'కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు'
హైదరాబాద్ : సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విరుచుకు పడ్డారు. కాంగ్రెస్కు ఏం కావాలో ఆపార్టీ నేతలకే తెలియదని ఆయన విమర్శించారు. ఓటమిని జీర్ణించులేకే ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా నిందిస్తోందని వెంకయ్య అన్నారు. మోదీపై పరమ చెత్త ఆరోపణలు చేసినవారు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చర్చ జరిగితే వారి భండారం బయటపడుతుందని తమాషాలు చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు.
కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని..ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు, సంస్థలను కించపరిచేవారా మాకు చెప్పేది అంటూ వెంకయ్య ప్రశ్నించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని, సభా సంప్రదాయాలను మంటగలుపుతోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీగా కశ్మీర్లో బీజేపీ నిలుస్తుందని వెంకయ్య జోస్యం చెప్పారు.బెంగల్లో కూడా బీజేపీ ప్రభంజనం వీస్తుందన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్ నాల్గో స్ధానంతో సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు.