క్షమించండి... 4న హాజరవుతా
న్యూఢిల్లీ: నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను రద్దు చేయాలని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాయ్‌ని అరెస్ట్‌చేసి మార్చి 4వ తేదీన తన ముందు హాజరుపరచాలని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం బుధవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా రూ.25 వేల కోట్ల సమీకరణ, మదుపరులకు పునః చెల్లింపుల్లో వైఫల్యం కేసులో సెబీ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లను విచారిస్తున్న సుప్రీం ఈ అంశంపై రాయ్ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. తాను స్వయంగా సమన్లు జారీ చేసినా రాయ్ పట్టించుకోకపోవడంతో బుధవారం అరెస్ట్ వారంట్ ఇచ్చింది.
దీనిపై గురువారం రాయ్ రికాల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ధర్మాసనం ముందు హాజరుకాకపోవడంపట్ల బేషరతు క్షమాపణలు చెప్పిన ఆయన, అరెస్ట్ వారంట్ రద్దు కోరారు. కోర్టు ముందు వ్యక్తిగతంగా ఎప్పుడైనా హాజరుకావడానికి తాను సిద్ధమని రాయ్ విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు రాయ్ అరెస్ట్‌కు సుప్రీం వారంట్‌తో ఢిల్లీ పోలీసులు లక్నో చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రాయ్ రికాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి రూలింగ్ ఇస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.