మొదలైంది..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : గుంతకల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఇన్చార్జ్ చిచ్చు రేగింది. పార్టీ ఫండ్‌గా భారీ ఎత్తున ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేతకు అనంతపురం లోక్‌సభ టికెట్ హామీ ఇచ్చిన చంద్రబాబు.. మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులుకు సర్ది చెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే కాలవ శ్రీనివాసులే గుంతకల్లు నుంచి శాసనసభకు పోటీ చేస్తాననే ప్రతిపాదన తేవడంతో చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
గుంతకల్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, దివంగత సాయినాథ్‌గౌడ్ సోదరుడు జితేంద్రగౌడ్ తనకు ఇన్చార్జ్ పదవి ఇవ్వాలని బుధవారం చంద్రబాబును కోరారని, ఆయన ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో జితేంద్రగౌడ్ అసంతృప్తికి లోనయ్యారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. 1989లో గుత్తి నియోజజకవర్గం(ప్రస్తుత గుంతకల్లు) నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.సాయినాథ్‌గౌడ్ రాజకీయ అరంగేట్రంలోనే ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో సాయినాథ్‌గౌడ్‌కు టీడీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయారు.
కానీ.. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో సాయినాథ్‌గౌడ్‌కు టీడీపీ అధిష్టానం మరోసారి టికెట్ ఎగ్గొట్టింది. 2009 ఎన్నికల్లో సాయినాథ్గౌడ్ను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపినా ఓడిపోయారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీకి మొదటి నుంచి సాయినాథ్‌గౌడ్ కుటుంబం అండగా నిలుస్తూ వచ్చింది. సాయినాథ్‌గౌడ్ మృతి చెందిన తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఆయన సోదరుడు జితేంద్రగౌడ్నో.. తనయుడు ప్రవీణ్కుమార్గౌడ్నో చంద్రబాబు ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు భావించాయి.
అదే అభిప్రాయంతో సాయినాథ్‌గౌడ్ కుటుంబం కూడా ఉంది. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు తద్భిన్నమైన ఎత్తు వేశారు. అనంతపురం లోక్‌సభ టికెట్ తనకు ఇస్తే భారీ ఎత్తున పార్టీ ఫండ్ ముట్టచెబుతానని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్‌తో ఎగిరి గంతేసిన చంద్రబాబు పార్టీ శ్రేణుల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా లోక్‌సభ టికెట్ ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి, ఓడిపోయిన మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులును సంతృప్తి పరచడానికి గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దించాలని నిర్ణయించారు.
తద్వారా కాలవ శ్రీనివాసులు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలని ఎత్తు వేశారు. చంద్రబాబు ఎత్తు వేసేలోగానే.. అనంతపురం లోక్‌సభ స్థానం కన్నా గుంతకల్లు శాసనసభ స్థానమే తనకు సురక్షితమని భావించిన కాలవ శ్రీనివాసులు తనకు ఆ టికెట్ కేటాయించాలని కోరారు. తన పని మరింత సులభమైందని భావించిన చంద్రబాబు.. వెంటనే కాలవ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కుటుంబ పెద్ద పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సాయినాథ్‌గౌడ్ కుటుంబాన్ని ఇది నిర్ఘాంతపరచింది. పాతికేళ్లుగా పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన తమను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారని.. టీడీపీ అంతర్గత సమావేశాల్లో పలు సందర్భాల్లో సాయినాథ్‌గౌడ్ సోదరుడు జితేంద్రగౌడ్ లేవనెత్తారు. ఈ అంశంపై తేల్చుకోవడానికి బుధవారం సాయినాథ్‌గౌడ్ తనయుడు ప్రవీణ్కుమార్గౌడ్ను వెంటపెట్టుకుని హైదరాబాద్ వెళ్లారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబును కలిసిన జితేంద్రగౌడ్.. పార్టీ కోసం తమ కుటుంబం చేసిన త్యాగాలను ఏకరువు పెట్టి, తనను నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రకటించాలని కోరారు. కానీ.. చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు వైఖరితో జితేంద్రగౌడ్, ప్రవీణ్‌కుమార్‌గౌడ్ అసంతృప్తి చెందినట్లు వారి అనునయులు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ కోసం సాయినాథ్‌గౌడ్ కుటుంబ సభ్యులు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది గుంతకల్లు టీడీపీని కుదిపేస్తోంది.