నూజివీడుతో అనుబంధం తీయనైనది :ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
నూజివీడు, న్యూస్‌లైన్ :
నూజివీడుకు, తనకు మధ్య స్నేహవారధిని కట్టిన గొప్ప వ్యక్తి ఎంవీఎల్ అని, ఆయన లేకుండా ఇక్కడకు రావడం ఏదో కోల్పోయినట్లుగా ఉందని ప్రముఖ సినీ గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎల్ఐసీ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ వార్షికోత్సవం స్థానిక ఎమ్మార్ ఏఆర్ పీజీ కేంద్రం ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నూజి వీడుతో తన అనుబంధం తీయనైనది, విడదీయలేనిదన్నారు. ఎంవీఎల్ జీవించి ఉన్నంత వరకు ఏటా ఇక్కడకు వచ్చేవాడినన్నారు. ఇప్పటికీ వీలు దొరికితే నూజివీడు రావాలనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్నో విదేశీ సంస్థలకు దార్లు తెరిచినా ఎల్ఐసీపై ప్రజల్లో ఉన్న నమ్మకం అణువంతైనా తగ్గలేదన్నారు. ప్రజలలో నమ్మకాన్ని కలిగించి, దానిని వమ్ము చేయకుండా ఉండబట్టే ఈ సంస్థను ఎంతోమంది ఖాతాదారులు ఆదరిస్తున్నారన్నారు.
ప్రపంచంలో సంపూర్ణ కళాకారులు లేరని, అతి తక్కువ తప్పులు చేసేవారే గొప్ప కళాకారులన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ ఉద్యోగులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఘనం గా సన్మానించారు. ఎల్ఐసీ ఉద్యోగులకు నిర్వహించిన పలు అంశాలలో విజేతలకు బాలసుబ్రహ్మణ్యం చేతుల బహుమతులను అందజేశా రు. ఈ సందర్భంగా పలువురు గాయకు లు ఆలపించిన గీతాలు, విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆహూ తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రామకృష్ణానంద్, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, విజయవాడ క్లబ్ సెక్రటరీ ఎం కమలాకాంత్, ప్రముఖ పారిశ్రామికవేత్త మూల్పూరి లక్ష్మణస్వామి, నూజివీడు, ముసునూరు తహశీల్దార్లు కేబీ సీతారామ్, డీఎస్ శర్మ, సీనియర్ బ్రాంచి మేనేజర్ పీ కృష్ణ, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు.