Russian airstrikes
-
3,000 మందిని చంపిన రష్యా
డెమాస్కస్: రష్యా వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 3,000మంది ప్రాణాలుకోల్పోయారని సిరియా పరిశీలన సంస్థ ఒకటి వెల్లడించింది. గత ఏడాది(2015) సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు రష్యా లెక్కలేనిసార్లు సిరియాలో వైమానిక బాంబు దాడులు జరిపిందని ఈ దాడుల్లో ఉగ్రవాదులతోపాటు సామాన్యులు కూడా మృత్యువాత పడ్డారని ఆ సంస్థ పేర్కొంది. మొత్తం మూడు వేలమంది ఈ దాడుల కారణంగా చనిపోగా వారిలో సామాన్యులు 1,015 మంది ఉన్నారని, వారిలో 238 మంది 18 ఏళ్లలోపువారు, 640మంది పురుషులు, 137మంది మహిళలు ఉన్నట్లు సిరియా హక్కుల సంస్థ ఓ పత్రికకు వివరాలు తెలియజేసింది. ఇక ఇదే దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఎక్కువగా చనిపోయారని పేర్కొంది. మొత్తం 893 మంది ఐఎస్ ఉగ్రవాదులు చనిపోగా.. ఇతరులు అల్ కాయిదావంటి జిహాదీ గ్రూపులకు చెందినవారు 1,141 మంది మరణించినట్లు వివరించింది. అయితే, రష్యా ఈ దాడులను సిరియా బలగాలకు మద్దతుగానే జరిపినట్లు ఆ హక్కుల సంస్థ వివరణ ఇచ్చింది. -
బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ బాంబుల మోతతో దద్దరిల్లింది. చుట్టుదట్టమైన పొగలు దుమ్ముధూళి అలుముకొని కారుమబ్బులు నేలపై పరుచుకున్నట్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా గోడలకు, వీధులకు రక్తపు చారికలు అంటుకున్నాయి. ఎంతోమంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రస్తుతం రష్యా సైన్యం జరుపుతున్న వైమానిక దాడులే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా రష్యా భారీ మొత్తంలో బాంబులను, రాకెట్ లను డెమాస్కస్ పై విడవడంతో దాదాపు 40మంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. ఎంతోమంది గాయాలపాలయ్యారు. బాంబుల ధాటికి నివాసాలన్నీ కూడా ధ్వంసమై వాటిల్లో సామాన్య జనం చిక్కుకుపోయారు. లోపల ఉంటే ఇళ్లు కూలతాయో, బయటకు వస్తే బాంబులు పడతాయేమోనన్న భయంతో డెమాస్కస్ ప్రజలు బిక్కుమంటున్నారు. బుడిబుడినడకలు వేసే చిన్నారులు సైతం ప్రాణ భయంతో వీధుల వెంట పరుగెడుతుండటం పలువురుని కంటతడిపెట్టిస్తోంది. కాగా, తాము పౌర నివాసాలపై దాడులు చేయలేదని, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొనే దాడులు జరిపామని రష్యా ప్రకటించింది. తమపై చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది.