కర్రతో కొట్టి చంపేశారు. బ్యాగ్‌లో ఉన్న ఆహర పదార్థాలు, పల్లికాయ ఉండటం వల్లనో, ఎలుక, కప్పలను మింగి బ్యాగ్‌లోకి దూరినట్లుందని, చేయి పెట్టినప్పుడు పాము కరవక పోవడం వల్ల విద్యార్థినికి ప్రమాదం తప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.