ముంబై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ ప్రపంచకప్ 2019 మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఇంగ్లండ్-వేల్స్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న క్రికెట్ మహాసంగ్రామంలో విజేత ఎవరనేదానిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్‌లో తన ఫేవరెట్ జట్టు ఏంటో ప్రకటించేశాడు. టీమిండియానే ప్రపంచకప్ గెలవడానికి అన్ని విధాల అర్హమైన జట్టని తేల్చిచెప్పాడు. టీమిండియా యువ ఆటగాళ్లతో బలంగా ఉందని.. దీంతో వరుస విజయాలతో దూసుకపోతోందని తెలిపాడు. గతంలో ఎన్నడూ లేనంతగా టీమిండియాకు బలమైన రిజర్వ్ బెంచ్ కలిగిఉండటం టీమిండియాకు అదనపు బలమని వివరించాడు.
ఒక్కటి రెండు మ్యాచ్‌లు ఓడినంత మాత్రానా కోహ్లి సేనపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నాడు. ప్రపంచకప్‌లో బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నాడు. ఇక సొంత మైదానంలో ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశమని ప్రస్తావించాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో దుర్బేద్యంగా ఉందని ప్రశంసించాడు. అన్నీ కలిసొస్తే ప్రపంచకప్ టీమిండియాదేనని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment