4.12 ఎకరాలు.. హుష్ కాకి!
- బహిరంగ వేలం జరగాల్సిన 83.11 ఎకరాల్లో 4.12 ఎకరాలు మాయం
- హైకోర్టు తీర్పుతో రెండోసారి వేలం నిర్వహించాల్సి వచ్చేసరికి తగ్గిన విస్తీర్ణం
- 83.11 ఎకరాలంటూనే 78.99 ఎకరాల సర్వే నెంబర్లతోనే నోటిఫికేషన్ జారీ
- వేలంలో భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ కొత్త ఎత్తుగడ
సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల కుంభకోణం మరో మలుపు తిరిగింది. అత్యంత ఖరీదైన ఆ భూములను కారుచౌకగా కొట్టేసే పన్నాగం వికటించే సరికి.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 4.12 ఎకరాల భూమిని ఏకంగా మాయం చేశారు. సత్రం భూములకు తిరిగి బహిరంగ వేలం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టంగా చెప్పేసరికి రెండో విడత వేలం నోటిఫికేషన్లో కొంత భూమిని మినహాయించారు. బహిరంగ వేలంలో అమ్మకానికి 83.11 ఎకరాలకు దేవాదాయ శాఖ ఆదివారం రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. అందులో 78.99 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే నంబర్ల వివరాలను మాత్రమే ప్రభుత్వం పొందుపరిచింది. చెన్నై నగర సమీపంలో ఉన్న తాళంబూరు గ్రామ పరిధిలో సదావర్తి సత్రం పేరిట 37 వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న భూములను బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందులో పేర్కొన్న విస్తీర్ణం 78.99 ఎకరాలు మాత్రమే ఉండటం సర్కారు మాయాజాలాన్ని బట్టబయలు చేస్తోంది.
పక్కా వ్యూహం బెడిసికొట్టే సరికి..
రాజా వాసిరెడ్డి కుటుంబీకులు 19వ శతాబ్దంలో చెన్నై నగర సమీపంలోని తాళంబూరు గ్రామంలో ఉన్న 471.76 ఎకరాల భూమిని సదావర్తి సత్రం పేరిట రాసిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ పెద్దల కన్ను ఈ భూములపై పడింది. ఇందులో అత్యంత విలువైన 83.11 ఎకరాలను కాజేయడానికి వ్యూహం రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా 2014 ఆగస్టు 18న గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తమ నియోజకవర్గంలోని సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న భూముల గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.
ఈ లేఖ ఆధారంగా సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని భూముల్లో 83.11 ఎకరాల అమ్మకానికి అనుమతి తెలుపుతూ 2015 ఏప్రిల్ 6వ తేదీన ప్రభుత్వం (మోమో నంబరు 28228) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవాదాయ శాఖ 2016 మార్చి 28వ తేదీన ఆ భూములకు అసంబద్ధంగా వేలం నిర్వహించింది. అప్పటి వేలంలో అత్యధిక బిడ్ దాఖలు చేసిన వారికి 83.11 ఎకరాల భూమిని రూ.22.44 కోట్లకు అమ్మడానికి అనుమతిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె.అనురాధ 2016 ఏప్రిల్ 21న సేల్ కన్పర్మేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వందల కోట్ల విలువ చేసే ఈ భూములను తెలుగుదేశం పార్టీ నేతలు కారుచౌకగా కొట్టేస్తున్నారని, ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం నిర్వహించిన వేలం ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను అంత కంటే ఎక్కువ ధరకు ఎవరూ కొనరని, రూ.5 కోట్లు అదనంగా ఎవరైనా ఇస్తే వారికే ఆ భూములు ఇచ్చేస్తామని ప్రభుత్వం వాదించింది. అదనంగా రూ.5 కోట్లు చెల్లించగలరా అని హైకోర్టు పిటిషన్ దారుని అడగడంతో ఆ మేరకు ఆర్కే సొమ్మును డిపాజిట్ చేశారు. దీంతో పిటిషన్‌దారుని వాదనను విశ్వసిన్తూ ఆ భూములకు తిరిగి వేలం నిర్వహించాలని ఆదేశించిన విషయం విదితమే. అయితే 83.11 ఎకరాల భూములకు వేలం అంటూనే 78.99 ఎకరాల సర్వే నంబర్లను మాత్రమే చూపుతూ 4.12 ఎకరాలను దాచే (మినహాయించే) యత్నం చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
భూమి వివరాలు చెప్పకుండా ఎలా కొంటారు?
సదావర్తి సత్రం భూముల అమ్మకానికి జారీ చేసిన రెండో విడత వేలం నోటిఫికేషన్లో మినహాయించిన 4.12 ఎకరాల భూమి గురించి సర్కారు విడ్డూరమైన వివరణ ఇచ్చింది. మొత్తం 83.11 ఎకరాల భూమిలో 78.11 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు మాత్రమే పేర్కొని.. మిగతా రోడ్లు అంటూ ఒక పదాన్ని జోడించింది. రోడ్డు ఉన్న భూమికి కూడా సర్వే నంబరు ఉంటుందని, ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో రోడ్డు ఉన్నట్టు పేర్కొంటున్నా, ఆ భూమి సర్వే నంబర్లు పేర్కొనకపోవడం చూస్తుంటే 4.12 ఎకరాల భూమి లేనట్టే అర్థం చేసుకోవాలని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అమ్మకానికి పెట్టిన భూమి సర్వే నంబర్ చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బహిరంగ వేలం నిర్వహిస్తుందని అధికారులు విస్తుపోతున్నారు. మినహాయించిన భూమి అత్యంత విలువైనదైతే కొనడానికి ఎవరు ముందుకు వస్తారు? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించడానికి ఇష్టపడని దేవాదాయ శాఖ కమిషనర్
రెండో విడత వేలం నోటిఫికేషన్లో 4.12 ఎకరాల భూమికి సర్వే నంబర్లు ఇవ్వకుండా మినహాయించడంపై దేవాదాయ శాఖ కమిషనర్ కె. అనురాధను ‘సాక్షి’ సంప్రదించగా ఆమె స్పందించ లేదు. మొదటి విడత వేలం సమయంలో ఉన్న ‘రిజిస్ట్రేషన్’ నిబంధనను రెండో విడత వేలం నోటిఫికేషన్లో పూర్తిగా మార్చేయడంపై కూడా స్పందించడానికి ఆమె నిరాకరించారు. ఈ రెండు విషయాలపై దేవాదాయ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ను స్పందించాల్సిందిగా ‘సాక్షి’ కోరగా.. వేలం ప్రక్రియను పూర్తిగా కమిషనర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
రిజిస్ట్రేషన్ నిబంధనే మార్చేశారు..
సదావర్తి సత్రం భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత వేలం సమయంలో ఉన్న కీలక నిబంధనలను రెండో విడత బహిరంగ వేలంలో పూర్తిగా మార్చేసింది. వేలం ద్వారా విక్రయించిన భూములకు సత్రం ఈవో రిజిస్ట్రేషన్ చేస్తారని తొలి విడత వేలం నోటిఫికేషన్ 23.1 నిబంధనలో స్పష్టంగా పేర్కొంది. వేలంలో నిర్ణయించిన ధర మొత్తాన్ని చెల్లించిన తర్వాత పాటదారుడు సొంత ఖర్చుతో ఆ భూములకు సదావర్తి సత్రం ఈవో ద్వారా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పింది.
తాజాగా రెండో విడత వేలం నోటిఫికేషన్‌కు వచ్చే సరికి.. బహిరంగ వేలంలో భూముల కొనుగోలు చేసిన వారికి దేవాదాయ శాఖ రిజిస్ట్రేషన్ చేయదని స్పష్టంగా పేర్కొంది. నోటిఫికేషన్‌లోని 14, 24 నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. బహిరంగ వేలంలో ఇతరులెవరూ పాల్గొనకుండా చేసే ఎత్తుగడలో భాగంగానే అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్కారు పెద్దలు ఈ నిబంధన పెట్టించారని సమాచారం.