ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను!
బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగుమౖతైన అందాలభరిణి సాయేషాసైగల్. అందమొక్కటే కాదు చక్కని అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంకా చెప్పాలంటే ఆ సాయేషాలోని నాట్యకళాకారిణి ఆమెకు అదనపు క్వాలిపికేషన్గామారింది. తొలి చిత్రం వనమగన్ చిత్రంతోనే ప్రశంసలు అందుకుంటున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్ మనవరాలన్నది గమనార్హం. అంత పెద్ద నట వంశానికి చెందిన సాయేషా నటిగా తొలుత టాలీవుడ్లో కథానాయకిగా పరిచయం అవడం విశేషం. తరువాత కోలీవుడ్‌కు అడుగుపెట్టింది. ఇక్కడ వనమగన్ చేతిలో ఉండగానే కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో విశాల్, కార్తీలతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్న లక్కీ భామ సాయేషాతో చిన్న చిట్‌చాట్.. – తమిళసినిమా
♦ హిందీలో పెద్ద నట కుటుంబానికి చెందిన మీరు నటిగా దక్షిణాదిని ఎంచుకోవడానికి కారణం?
నేను సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయినైనా సినిమా నన్ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదు. నేను ఇష్టపడే నటించడానికి వచ్చాను. దక్షిణాది ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను తొలుత తమిళ చిత్రంలోనే నటించాలని ఆశ పడ్డా.అయితే అందుకు సరైన అవకాశం రాలేదు. నేను నటించిన తెలుగు చిత్రం అఖిల్ చూసి దర్శకుడు విజయ్ కోలీవుడ్‌లో అవకాశం కల్పించారు.
♦ కోలీవుడ్‌లో మీ తొలి హీరో జయంరవి గురించి?
తమిళ భాష తెలియదు.అయితే షూటింగ్ ష్పాట్లో జయంరవి, దర్శకుడు విజయ్ చాలా సహకరించారు. ప్రతి కొత్త హీరోయిన్‌కు జయంరవితో నటించే అవకాశం వస్తే అది వరమే అవుతుంది.
♦ వనమగన్ చిత్రంలో డాన్స్‌లో దుమ్మురేపారటగా?
నాకు నటన కంటే నాట్యంపైనే మోహం అధికం. శాస్త్రీయ నాట్యం నుంచి పాశ్చాత్య నాట్యం వరకూ సంప్రదాయబద్దంగా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా సమయం లభిస్తే నాట్యంలో శిక్షణ పొందుతాను. ఒక వేళ నేను నటినవ్వకుంటే నాట్యకళాకారిణిని అయ్యేదాన్ని.
♦ ప్రభుదేవా దర్శకత్వంలో నటించడం గురించి?
ప్రభుదేవా వనమగన్ చిత్రంలో ఒక పాటలో నాతో అద్భుతంగా డాన్స్ చేయించారు. ఒక డాన్సర్‌గా నేను ఆయకు వీరాభిమానిని. ప్రభుదేవా నటించిన ఏబీసీడీ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో.అలాంటిది నన్ను విశాల్, కార్తీ వంటి ప్రముఖ హీరోలతో నటింపజేస్తున్నారు. నాపైన ఆయన నమ్మకాన్ని వమ్ముకానీయను.
♦ మిమ్మల్ని నటి హన్సికతో పొల్చడం గురించి?
ఇదే విషయాన్ని చాలా మంది నాతో అన్నారు. అయితే నన్ను ఎవరితోనూ పోల్చరాదన్నది నా భావన. నేను నేనుగానే ఉండాలనుకుంటున్నాను. ఇక సినిమాలో ఎవరూ ఎవరి స్థానాన్ని చేజిక్కించుకోలేరు. ఎవరి స్థానం వారికుంటుంది. నాకంటూ ఒక స్థానాన్ని తమిళ ప్రేక్షకులు కచ్చితంగా అందిస్తారన్న నమ్మకం నాకుంది.