Safe Locker
-
ఏటీఎం మిషన్లలో చోరీ
రూ.16,700 అపహరణ.. రూ.5 లక్షలు భద్రం పాపన్నపేట: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రెండు ఏటీఎంలలో దొంగలు పడి రూ.16,700లు ఎత్తుకెళ్లారు. కాగా, సేఫ్లాకర్లోని రూ.5లక్షలు మాత్రం భద్రంగా ఉన్నాయి. పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి కథనం ప్రకారం... కొందరు దుండగులు సోమవారం రాత్రి గడ్డపారలు తీసుకొచ్చి టాటా ఇండికం ఏటీఎం షట్టర్ పగలగొట్టారు. లోనికి ప్రవేశించి రెండు ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసి రూ.16,700 దోచేశారు. సేఫ్ లాకర్ తెరచుకోకపోవడంతో అందులో ఉన్న రూ.5 లక్షలు భద్రంగా మిగిలిపోయాయి. కాగా, సీసీ పుటేజీలో చోరీ తాలూకు దృశ్యాలు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి, క్లూస్‌టీం, ఏఎస్ఐ రాజశేఖర్ సందర్శించారు. -
ఏపీజీవీబీలో రూ.4.50 కోట్ల సొత్తు చోరీ
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) శాఖలో శనివారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షలతో పాటు సుమారు నాలుగున్నర కోట్ల విలువైన 13.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి...బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఏపీజీవీబీ శాఖ ఉంది. శనివారం అర్థరాత్రి దాటాక కొందరు దుండగులు గ్రిల్ ను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల కనెక్షన్లు తొలగించి సేఫ్ లాకర్‌ను గ్యాస్ కట్టర్ సాయంతో కోశారు. అందులో ఉన్న 13.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదుతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలు, ఐపీ స్టార్లను సైతం తమ వెంట తీసుకెళ్లారు. ఆదివారం సెలవు కావటంతో ఈ విషయం ఎవరూ గమనించలేదు. సోమవారం ఉదయం ఉద్యోగులు బ్యాంకుకు రాగా దొంగతనం బయటపడింది. దీని వెనుక పెద్ద ముఠా హస్తమే ఉండొచ్చని, పక్కా ప్రణాళికతోనే దుండగులు దోపిడీకి పాల్పడ్డారని డీఐజీ శశిధర్‌రెడ్డి తెలిపారు. ముందుగా రెక్కీ నిర్వహించి దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు వారు భావిస్తున్నారు. క్లూస్‌టీం అధికారులు, డాగ్ స్క్వాడ్ విచారణ జరిపారు. ఇదిలా ఉండగా, బ్యాంకులో రూ. 2.4 కోట్ల బంగారు రుణాలను ఇచ్చామని, చోరీకి గురైన బంగారమంతా ఖాతాదారులు దాచుకున్నదానితో పాటు రుణాల కోసం తాకట్టు పెట్టిందేనని మేనేజర్ రవికిశోర్‌రెడ్డి చెప్పారు.