వర్సిటీలకు పునర్వైభవం
* ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడతాం: కడియం
* అన్ని వర్సిటీల్లో ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి
* ఫ్యాకల్టీ, వసతుల్లేక న్యాక్ గుర్తింపు రావడం లేదు
* ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని వెల్లడి
* 11 వర్సిటీల ఇన్చార్జి వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దాదాపు అన్ని వర్సిటీల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, వాటిని చక్కదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల స్థితిగతులపై శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో 11 వర్సిటీల ఇన్చార్జి వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లతో కడియం సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దాదాపు అన్ని వర్సిటీల్లో బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులున్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారని కడియం చెప్పారు. ఫ్యాకల్టీ నియామకం జరగక, వసతులను ఏర్పాటు చేయక విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు పొందలేకపోయాయని పేర్కొన్నారు. యూజీసీ గుర్తింపునకు కూడా నోచుకోని పరిస్థితుల్లో వర్సిటీలు ఉన్నాయన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యాపరంగా, ఆర్థికంగా క్రమశిక్షణను తెచ్చేందుకు ప్రభుత్వపరంగా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ శైలజా రామయ్యర్, ఇతర వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
తాజా నిర్ణయాలివీ..
- రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో, అనుబంధ, గుర్తింపు కలిగిన కళాశాలలు, హాస్టళ్లలో డిసెంబర్ 31 లోగా బయోమెట్రిక్ వ్యవస్థలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
- వర్సిటీలకు చెందిన భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలి. భూములు, ఆస్తులు, పరికరాలు, ఫర్నిచర్ తదితర వివరాలను డాక్యుమెంటేషన్ చేపట్టాలి. భూముల విషయమై సమస్యలుంటే
సంబంధిత జిల్లా కలెక్టర్ సహకారంతో పరిష్కరించుకోవాలి. అవసరమైతే ఆయా భూములకు ప్రహరీలు నిర్మించాలి.
- విశ్వవిద్యాలయాలు జారీ చేస్తున్న డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు, స్కాలర్‌షిప్‌ల వివరాలను దశలవారీగా కంప్యూటరైజేషన్(ఆన్లైన్)చేయాలి.
- {పతి వర్సిటీలోనూ ఈ-లైబ్రరీల ఏర్పాటు, విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ప్రాంగణాల్లో ఇంటర్నెట్, వైఫై సదుపాయాల కల్పన.
- ఉన్నత విద్యామండలి సిఫారసుల మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2016-17) నుంచి సిలబస్‌లో మార్పులు.
- యూజీసీ నిబంధనల మేరకు ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్’ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్(డిగ్రీ) కోర్సులకు వర్తింపజేస్తారు.
- వర్సిటీల వారీగా మంజూరైన పోస్టులు, ప్రస్తుత ఖాళీల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని... కొత్త కోర్సులు, అవసరమైన పోస్టుల వివరాలను పేర్కొనాలని అధికారులకు సూచన. ఆ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే నియమాకాలు చేపడతారు.
- యూనివర్సిటీల్లో పరిశోధనలకు అధిక ప్రాధాన్యత, మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు. సేవలను విస్తరించడం ద్వారా వర్సిటీల స్వయం సమృద్ధికి చర్యలు.
- భవనాల నిర్మాణానికై ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు పంపితే, అవసరమైన మేరకు నిధులు కేటాయింపు.
- విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీల్లో నిలబడేలా ప్రమాణాల పెంపు. జేఎన్టీయూహెచ్ను పైలట్‌గా తీసుకొని ఇతర వర్సిటీలకు ఆదర్శంగా నిలిపేలా చర్యలు.