రాఠీ ఫిర్యాదుపై ఎల్జీ వివరణ కోరిన హైకోర్టు
న్యూఢిల్లీ: భత్యాలు నిలిపివేశారని, తన ప్రాథమిక హక్కులను ఢిల్లీ పోలీసులు కాలరాస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఏసీపీ ఎస్ఎస్ రాఠీ దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, నగర పోలీస్ కమిషనర్ బస్సీ దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 1997లో కన్నాట్‌ప్లేస్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి రాఠీకి కోర్టు జీవితఖైదు శిక్షను విధించింది. దీంతో అతణ్ని విధుల నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిననాటి నుంచి అతనికి రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనిని సవాలు చేస్తూ రాఠీ కోర్టును ఆశ్రయించారు. భార్యను, పెళ్లి కాని కూతురును పోషించాల్సిన బాధ్యత ఇంకా తనపైనే ఉందని, న్యాయవాదిగా తన కొడుకు ఇంకా సంపాధించే స్థితికి చేరుకోలేదని, వెంటనే రావాల్సిన భత్యాలను ఇప్పించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఎల్జీ, సీపీలకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.