ఇంగ్లండ్‌లో సచిన్‌కు షాకింగ్‌ న్యూస్ చెప్పిన భార్య | During World Cup, Sachin, Unwell, Was Told His Father Had Died | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌లో సచిన్‌కు షాకింగ్‌ న్యూస్ చెప్పిన భార్య

Published Mon, Apr 24 2017 4:16 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ఇంగ్లండ్‌లో సచిన్‌కు షాకింగ్‌ న్యూస్ చెప్పిన భార్య

ఇంగ్లండ్‌లో సచిన్‌కు షాకింగ్‌ న్యూస్ చెప్పిన భార్య

క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ ఎన్నో చిరస్మరణీమైన విజయాలు సాధించాడు. టీమిండియా విజయాల్లో దాదాపు రెండు దశాబ్దాలు కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు మధురమైన జ్ఞాపకాలు పంచాడు. కానీ సచిన్‌ జీవితంలో ఎన్నడూ మరచిపోలేని ఓ విషాదకర సంఘటన కూడా ఉంది. సచిన్‌ జీవిత చరిత్ర గురించి దేవేంద్ర ప్రభుదేశాయ్‌ రాసిన 'హీరో: ఏ బయోగ్రఫీ ఆఫ్‌ సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

1999లో వన్డే ప్రపంచ కప్‌ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ వెళ్లింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ మొదట్లో రాణించలేకపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి చవిచూడటంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. తర్వాతి మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడాల్సివుంది. ఈ సమయంలో సచిన్‌ ఊహించని, విషాదకర వార్త విన్నాడు. లీసెస్టర్‌లో హోటల్ గదిలో సచిన్‌ ఉండగా కాలింగ్‌ బెల్‌ మోగింది. సచిన్ వెళ్లి డోర్‌ తీయగా భార్య అంజలి కనిపించింది. ఆమె పక్కన క్రికెటర్లు అజయ్ జడేజా, రాబిన్ సింగ్‌ ఉన్నారు. సచిన్‌కు ఆ వార్త చెప్పేందుకు అంజలి లండన్‌ నుంచి అత్యవసరంగా లీసెస్టర్‌ వచ్చింది. సచిన్‌ తండ్రి, ప్రొఫెసర్‌ రమేష్‌ టెండూల్కర్‌ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త వినగానే సచిన్‌ షాకయ్యాడు. వెంటనే భార్య అంజలితో కలసి ముంబై వచ్చేసి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

ఇంగ్లండ్‌లో టీమిండియా రెండో లీగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడింది. సచిన్‌ లేని ఈ మ్యాచ్‌లో భారత్‌ మూడు పరుగులతో ఓడింది. టీమిండియా ప్రపంచ కప్‌ నాకౌట్‌లో ప్రవేశించాలంటే మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌లలో గెలిచి తీరాలి. ఇలాంటి సమయంలో జట్టుకు సచిన్‌ ఎంతో అవసరం. అతనిపై భారీ అంచనాలుండేవి. అయితే తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న సచిన్‌ను వెనక్కురమ్మని పిలవడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌కు మనస్కరించలేదు. ఆడాలా వద్దా అన్న విషయాన్ని సచిన్‌ నిర్ణయానికి వదిలేసింది. ఇలాంటి సమయంలో భర్తను పోగొట్టుకుని బాధలో ఉన్న సచిన్‌ తల్లి.. అతన్ని ఒప్పించి ఇంగ్లండ్ వెళ్లి ప్రపంచ కప్‌లో ఆడాల్సిందిగా చెప్పారు. తల్లి మాటపై గౌరవంతో సచిన్‌ బాధను గుండెల్లో దాచుకుని ఇంగ్లండ్‌ పయనమయ్యాడు. సచిన్‌ మళ్లీ వస్తున్నాడని తెలియగానే అభిమానులు, క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. కెన్యాతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో సచిన్‌ సెంచరీ చేసి తన తండ్రికి అంకితమిచ్చిన దృశ్యం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. క్రికెట్‌ పట్ల సచిన్‌కు ఉన్న అంకితభావానికి, నిబద్ధతకు ఈ సంఘటన ఓ నిదర్శనం. ప్రపంచ క్రికెట్లో ఎవరూ సాధించలేని అరుదైన రికార్డులు కొల్లగొట్టిన సచిన్‌.. క్రీడాకారులకు, అభిమానులకు ఆదర్శనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement