sachin wife Anjali
-
సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ
ముంబై: కెరీర్ ఆసాంతం ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన క్రికెట్ గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని భార్య అంజలీ టెండూల్కర్ వెల్లడించింది. వీరి జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 26 వసంతాలు పూర్తైన సందర్బంగా ఆమె సచిన్ ను గూర్చిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఆన్ ఫీల్డ్ బౌలర్లను గడగడలాడించే సచిన్ .. మైదానం వెలుపల మాత్రం మహా సిగ్గరి అని, అతను చాలా సున్నిత మనస్కుడని, అనవసరంగా ఎవరితో మాట కలపడని పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె.. సచిన్ తో 26 ఏళ్ల బంధాన్ని నెమరేసుకుంది. తాము మొట్టమొదటిసారి ఎయిర్ పోర్టులో కలిసామని, తమ పరిచయం ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా బలపడిందని చెప్పుకొచ్చింది. అయితే, సచిన్.. తనను మొదటిసారి అతని తల్లిదండ్రులకు ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడని, నన్ను అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు చాలా కసరత్తులే చేశాడని గుర్తు చేసుకుని నవ్వుకుంది. తమ పరిచయమైనా తొలినాళ్లలో ఇప్పటిలా ఇంటర్నెట్,. సోషల్ మీడియా సదుపాయాలు లేవని, ఫోన్లు ఉన్నప్పటికీ.. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో తాము ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవారిమని తెలిపింది. కాగా సచిన్, అంజలీల వివాహం 1995లో జరిగింది. వీరికి అర్జున్, సారా అనే ఇద్దరు సంతానం. కొడుకు అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన కోహ్లి దంపతులు .. -
ఇంగ్లండ్‌లో సచిన్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన భార్య
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో చిరస్మరణీమైన విజయాలు సాధించాడు. టీమిండియా విజయాల్లో దాదాపు రెండు దశాబ్దాలు కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు మధురమైన జ్ఞాపకాలు పంచాడు. కానీ సచిన్ జీవితంలో ఎన్నడూ మరచిపోలేని ఓ విషాదకర సంఘటన కూడా ఉంది. సచిన్ జీవిత చరిత్ర గురించి దేవేంద్ర ప్రభుదేశాయ్ రాసిన 'హీరో: ఏ బయోగ్రఫీ ఆఫ్ సచిన్ రమేష్ టెండూల్కర్' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1999లో వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ వెళ్లింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ మొదట్లో రాణించలేకపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి చవిచూడటంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. తర్వాతి మ్యాచ్ జింబాబ్వేతో ఆడాల్సివుంది. ఈ సమయంలో సచిన్ ఊహించని, విషాదకర వార్త విన్నాడు. లీసెస్టర్‌లో హోటల్ గదిలో సచిన్ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. సచిన్ వెళ్లి డోర్ తీయగా భార్య అంజలి కనిపించింది. ఆమె పక్కన క్రికెటర్లు అజయ్ జడేజా, రాబిన్ సింగ్ ఉన్నారు. సచిన్‌కు ఆ వార్త చెప్పేందుకు అంజలి లండన్ నుంచి అత్యవసరంగా లీసెస్టర్ వచ్చింది. సచిన్ తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త వినగానే సచిన్ షాకయ్యాడు. వెంటనే భార్య అంజలితో కలసి ముంబై వచ్చేసి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఇంగ్లండ్‌లో టీమిండియా రెండో లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడింది. సచిన్ లేని ఈ మ్యాచ్‌లో భారత్ మూడు పరుగులతో ఓడింది. టీమిండియా ప్రపంచ కప్ నాకౌట్లో ప్రవేశించాలంటే మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌లలో గెలిచి తీరాలి. ఇలాంటి సమయంలో జట్టుకు సచిన్ ఎంతో అవసరం. అతనిపై భారీ అంచనాలుండేవి. అయితే తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న సచిన్‌ను వెనక్కురమ్మని పిలవడానికి టీమిండియా మేనేజ్మెంట్కు మనస్కరించలేదు. ఆడాలా వద్దా అన్న విషయాన్ని సచిన్ నిర్ణయానికి వదిలేసింది. ఇలాంటి సమయంలో భర్తను పోగొట్టుకుని బాధలో ఉన్న సచిన్ తల్లి.. అతన్ని ఒప్పించి ఇంగ్లండ్ వెళ్లి ప్రపంచ కప్‌లో ఆడాల్సిందిగా చెప్పారు. తల్లి మాటపై గౌరవంతో సచిన్ బాధను గుండెల్లో దాచుకుని ఇంగ్లండ్ పయనమయ్యాడు. సచిన్ మళ్లీ వస్తున్నాడని తెలియగానే అభిమానులు, క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. కెన్యాతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేసి తన తండ్రికి అంకితమిచ్చిన దృశ్యం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. క్రికెట్ పట్ల సచిన్‌కు ఉన్న అంకితభావానికి, నిబద్ధతకు ఈ సంఘటన ఓ నిదర్శనం. ప్రపంచ క్రికెట్లో ఎవరూ సాధించలేని అరుదైన రికార్డులు కొల్లగొట్టిన సచిన్.. క్రీడాకారులకు, అభిమానులకు ఆదర్శనీయం.