Sadguru Jaggi Vasudev
-
సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట
ఢిల్లీ: ఈశా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఈశా ఫౌండేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మహిళలతో ఆన్లైన్లో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని ఇద్దరు యువతులు తెలిపారు. ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఇక.. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.ఇక.. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. -
అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్ రుచికా శర్మ ఇంటర్వ్యూ... నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు. ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్ మైండ్‌తో ఇండియాలో ట్రావెల్ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇 -
ఉపాధి పెంచే పెట్టుబడులు రావాలి
ఆర్థికంగా పురోగమించడంతో గడిచిన 20 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని... కరోనా వైరస్ కారణంగా ఎందరో పేదలు, వలస కార్మికులు మళ్లీ దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదం కనిపిస్తోందని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ పరిస్థితిని నివారించే అవకాశం ఉందన్నారు. ‘‘కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచదేశాలు తమ తయారీ వ్యవస్థల కోసం చైనా వెలుపలికి చూస్తున్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి’’ అని చెప్పారు. ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో ఆర్థికాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారాయన. ఆ వివరాలివీ... ► కోవిడ్‌తో తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేకులు పడొచ్చనే అంచనాలున్నాయి. అలా బయటకు వచ్చే సంస్థలు ఇండియావైపు చూసే అవకాశం ఉందా? కరోనా మహమ్మారితో మన ఆర్థికవ్యవస్థ కూడా బాగా దెబ్బతినేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నా... ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థ మనకు లేదు. ధనికులు ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు కానీ రోజు కూలీలు చాలామంది ఎంతో దుర్భర స్థితిని ఎదుర్కొంటారు. వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు గానీ రాకపోతే పెద్ద ఎత్తున జనం దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదముంది. చైనాపై ఇతర దేశాలకు నమ్మకం తగ్గుతోంది. అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన జపాన్... తమ కంపెనీలు చైనా నుంచి బయటకు వస్తే ప్రోత్సాహకాలిస్తోంది. ఇక అమెరికా ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు. అప్పుడు చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంతైనా ఇక్కడకు తరలిస్తే మనకు కలిసొస్తుంది. మన దేశానికి భౌగోళికంగా ఎన్నో అనుకూలతలున్నాయి. ఆయా దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ల పెట్టుబడులు ఇక్కడ సురక్షితమనే భావన కలిగించటం ముఖ్యం. ► చైనా వదిలి రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? చైనాలో 300కు పైగా విదేశీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో కొన్నయినా బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అదే జరిగితే దాదాపు 150 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోతాయి. వాటిలో కొంతయినా వచ్చే రెండేళ్లలో ఇక్కడికి వస్తే ఉపాధి గురించి ఆందోళన ఉండదు. కాకపోతే దీనికోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థల నుంచి గట్టి ప్రయత్నాలు జరగాలి. అధికార పరమైన అడ్డంకులు లేకుండా, భూమి, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు.. అన్ని రకాల ఆమోదాలను ఒకే వేదికపై అందించే ఏర్పాట్లుండాలి. ► రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాలంటారా? రాష్ట్రాలు ఇలాంటి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా చట్టపరమైన మార్పులు తేవాలి. పరిశ్రమలన్నీ ఒకే చోట కాకుండా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించాలి. దేశంలో వచ్చే పదేళ్లలో 20 కోట్ల మంది ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అదే జరిగితే నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అందుకే వ్యాపారాలు నగరాల్లోనే కేంద్రీకృతం కాకూడదు. మన న్యాయవ్యవస్థలో జాప్యం ఎక్కువ కనుక భారీగా పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాజ్యాల నుంచి కనీసం ఐదేళ్ల వరకైనా రక్షణ కల్పించాలి. ► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరైనదేనా? వలస కార్మికులు, పేదలకు ఇంకా ఏం చేయాలి? రాజకీయ ఉద్యమాలతోనో, మిలిటరీ బలంతోనో దేశం అభివృద్ధి చెందదని అర్థం చేసుకోవాలి. వ్యాపారాభివృద్ధితోనే ఇది సాధ్యం. దురదృష్టవశాత్తు దేశంలో సోషలిస్టు భావాలున్న శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు ఏ ఆర్థిక సాయం చేసినా... ‘ధనికులు మరింత ధనికులు అవుతున్నారు’ అంటూ వీళ్ళు మాట్లాడతారు. డబ్బులివ్వడం ద్వారా పేదవారిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకురాలేం. సరైన పరిశ్రమలతోనే ఇది సాధ్యం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కావాలి. అందరికీ గౌరవప్రదమైన జీవన భృతి దొరికేది అప్పుడే. (సాక్షి, బిజినెస్ ప్రతినిధి) -
భౌతికాతీత కోణాన్ని సజీవం చేయడమే యోగ
యోగా యోగా అంటే బరువు తగ్గటం కోసమో, సన్నబడటం కోసమో, నడుమునొప్పి, తలనొప్పి తగ్గటం కోసమో చేసేది కాదు. యోగా చేస్తే అవన్నీ ఎలాగూ జరుగుతాయి - మీరు ఎలాగూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా, సున్నితంగా తయారవుతారు. కానీ అవన్నీ యోగా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. అవి యోగా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మీరు బరువు తగ్గటానికి యోగా చేయనవసరం లేదు. అందుకోసం మీరు కొంచెం వివేకంతో తింటే, టెన్నిస్ ఆడితే లేదా ఈత కొడితే సరిపోతుంది. భౌతికాతీతమైన కోణాన్ని మీలో సజీవం చేయటమే యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. అది సజీవమైనప్పుడు మాత్రమే ఈ సృష్టి మెల్లిగా అనేక విధాలుగా మీకు అందుబాటులోకి వస్తుంది. భౌతికాతీతమైన కోణం మీలో సజీవం అవ్వటం వల్ల మీరెప్పుడూ ఊహించనటువంటి విషయాలు కూడా మీ జీవితంలో యథార్థాలుగా మారతాయి. మీరు యోగ చేస్తుంటే, అధికంగా ఉన్న బరువు కచ్చితంగా తగ్గుతుంది. ఉదాహరణకు, కొందరు క్రియ యోగా మొదలుపెట్టినప్పుడు బరువు తగ్గుతారు, మరికొందరు బరువు పెరగటం మొదలుపెడతారు. మీ జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, మీరు క్రియలు చేయడం మొదలుపెట్టినప్పుడు... మీ జీర్ణ శక్తి ఉత్తేజితం అవుతుంది. మీ జీర్ణశక్తి మెరుగవటం వల్ల, ఆహారం మాంసంగా మారటం మరింత సమర్థవంతంగా జరుగుతుంది. అందువల్ల మీరు బరువు పెరగటం మొదలు అవుతుంది. మీ జీర్ణశక్తి ముందే బాగుండి, మీరు క్రియలు చేయటం మొదలుపెడితే, అప్పుడు కూడా ఆహారాన్ని ఉపయోగించుకునే మీ సామర్థ్యం మరింత మెరుగవుతుంది. కానీ ఆహారం అప్పుడు మాంసంగా కాకుండా, ఒక సూక్ష్మమైన శక్తిగా మార్చబడుతుంది. అప్పుడు మీరు ఎంత తిన్నా మీ బరువు తగ్గుతూనే ఉండటమే మీరు గమనిస్తారు.అదే మరోవిధంగా కూడా జరగవచ్చు. మీరు తీసుకునే ఆహారం నాటకీయంగా తగ్గిపోవచ్చు. కానీ మీరు బరువు తగ్గకపోవచ్చు. మనలో ఆహారం రూపాంతరం చెందే నిష్పత్తి మారటం వల్లే ఇలా జరుగుతుంది. యోగా మీ వ్యవస్థను పునరుత్తేజితం చేసి, మీ విజ్ఞతను పెంపొందిస్తుంది. అందువల్ల మీరు అతిగా తినరు. మీ శరీరంలో కొంత స్థాయి అవగాహన రాగానే, దానికి అవసరమైనంతే తినేటట్లుగా అది మారుతుంది. మీరు మీ జీవితాన్ని నియంత్రించటం వల్లనో లేక ఎవరో మీకు డైటింగ్ చేయమని చెప్పటం వల్లనో ఇది జరగదు. మీరు వ్యాయామం లేక డైటింగ్ చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. యోగా సాధన చేస్తే, మిమ్మల్ని మీరు నియంత్రించుకునే అవసరం ఉండదు. మీరు కేవలం సాధన చేయండి. ఇది మీ వ్యవస్థను ఎలా చూసుకుంటుంది అంటే అది మిమ్మల్ని మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తిననివ్వదు. యోగా చేయడానికి, బరువు తగ్గటానికి చేసే మిగతా పనులకి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే! ప్రేమాశీస్సులతో,సద్గురు - సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org -
శబ్దం... శక్తిమంత్రం
సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org నాదయోగం పాథమికంగా ఈ అస్థిత్వంలో మూడు శబ్దాలు ఉన్నాయి. ఏ ఇతర శబ్దాన్నైనా ఈ మూడు శబ్దాలతో సృష్టించవచ్చు. ఒక చిన్న ప్రయోగంతో మీరు దీన్ని గమనించవచ్చు. నాలుకను వాడకుండా మీరు చేయగలిగిన శబ్దాలను చేయండి. నాలుకను వాడకుండా మీరు చేయగలిగే శబ్దాలు మూడే అని మీరు గమనిస్తారు. అవే ఆ, ఊ,మ్లు. మీ నాలుకను కోసేసుకున్నా మీరు ఈ మూడు శబ్దాలు చేయగలరు. వేరే ఏ శబ్దం చేయాలన్నా మీకు నాలుక వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ మూడు శబ్దాలను మీరు మీ నాలుకతో అనేక విధాలుగా కలిపి ఇతర అన్ని శబ్దాలను సృష్టించగలుగుతున్నారు. మీరు మీ నోటితో మిలియన్ శబ్దాలను సృష్టించగలరు. కానీ ఒక మూగ వ్యక్తి ఆ, ఊ, మ్ శబ్దాలను మాత్రమే చేయగలడు. ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్ఛరిస్తే ఏమి వస్తుంది? ఆమ్ (ఓం) వస్తుంది. ఆమ్ (ఓం) ఒక మతం యొక్క ట్రేడ్ మార్క్ (వ్యాపార చిహ్నం) కాదు. అది ఈ అస్థిత్వపు ప్రాథమిక శబ్దం. శివుడు కేవలం మూడుసార్లు ‘ఆమ్ (ఓం)’ అని ఉచ్ఛరించి ఒక కొత్త ఉనికిని సృష్టించగలడని అంటారు. ఇది నిజం కాదు. కానీ సత్యం! సత్యానికి, నిజానికి మధ్య తేడా ఏమిటి? ఉదాహరణకు ఒక స్త్రీని తీసుకుందాం. ఒకరు శారీరకంగా ‘స్త్రీ’ అయినంత మాత్రాన, ఆమె తండ్రి ఆమె పుట్టుకలో పాలుపంచుకోలేదా? దానర్థం ఆమెలో తన తండ్రి అంశ లేదనా? కాదు. నిజం ఏమిటంటే ఆమె ఒక స్త్రీ. కానీ సత్యం ఏమిటంటే ఆమెలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉన్నారు. అలాగే శివుడు ఎక్కడో కూర్చుని ఆమ్ (ఓం) అని ఉనికిని సృష్టిస్తాడని కాదు. అది కాదు విషయం. విషయం ఏమిటంటే ప్రతిదీ ఒక ప్రకంపనే! మంత్రం అంటే ఒక శబ్దం. ఒక ఉచ్ఛారణ లేక ఒక అక్షర ధ్వని. నేడు ఆధునిక విజ్ఞానం ఈ అస్థిత్వం మొత్తాన్ని ఒక శక్తి ప్రకంపనగా, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రకంపనగా చూస్తుంది. ఎక్కడైతే ప్రకంపనం ఉంటుందో అక్కడ శబ్దం ఉండి తీరుతుంది. అంటే ఈ మొత్తం అస్థిత్వం ఒక రకమైన శబ్దమని లేదా శబ్దాల సంక్లిష్ట సమ్మేళనమని లేక అనేక మంత్రాల సమ్మేళనమని అర్థం. వీటిలో కొన్ని మంత్రాలు లేక శబ్దాలు గుర్తించబడ్డాయి. వీటిని ఒక నిర్దిష్ట విధానంలో ఉపయోగిస్తే, అవి మీలోని ఒక భిన్న జీవిత పార్శ్వాన్ని తెరచి, మీకో భిన్న అనుభూతిని అందించగలిగే తాళంచెవిగా మారతాయి. మంత్రాలు చాలా మంచి సన్నాహక ప్రక్రియలు కాగలవు. కేవలం ఒక్క మంత్రమే మనుషులపై ఎంతో మహత్తరమైన ప్రభావాన్ని చూపగలదు. కానీ ఆ మంత్రం శబ్దాలన్నింటి గురించి, ఈ సృష్టినంతటి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన ఒక మూలం నుంచి వచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. అటువంటి మూలం నుంచి, అటువంటి అవగాహన నుంచి ఒక మంత్రం వస్తే... దాంతో పాటు అది స్వచ్ఛంగా అందించబడినప్పుడు, అది ఒక సమర్ధవంతమైన శక్తి కాగలదు. ప్రేమాశీస్సులతో,సద్గురు -
ఆసనాలను క్రమపద్ధతిలోనే ఎందుకు చేయాలి?
యెగా ఈ రోజుల్లో హఠయోగా వికృతరూపం తీసుకుంది. దీనికి కారణం అందరూ దీనిని ఒక సర్కస్‌లాగా తయారు చేయడమే. పశ్చిమదేశాల్లో ఇది జరుగుతున్న తీరు చూస్తుంటే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యోగా పేరుతో అన్ని రకాల పిచ్చి పనులు చేయబడుతున్నాయి. యోగాసనాలు ఒక వ్యాయామం కాదనీ, అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో ఉత్తేజపరిచే సున్నితమైన ప్రక్రియలనీ మీరు అర్థం చేసుకోవాలి. వీటిని చాలా సున్నితంగా వీలైనంత అవగాహనతో చేయడం చాలా ముఖ్యం. ఆసనాలను ఒక నిర్దిష్ట క్రమపద్ధతిలో చేయాలి. ఈ క్రమపద్ధతి మీరో, నేనో కనిపెట్టినది కాదు. ఇది మానవ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే దాన్ని గమనించడం వల్ల వచ్చినది. మీ వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ సౌఖ్యం, కండరాల సౌఖ్యం, అవయవ సౌఖ్యం, ప్రాణశక్తి సౌఖ్యం అనేవి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక ఏటవాలుగా ఉన్న కూర్చీలో కూర్చుంటే మీ కండరాలు సౌకర్యంగా ఉంటాయి కానీ, మీ కీళ్ళు, అవయవాలు ఇబ్బందికి గురవుతాయి. మీ ఉదర భాగంలోని ముఖ్యమైన అవయవాలు గట్టిగా నట్లు, బోల్టులతో బిగించబడి ఉండవు. అవి కణజాల బంధనంతో వేలాడతీయబడి ఉంటాయి. అందువల్ల ఏటవాలుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే వాటికి సౌకర్యంగా ఉండదు. హఠయోగాలో ప్రాణశక్తి సౌఖ్యం కూడా పరిగణించబడుతుంది. మీ ప్రాణశక్తిలోని ఒక అంశాన్ని ఉత్తేజపరచకుండా మరొక అంశాన్ని ఉత్తేజపరిస్తే, మీ వ్యవస్థ గందరగోళానికి గురి అయ్యేటట్లు మీ ప్రాణశక్తి అస్థవ్యస్థంగా పని చేస్తుంది. అస్థవ్యస్థ శక్తి అంటే మీరు అస్థవ్యస్థంగా జీవిస్తున్నారని అర్థం. మీరు ఎక్కువ రోజులు జీవించవచ్చు, లాటరీ గెలవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, రోజుకు 24 గంటలు పూజ చేయవచ్చు. కానీ మీరు ఎప్పుడూ సంపూర్ణమైనవారు కాలేరు. మీరు ఏమి చేసినా సరే, మీది ఒక అస్థవ్యస్థ జీవనమే అవుతుంది. ఆసనాలు క్రమపద్ధతిలో చేయడం ద్వారా మానవ వ్యవస్థను ఒక చివరి నుంచి మరొక చివరి వరకు ఒక క్రమపద్ధతిలో ఉత్తేజపరచవచ్చు. జీవన పరిస్థితులు అకస్మాత్తుగా మారవచ్చు. అవి ఎలా మారితే మీరు అలా పని చేయవలసి రావచ్చు. మీరు వ్యవస్థను ఒక పద్ధతిలో ఉత్తేజపరిస్తే, ఏది జరిగినా మీ వ్యవస్థను కలత పెట్టకుండా మీరు వాటిని ఎదుర్కోగలరు. ఎవరైనా దీన్ని స్పష్టంగా చూడొచ్చు. మీరు సరైన సాంప్రదాయ హఠయోగాని చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి మిమ్మల్ని చెదరగొట్టలేవు. ప్రేమాశీస్సులతో - మీ సద్గురు గమనిక: గత వారం ‘యోగా’ శీర్షిక కింద ఇచ్చిన ‘ప్రాణాయామం’ వివరాలు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చినవి కావు.