కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు
అధ్యక్ష పదవికోసం యూటీఎఫ్, ఎస్టీయూ పట్టు
ఒక్కటైన ఎస్టీయూ, డీటీఎఫ్, పీఆర్టీయూ?
నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడులోని టీచర్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఉపాధ్యాయ సంఘాలయిన యూటీఎఫ్, ఎస్టీయూలు అధ్యక్ష పదవి మాకంటే మాకు కావాలని పట్టు విడవకుండా ఉండటంతో ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, బాపులపాడు మండలాల్లోని 269మంది ఉపాధ్యాయులకు ఈ సొసైటీలో ఓటుహక్కు ఉంది. ఈ సొసైటీ పాలకవర్గం ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 9 డెరైక్టర్ పదవులుండగా ఎన్నికైన అనంతరం వారిలో నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు.
నూజివీడు మండలంలో 146, ఆగిరిపల్లిలో 43, ముసునూరులో 34, బాపులపాడులో 31 ఓట్లు ఉన్నాయి. ఇంతకు ముందు నాలుగు యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యూటీఎఫ్‌కు చెందిన పీ జగదీశ్వరరావు అధ్యక్షుడిగా, ఎస్టీయూకు చెందిన తాడి.నర్శింహారావు కార్యదర్శిగా, డీటీఎఫ్‌కు చెందిన ఎస్.మురళీకృష్ణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో అధ్యక్ష పదవిని యూటీఎఫ్‌కు ఇచ్చిన నేపథ్యంలో ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని ఎస్టీయూ నాయకులు గట్టిగా కోరుతున్నారు.
తమ యూనియన్‌కు ఎక్కువ ఓట్లున్నాయని, అధ్యక్ష పదవి ఎంతమాత్రం ఇచ్చేది లేదని, పోటీ చేసినా గెలుపు తమదేనని యూటీఎఫ్ నాయకులు తెగేసి చెప్పడంతో మూడు రోజులుగా ఉపాధ్యాయ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే డీటీఎఫ్, పీఆర్టీయూలు మాత్రం చెరి రెండు డెరైక్టర్ పదవులు ఇవ్వమని కోరుతున్నాయి. దీంతో శనివారం యూటీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్, పీఆర్టీయూలకు చెందిన వారు నామినేషన్లు వేశారు.
27న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఉపసంహరణ రోజు నాటికి నాలుగు యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైతే డెరైక్టర్లు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ డీటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ కలసి ఒక్కటై పోటీకి సిద్ధమైతే ఎన్నికలు తప్పవని సమాచారం.