Sachin Movie
-
సచిన్ పాత్రలో సచిన్ తనయుడు!
ముంబై: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథతో తెరకెక్కుతున్న, స్వయంగా ఆయన నటిస్తున్న చిత్రం 'సచిన్' టీజర్ విడుదలై అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అదేంటంటే.. సచిన్ తనయుడు అర్జున్ 'సచిన్' చిత్రంలో మెరవనున్నాడట. 'సచిన్' చిత్రంలో సచిన్ చిన్ననాటి పాత్ర కోసం.. సచిన్‌లా మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్న, అదీ సచిన్ పోలికలతో ఉన్న యంగ్ కిడ్ కోసం ఎంతో మందిని వెతికిన ఈ చిత్ర బృందం చివరికి అర్జున్ అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతాడని భావించారట. దీంతో ఈ సినిమాలో అర్జున్ తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. 120 నిమిషాల నిడివితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 40 నిమిషాలకు పైగా సచిన్ అద్భుతమైన ప్రదర్శనలను సందర్భానుసారం జోడించినట్లు సమాచారం. దీంతో మరోసారి మాస్టర్ స్వీట్ ఇన్నింగ్స్‌ను చూడటానికి అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు. -
సచిన్ టీజర్ వచ్చేసింది!
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన ఆయన బయోపిక్ టీజర్ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ టీజర్‌ను స్వయంగా సచిన్ టెండూల్కర్ నుంచి ఈ సినిమాకు సంగీతం అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్.. ఇలా చాలామంది రీట్వీట్ చేశారు. ఈ టీజర్లో చిన్నతనంలో సచిన్ తన తండ్రి వేలు పట్టుకుని వెళ్లడం, తొలిసారి బ్యాట్ పట్టుకున్న ఆనందం, అన్నతో కలిసి ఆడటం, స్కూల్లో తోటి పిల్లలతో కొట్లాటలు.. ఇవన్నీ ముందు కనిపిస్తాయి. తర్వాత బీచ్ ఒడ్డున తనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు షర్టు వేసుకున్న సచిన్ కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ హెల్మెట్ పెట్టుకుని గ్రౌండులోకి వెళ్లడం, మిడిల్ వికెట్ మీద నాణెం పెట్టి ఆడటం, ఒళ్లంతా మూడు జెండా రంగులను పులుముకుని జెండా ఊపుతూ కనిపించే సచిన్ వీరాభిమాని.. ఇవన్నీ కూడా టీజర్లో జోడించారు. మధ్యలో తన తండ్రి చెప్పిన సందేశాన్ని కూడా సచిన్ వినిపించాడు. ''మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. నువ్వు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నావు. కానీ అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఏదో ఒకటి మాత్రం శాశ్వతంగా నీతో ఉండిపోతుంది అది.. నీ వ్యక్తిత్వం'' అని సచిన్ టెండూల్కర్ చెప్పడం కూడా ఈ టీజర్లో కనిపిస్తుంది. మొత్తమ్మీద మైదానంలోనే కాదు వెండితెర మీద కూడా అభిమానులను అలరించేందుకు సచిన్ టెండూల్కర్ సిద్ధమయ్యాడు. -
మానవత్వం పరిమళించిన వేళ...
మానవత్వం అందరిలోనూ ఉంటుంది. కష్టంలో ఉండే తోటివారికి సాయం చేసినప్పుడు ఆ మానవత్వం పరిమళిస్తుంది అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘సచిన్’. ‘టెండూల్కర్ కాదు’ అనేది ఉపశీర్షిక. సుభాష్ ప్రొడక్షన్స్ పతాకంపై తాయికొండ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. మోహన్ దర్శకుడు. మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఇందులో క్రికెట్ కోచ్ పాత్ర పోషించారు. సుహాసిని మణిరత్నం కీలక పాత్ర చేశారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘సుహాసిని గారికి ఈ పాత్ర నచ్చి ఎంతో అద్భుతంగా నటించారు. ‘అమ్మ’ చిత్రం తరువాత మళ్లీ ఆమెకు అవార్డు తెచ్చే చిత్రం ఇది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ రామ్‌నాథ్ కెమెరా: డి. ప్రసాద్‌బాబు, ఎడిటింగ్: శివ.