విజ్ఞతతో అడుగేయాలి
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఆర్థిక సమస్యలపైనా...త్వరలో జరగబోయే పర్యావరణ శిఖరాగ్ర సమావేశంపైనా, యూరప్ ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యపైనా ప్రధానంగా దృష్టి సారించాల్సిన జీ-20 దేశాలకు ఇప్పుడు ఉగ్ర వాదం కీలకాంశంగా మారింది.
టర్కీ తీరంలోని అంటాల్యా నగరంలో ఆదివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ప్రస్తుతం తన ఎజెండాను పక్కనబెట్టి పారిస్ మారణహోమంపై చర్చిస్తున్నది. ప్రపంచంలోని 85 శాతం ఆర్థిక వ్యవస్థలకు జీ-20 ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఇది సమీక్షించాల్సి ఉంది. దేశాల ఆర్థిక వ్యవస్థలను కుంగదీస్తున్న నల్ల డబ్బు బెడద విషయంలో కఠినంగా వ్యవహరించాలని మన దేశం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది.
ఏవేవో సాకులు చెప్పి చాలా దేశాలు నల్ల కుబేరుల వివరాలు ఇవ్వడానికి ముందు కు రావడం లేదు. పన్నుల ఎగవేత, నల్లడబ్బు లాంటి సమస్యలు వర్ధమాన దేశాల అభివృద్ధికి ఆటంకంగా పరిణమించాయని భారత్ ఆందోళన పడుతోంది. దేశాలన్నీ పారదర్శకతను పాటిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నది. అలాగే ఎన్నారైలు, వివిధ వ్యాపారాలు చేసేవారూ భారత్‌కు పంపే సొమ్ముపై లావాదేవీల భారాన్ని తగ్గించాలని మన దేశం కోరుతోంది.
2013లో ఇలా దేశంలోకి వచ్చిన సొమ్ము 7,000 కోట్ల డాలర్లు. ఈ లావాదేవీల వ్యయం దాదాపు 10 శాతం ఉండేది. మన దేశం గట్టిగా డిమాండ్ చేయడంవల్ల ప్రస్తుతం అది 7.5 శాతానికి వచ్చింది. 2030కల్లా దీన్ని 3 శాతానికి తీసుకురావాలని కోరుకుంటోంది. అంతేకాదు... వేర్వేరు దేశాలనుంచి వచ్చిపడుతున్న నిధుల వరదతోనే ఉగ్రవాదం వర్థిల్లుతున్న దని, దాన్ని ఆపగలిగినప్పుడే ఆ సమస్యను దుంపనాశనం చేయడం సాధ్యమ వుతుందని మన దేశం వాదిస్తోంది. అల్ కాయిదా, ఐఎస్ వంటి సంస్థలకు జీ-20 సభ్య దేశాల ఆర్థిక సంస్థల ద్వారానే నిధులు వెళ్తున్నాయి. ఇలాంటి సమస్యల న్నిటిపైనా చర్చ పెట్టాలని మన దేశం భావించింది.
ఈ సమావేశంలో సిరియాపై అమీ తుమీ తేల్చుకోవాలని టర్కీ అనుకుంది. సిరియా విషయంలో అమెరికా నాన్చుడు వైఖరిపై అది ఆగ్రహంతో ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను సాధ్యమైనంత త్వరగా పదవీచ్యుతుణ్ణి చేస్తే తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కొనలేమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా 2009 తర్వాత టర్కీకి రావడం ఇదే ప్రథమం. ఆనాటి పర్యటన పర్యవసానంగా రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యం, సహకారం పెరిగాయి.
సిరియాతో తమకుండే తగువును అమెరికా ద్వారా పరిష్కరించుకోవా లన్నది ఎర్డోగాన్ ఎత్తుగడ. కనుకే సిరియాపై సైనిక చర్య తీసుకుంటే దాని పర్యవ సానంగా వచ్చిపడే సామాజిక, ఆర్థిక సమస్యలను భరించడానికి... ముఖ్యంగా 20 లక్షలమంది శరణార్థుల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన గతంలో చెప్పారు. స్వదేశంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో నిండా కూరుకుపోయి, తీరిక దొరక్క ఎర్డోగాన్ ఎటూ కదల్లేకపోయారు గానీ...లేకుంటే ఆయన జీ-20 ఎజెండాలో సిరియా సమస్యను తెచ్చిపెట్టేవారే. కానీ ఐఎస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం ఇక తనవల్లగాదని ఇప్పటికే గ్రహించిన అమెరికా...ఆ విషయంలో సిరియా సహకారాన్నీ, ఇరాన్ తోడ్పాటునూ కోరుకుంటోంది. మారిన ఈ పరిణామం ఎర్డోగాన్‌కు మింగుడుపడటం లేదు.
పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం మాటలకందనిది. అందువల్లే 129మందిని పొట్టనబెట్టుకుని, మరో 352మందిని గాయపరిచిన ఆ ఉన్మాదుల చర్యను సదస్సులో మాట్లాడిన దేశాధినేతలంతా తీవ్రంగా ఖండించారు. ఆ మహమ్మారితో కఠినంగా వ్యవహరించేందుకు సమష్టిగా కదులుదామని ప్రకటిం చారు.
దాంతోపాటు యూరప్ దేశాలకు ఇప్పుడు పెనుముప్పుగా పరిణమించిన శరణార్థుల సమస్యపై కూడా వారు దృష్టిసారించారు. ఇవి రెండూ సంబంధంలేని అంశాలు కాదు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంతేకాదు...పారిస్ మారణహోమంపై అందుతున్న తాజా సమాచారాన్నిబట్టి చూస్తే ఈ రెండు అంశాలూ అక్కడ జరిగిన బీభత్సానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
శరణార్థుల రూపంలో వచ్చిన ఉగ్రవాదులు దాడికి పథక రచన చేసి ఉండొచ్చునని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయంటున్నారు. కనుక యూరప్ దేశాలు సరిహద్దుల పహారాను మరింతగా పెంచి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాకే శరణార్థులను అనుమతించాలని ఈ శిఖరాగ్ర సదస్సు కోరబోతున్నదని చెబుతున్నారు. అయితే ఉగ్రవాదానికి దారితీసిన పరిస్థితుల్ని సమీక్షించకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఆచరణలో ఫలితాన్నివ్వవు. సరిగదా వికటించి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయి.
సిరియాకూ, తమకూ ఉన్న సమస్యల్ని అంతర్జాతీయం చేసి లాభపడదామని టర్కీ ప్రయత్నించడం...స్వప్రయోజనాలను ఆశించి అమెరికా, నాటో దేశాలు దానికి పక్కతాళం వేయడం...అసద్‌ను పదవి నుంచి దించడానికి ఆయన వ్యతిరేకులకు విచక్షణారహితంగా డబ్బు, ఆయుధాలు అందించడం పర్యవసానంగానే ఐఎస్ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చిందని విస్మరించ కూడదు. అది సిరియా, లిబియా, ఇరాక్ తదితర ప్రాంతాల్లో సాగిస్తున్న మారణ హోమం వల్లనే కొంపా గోడూ వదిలి లక్షలాదిమంది శరణార్థు లుగా వస్తున్నారు.
తాము సమావేశం నిర్వహించుకునే చోటకు కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియాలో ఊళ్లన్నీ వల్లకాడుల్లా మారాయని జీ-20 దేశాధినేతలు తెలుసుకోవాలి. సమస్య తమ సృష్టే గనుక కనీసం పరిష్కారం విషయంలోనైనా విజ్ఞతతో వ్యవహరించాలన్న స్పృహ ధనిక దేశాలకు కలగాలి. జీ-20 శిఖరాగ్ర సదస్సు అందుకు దోహదపడితే ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం సులభమవుతుంది.