అందుకే ఆ చిరుత నా దగ్గరికి వచ్చిందేమో!
జోహెన్నస్‌బర్గ్: అడవి అందాలను, అందులోని జీవరాశులను తన కెమెరాలో బంధించేందుకు వెళ్లిన ఓ వైల్‌్డలైఫ్ ఫొటోగ్రాఫర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తల్లితో కలిసి ఉన్న చిరుత పిల్లను ఫొటో తీస్తుండగా.. అది అతడిని సమీపించింది. కాసేపు అతడి షూను పరీక్షించి వెళ్లిపోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని సబీ సాండ్స్ నేచర్ రిజర్వులో చోటుచేసుకుంది. వివరాలు... డిల్లాన్ నెల్సన్(25) నేచర్ గైడ్‌గా పనిచేస్తూనే వైల్‌్డలైఫ్ ఫొటోగ్రఫీ చేస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం టూరిస్టులతో కలిసి సఫారీకి వెళ్లిన అతడికి ఓ చిరుత కనిపించింది. దానికి పది నెలల వయస్సు గల రెండు పిల్లలు ఉన్నాయి. వాటిని చూసి ముచ్చటపడ్డ నెల్సన్ ఫొటో తీసేందుకు ప్రయత్నించగా.. ఓ చిరుత పిల్ల అతడిని సమీపించింది. గడ్డి పరకలు నములుతూ.. కొద్దిసేపు అతడిని షూను వాసన చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి నెల్సన్ మాట్లాడుతూ.. చిరుత పిల్ల దగ్గరికి రాగానే తనకు భయం వేసిందన్నాడు. అయితే ఈ అనుభవం తనకు కొత్తగా ఉందని.. బహుశా అది తన షూను విచిత్ర వస్తువులా భావించి పరీక్షించేందుకు వచ్చినట్లుందని సరదాగా వ్యాఖ్యానించాడు. అందుకే దానిని నిరాశపరచడం ఇష్టంలేక అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరుతతో ఫేస్ టు ఫేస్ బాగుంది. అయితే వాళ్ల అమ్మ చూసి ఉంటే నీ పని అయిపోయేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.