
జీవిత రహస్యాలన్నీ సత్యాలేనని నమ్మే పని లేదు. వాటిలో నమ్మకాలు కూడా కొన్ని ఉంటాయి. గంపలో కలిసిపోయినట్లు గుట్టుగా అవన్నీ సత్యాలలో కలిసి ఉంటాయి. నమ్మకాలను సత్యాలను వేరు చేసే పని వల్ల ఎవరికీ ప్రయోజన లేదు. ఇవాళ్టి సత్యం నిన్నటి నమ్మకం కావచ్చు. నేటి సత్యం రేపటికి ఒట్టి నమ్మకంగా మిగలవచ్చు. సత్యమూ, వాస్తవమూ కాని అలాంటి ఒక ప్రపంచంలో జీవించడానికి, అలాంటి ఒక ప్రపంచాన్ని భరించడానికి మనిషి ఇష్టపడడు. కానీ తాత్వికత అంటుంది... మనిషి ఒక దశకు చేరాక ఏ ప్రపంచమైనా ఒక లెక్కకు రాదని! అంటే, ప్రపంచాన్ని దాని నెత్తిపై నుంచి చూసేందుకు వీలైన ఒక పెద్ద చెట్టుపైన... అనుభవం, విజ్ఞత అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసి మనిషిని అతడి డెబ్బయవ యేటో, ఎనభయ్యవ యేటో లేపి కూర్చోబెడతాయని.
నాకైతే నమ్మకం లేదు మనిషి ఎదుగుతాడని. జీవితపు ప్రారంభ సందర్భాలలో అతడికి నచ్చిన క్షణాలో, నచ్చని క్షణాలో ఏవో కొన్ని పోగుపడి ఉంటాయి. వాటితో ఒళ్లంతా చిక్కు ముడులు వేసుకుని అక్కడే సౌఖ్యంగా దుఃఖిస్తూనో, విషాదంలో సుఖిస్తూనో ఉండిపోతాడు. చివరికి అక్కడే ఒరిగిపోతాడు. అదే అతడి ఎదుగుదల. అదే అతడి ఉత్కృష్ట స్థితి. లేదా ఎదిగేందుకు ఇంకేమీ లేని స్థితి. అందుకే మన జీవితాన్వేషణలు రోజూ ఉదయాన్నే మొదలై, చీకటి పడేవేళకు ఇంటికి చేరుకుంటాయి. మధ్యలో ఏం దొరికినట్లు. బయల్దేరిన చోటికే రాకతప్పదన్న ఒక జీవిత సత్యమా? (ఇంగ్లండ్ కవి టి.ఎస్.ఇలియట్ స్వగతాల్లోంచి కొంత భాగం)
Comments
Please login to add a commentAdd a comment