
'సదావర్తి భూములను మళ్లీ వేలం వేస్తాం'
అద్దంకి(ప్రకాశం): సదావర్తి భూములను గతంలో పాడిన పాట కన్నా ఎక్కువ పాట పాడడానికి ఎవరైనా ముందకు వస్తే, మరలా బహిరంగ వేలం నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. ఇందుకు ఈ నెల 30 వరకు గడువు ఉందని చెప్పారు. ఎక్కువ నగదు వస్తే సంతోషమేనని, ఆ నగదుతో మరిన్ని సేవలను అందిస్తామన్నారు. శనివారం శ్రీశైలం వెళ్తూ మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా అద్దంకిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సదావర్తి భూములను తక్కువకు కట్టబెట్టారని పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. అలా ఎవరికీ కట్టబెట్టలేదని, భూములకు న్యాయబద్ధంగానే బహిరంగ వేలం నిర్వహించి ఎక్కువ పాట పాడిన వారికి ఇచ్చినట్టు చెప్పారు.
మొదటి సారిగా 1885 నుంచి ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి వేలం నిర్వహించగలిగామని చెప్పారు. ఆక్రమణల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల సలహాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయ భూములను ఆక్రమించిన వారి పేర్లను ఇప్పటికే దేవస్థానాల వద్ద బోర్డులపై రాసి ప్రదర్శిస్తున్నామని, త్వరలో వెబ్‌సైట్లో పెడతామని మంత్రి వెల్లడించారు.