saffron dress
-
యూపీ సీఎం కార్యాలయానికి కాషాయం రంగు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ నిత్యం కాషాయ దుస్తులు ధరిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కార్యాలయ భవనానికీ కాషాయ హంగులు అద్దనున్నారు. సీఎం కార్యాలయమున్న లాల్‌బహదూర్ శాస్త్రి భవన్‌కు కాషాయం పెయింట్ వేయాలని నిర్ణయించారు. ఆదిత్యనాథ్ కార్యాలయంలోని టవళ్లు, టేబుల్ కవర్లు కూడా కాషాయ రంగులోనే ఉంటాయి. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల కోసం పలు రంగుల్ని పరిశీలించినప్పటికీ కాషాయమే అత్యుత్తమంగా తేలిందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమర్నాథ్ అగర్వాల్ స్పందిస్తూ..‘ ఏ రంగు కూడా చెడ్డది కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయాకు సైతం కాషాయం రంగు వేయడం మొత్తం పరిపాలనా వ్యవస్థను కాషాయీకరణం చేయడమే’ అని మండిపడ్డారు. ఇటీవల యోగి ఆవిష్కరించిన 50 బస్సులకు కూడా కాషాయం రంగు వేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ శిలాఫలకాలను కాషాయ వస్త్రాలతో అలంకరించడంతో పాటు బెలూన్లు కూడా కాషాయ రంగులోని వాటినే వాడారు. చివరికి రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు కాషాయ రంగులో ఉన్న బ్యాగులనే అందజేశారు. అంతేకాకుండా యోగి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా అందించిన బుక్లెట్లను, ప్రభుత్వం అందించిన సమాచార డైరీలను కూడా ఈ రంగుతోనే ముద్రించారు. -
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
-
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
తాను కాషాయ దుస్తులు వేసుకుంటాను కాబట్టి తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అయితే తాను అన్ని వర్గాలకు చెందినవారి హృదయాలను గెలుచుకుంటానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్నాళ్లుగా లౌకికవాదం పేరుతో భారతీయ సంప్రదాయాలను అవమానిస్తున్న వాళ్లు తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత భయపడుతున్నారని చెప్పారు. తాను కాషాయం వేసుకుంటానని, దేశంలో చాలామందికి అసలు కాషాయం అంటే ఇష్టం లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక 'ఆర్గనైజర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తన పనితీరుతో అన్ని వర్గాలను మెప్పిస్తానని, అందరికీ సంతోషం పంచుతానని చెప్పారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ఇంతకుముందులాగే సేవ చేయాలనే వచ్చానని యోగి చెప్పారు. దేశాన్ని కాపాడటమే తన ప్రభుత్వ ప్రధాన ధర్మమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి రహిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అందిస్తామని, సమాజం నుంచి గూండా రాజ్యాన్ని తరిమేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లోనే ప్రభావం స్పష్టం కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెస్తామని, ఏ పరిశ్రమలోనైనా ఇక నుంచి 90 శాతం మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్ వాళ్లే అయ్యేలా చూస్తామని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 14 రోజుల్లోగా చెల్లిస్తామని, రాబోయే ఆరు నెలల్లో కొత్తగా ఐదారు చక్కెర కర్మాగారాలు నెలకొల్పుతామని అన్నారు.