saiprasad reddy
-
టీడీపీ హయాంలో అరాచకాలు కనపడలేదా?
ఆదోని సెంట్రల్/ఆదోని టౌన్: భూ దందాలు, భూ ఆక్రమణలు అంటూ తప్పుడు వార్తలు రాసి ప్రజలను మభ్యపెట్టలేరని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డి ఈనాడు పత్రికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఎవరు కబ్జాలు చేసినా ఎమ్మెల్యే కుటుంబంపై అభాండాలు వేయడమే పనిగా ఆ పత్రిక పెట్టుకుందన్నారు. టీడీపీ హయాంలో ఎన్ని భూ ఆక్రమణలు చేశారో? ఎన్ని డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారో రామోజీకి కనపడలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. తన స్వగృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు కేసులు నమోదు చేస్తూ, మట్కాను ప్రోత్సహిస్తూ, గాంబ్లింగ్, మద్యం అమ్మకాల్లో భాగస్వాములైనప్పుడు ఏనాడైనా ఈనాడు వాటి గురించి ప్రచురించిందా అని ప్రశ్నించారు. 352 సర్వే నంబర్లో 4.54 ఎకరాలను ఓపెన్ ప్లేస్‌గా చూపించి 1992లో ఎవరో వెంచర్ వేసి అమ్ముకున్నారని.. ఆ స్థలానికి చెందిన అసలైన వారసులు కోర్టుకు వెళ్లి పూర్తి హక్కులు తెచ్చుకుంటే రామోజీకి కడుపుమంటగా ఉందన్నారు. గతంలో ఎవరైతే ఆ స్థలాలను కొన్న లబ్దిదారులున్నారో వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పడం కూడా తప్పేనా అంటూ సాయిప్రసాద్‌రెడ్డి ప్ర చారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఏది పడితే అది రాసి ఎంతకాలం పబ్బం గడుపుతారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏనాడైనా మంచిగా రాశావా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై అభాండాలు వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రోత రాతలు మానుకుంటే మంచిది.. ఇక వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏనాడు మట్కా, మద్యం, బెట్టింగ్‌లను ప్రోత్సహించలేదని.. ఎవరి మీది కూడా అక్రమ కేసులు బనాయించలేదని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలను చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న విషయం కనపడలేదా అని ప్రశ్నించారు. ఒక ఐపీఎస్ అధికారి బదిలీ అయితే తనపై నెపం పెట్టడం తగదన్నారు. తాను ఏనాడు ఫలానా అధికారిని బదిలీ చేయమని, ఫలాన అధికారిని పంపించమని ఎవరినీ అడిగిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా రామోజీ రోత రాతలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. వివాదాస్పద స్థల యజమాని అలిమ్ బాషా మాట్లాడుతూ.. తమ స్థలం తమకు ఇప్పించాలని గతంలో ఎవరి దగ్గరకు వెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని కలిసి విన్నవించగా.. ఆయన కోర్టుకు వెళ్లమని సూచించారని.. కోర్టుకు వెళ్లడంతో మాకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఆయన తెలిపారు. -
కోవిడ్ పరిస్థితులు దోసెలు వేయడం నేర్పాయి
సాక్షి, కర్నూలు: ఉదయం టిఫిన్‌లో దోసెకు ప్రత్యేక స్థానం ఉంది. హోటళ్లలో పలు రుచుల్లో లభించే దోసెలకు ఎన్నో పేర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆనియన్ దోసె మొదలు చైనీస్, ఆమెరికా, కోన్, 70 ఎం.ఎం, ఎమ్మెల్యే దోసె ఇలా.. ఎన్నో వెరైటీల్లో లభిస్తుంది. ఎప్పుడైనా ఎమ్మెల్యే దోసె తిన్నారో లేదో గాని.. ఒక ఎమ్మెల్యేనే దోసె వేసిన సంగతి ఇది. కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇందుకు ప్రజా ప్రతినిధులు అతీతులు కాలేదు. ఎప్పుడూ వంట, వార్పు ఎరుగని ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డి కూడ గరిట పట్టాల్సి వచ్చింది. నియోజక వర్గం అభివృద్ధి పనుల విషయంపై ఆయన ఇటీవల అమరావతికి వెళ్లారు. అయితే కోవిడ్ 19 కారణంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఆయన వంట చేసుకోడానికి స్వయంగా గరిట చేపట్టారు. (‘వర్క్ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్!) ఉదయం దోసలు చేసుకుని, ఇందులోకి బంగాళ దుంపకూర వండారు. మధ్యాహ్నం వంట చేసుకున్నారు. ఈ విషయం తెలిసి వంట ఎప్పుడు నేర్చుకున్నారని ‘సాక్షి’ అడుగగా అవసరం అన్ని నేర్పుతుందంటూ చమత్కరించారు. కోవిడ్ పరిస్థితిలో హోటళ్లు మూత పడ్డాయని, రోడ్డు పక్కన చిన్న హోటళ్లలో అల్పాహారం, భోజనం ఎంత వరకు సురక్షితమో తెలియని పరిస్థితిలో వంట చేసుకోవడమే మేలని భావించి అమరావతిలో ఉన్నన్ని రోజులు వంట చేసుకుంటానని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు అవసరం అయిన జాగ్రతలు తీసుకోవాలని కోరారు. ఏమవుతుందిలే అని మొండిగా వెళ్లితే ఒక్కో సారి అదే ప్రమాదానికి చేరువ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. -
ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు
అనగనగా ఓ అమ్మ. అమ్మ ఎక్కడున్నా ప్రత్యేకతే కదా! ప్రతి అమ్మ తన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసమే పరితపిస్తుంది. అయితే ఈ అమ్మ మాత్రం కుటుంబంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం పరితపించింది. అదే ఆమెను అరుదైన వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చేస్తోంది. 87 యేళ్ల వయసులో ఇంతటి ఖ్యాతిని గడించిన ఆమె ఎవరో కాదు.. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ. కేవలం వెంకట్రామిరెడ్డి ఒక్కరే కాదు.. ఆమె భర్త ఎల్లారెడ్డి భీమిరెడ్డితో సహా నలుగురు కుమారులూ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ‘ప్రజాభిమానం దక్కాలంటే నిరంతర శ్రమ ఉండాలి’ అని చెప్పే లలితమ్మ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే... – ఆదోని/గుంతకల్లు ఓ చిన్నపాటి రాచరిక వ్యవస్థనే.. మాది కర్నూలు జిల్లా ఆదోని దగ్గర ఉండే బద్నాల గ్రామం. అక్కడే పుట్టి పెరిగా. అదో చిన్నపాటి రాచరికం లాంటి కుటుంబం. మా తాతగారు తమ్మిరెడ్డి... బ్రిటీష్ వారి కాలంలో రావూబహుద్దూర్ బిరుదు పొందారు. వాళ్ల సంతానమైన హరిశ్చంద్రారెడ్డి అంటే మా నాన్నగారు అదే స్థాయిలో ప్రజా సంబంధాలు నెరిపేవారు. ఆ రోజుల్లో మా తాత వాళ్లు పొరుగూళ్లకు వెళ్లాలనుకుంటే వారు వచ్చేవరకూ బద్నాల వద్ద రైలు కదిలేది కాదు. దానిని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. నాకు పన్నెండేళ్ల వయసులో ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో వివాహమైంది. అప్పటి నుంచి మాకు ప్రత్యేకించి అనంతపురం జిల్లాతో అనుబంధం ఏర్పడింది. మా ఆయనను కర్నూలు జిల్లా రాంపురంలోని పార్వతమ్మ వాళ్లు దత్తత తీసుకోవడంతో రెండు జిల్లాలతో పరిచయ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. నాదెండ్ల వర్గానికి వెళ్లొదన్నా మా రెడ్డి (భర్త భీమిరెడ్డి) సొంతూరు ఉరవకొండ మండలం కొనకొండ్ల గ్రామం. ఆదోని దగ్గర బదెనేహళ్లు వద్ద చాలా పెద్ద ఆస్తి ఉండడం వల్ల ఫ్యాక్టరీల నిర్వహణ చూసుకునేవాడు. 1983లో తెలుగుదేశంలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆరునెలలకే సంక్షోభం రావడంతో మా రెడ్డి నాదెండ్ల వర్గంలో చేరారు. ఆ నిర్ణయాన్ని ఆ రోజుల్లో నేను తీవ్రంగా వ్యతిరేకించాను. కాకపోతే ఎన్టీఆర్ ఒంటెద్దు పోకడలను తాను సహించలేకపోతున్నానని ఆయన అనేవాడు. అబ్బో చెప్పలేను కానీ.. మా రెడ్డికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన కేవలం ఎమ్మెల్యేగా కొంత కాలం మాత్రమే పనిచేశాడు. 1985లో ఆయన చనిపోయిన తర్వాత మా కొడుకులు రాజకీయాల్లోకి వచ్చేశారు. నేను ఎంత చెబితే అంతే .. ఎంతమంది పిల్లలనైనా తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. కానీ తల్లిదండ్రులను చూసుకోవడంలో పిల్లలు శ్రద్ధ తీసుకోవడం లేదు. సాధారణంగా ఇది చాలా మందిలో చూశా. కానీ మా ఇంట్లో పరిస్థితి వేరు. నేను ఏమి చెబితే మా కొడుకులైనా, కోడళ్లయినా, వారి పిల్లలైనా అదే వింటారు. వినాలి కూడా! మా తరం వారికి కాస్తా పట్టుదల ఎక్కువే. ముఖ్యంగా కొడుకులైతే నేను దగ్గరుంటే వారు విజయం సాధిస్తారన్న నమ్మకం బాగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ముగ్గురు కొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చిన్నవాడు వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టి ఎన్నికలకు నెల రోజుల ముందే గుంతకల్లుకు వచ్చేశా. ప్రచారంలో నా సలహాలు తీసుకుని ముందుకుపోయాడు. నిజమైన నాయకుడు రాజన్నే ముందు నుంచి మేము కాంగ్రెస్ వాదులమే. మరో బలమైన సామాజిక వర్గాన్ని ఢీ కొట్టాలంటే మేమైతేనే కరెక్ట్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజలు నమ్మూతూ వచ్చారు. తొలి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం ఎక్కువ. ఆయన కూడా మా పట్ల అభిమానంతో ఉండేవారు. నాయకుడంటే ఎలా ఉండాలో చూపించిన అంత గొప్ప వ్యక్తి మరెవ్వరూ ఉండరు. ఎంత మంది రాజకీయనాయకులున్నా నిజమైన నాయకుడు వైఎస్సారే. జగన్‌ను మరో బిడ్డగానే భావించా జగన్మోహన్రెడ్డి వయసులో చిన్నవాడే.. కానీ ఆలోచనలు, పట్టుదల, అనుకున్నది సాధించడం చూస్తే ఎవరైనా అతని తర్వాతేననిపిస్తుంది. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో వాళ్ల నాన్నను మించిపోయాడు. మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాడు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసేవాడు. ఒక్కరే కాకుండా భార్య భారతీరెడ్డిని కూడా పిలుచుకురావాలని ఒకసారి చెప్పా. అలాగే రాంపురంలో ఉన్నప్పుడు నా కోరిక తీర్చాడు. తన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చాడు. తనను కూడా కొడుకులాగానే భావిస్తున్నానని ఆ రోజుల్లోనే ఆయనకు నేను స్పష్టంగా చెప్పా. కొడుకులంతా ఎమ్మెల్యేలు నాకు మొత్తంగా ఏడుగురు సంతానం. మాకు అనుబంధం ఉన్న రెండు జిల్లాల్లోనూ వారు స్థిరపడ్డారు. మూడవవాడు జయరామిరెడ్డి చనిపోయాడు. పెద్ద కూతురు వరలక్ష్మి గుంతకల్లులోనే ఉంది. మొదటి కొడుకు సీతారామిరెడ్డి రాంపురం ఎంపీపీగా పనిచేశాడు. మూడో కొడుకు శివరామిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రస్తుతం వెంకటరామిరెడ్డి (గుంతకల్లు) సాయిప్రసాద్‌రెడ్డి (ఆదోని), బాలనాగిరెడ్డి (మంత్రాలయం) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చాలా గర్వంగా ఉంటుంది రెండు జిల్లాలోనూ మా బంధు బలగం చాలా పెద్దది. మా ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలున్నారని ఆశ్చర్యంగా అంటుంటే ఒక తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. మా కుటుంబం మొత్తంగా దగ్గర, దూరం చుట్టాలలో దాదాపు పాతిక మంది ప్రజాప్రతినిధులుంటారు. మా వాళ్లకు నేను చెప్పేదొకటే .. ప్రజాభిమానం కావాలనుకుని కలలు కంటే వచ్చేది కాదు. అది నిరంతర శ్రమ. రేపు ఏమవుతుందో చెప్పలేం. ఉన్నన్ని రోజులూ ప్రజలను ఇంటివాళ్లుగా భావించాలి. వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండాలి. దీనినే మా బిడ్డలకు చెబుతూ వచ్చాను. వారు పాటిస్తూ వచ్చారు. పేదసాదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, నూతన వస్త్రాలు అందిస్తుంటారు. ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరమైన వారిని గుర్తించి వారి చదువులకయ్యే ఖర్చు భరిస్తున్నారు. ఇంతకంటే విజయ రహస్యం ఏమీ ఉండదు. తల్లిదండ్రులు చేసిన సత్కార్యాలు పిల్లలకు రక్షణ కవచంలా ఉంటాయి. అది జగన్ విషయంలోనైనా.. మా పిల్లల విషయంలోనైనా ఇది వాస్తమని తేలింది. -
నైనా జైస్వాల్‌కు సన్మానం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోమవారం హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 13 ఏళ్ల నైనా ఇటీవల ఇరాన్లో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్ టీటీ టోర్నీలో రెండు స్వర్ణాలతో పాటు ఓ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నైనా మాట్లాడుతూ తన విజయాల వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని తెలిపింది. ‘ఆడపిల్లలను నేటి సమాజం భారంగా పరిగణిస్తున్న సమయంలో నన్ను అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఓ మహిళగా సమున్నత స్థాయికి ఎదిగిన మాజీ పోలీస్ అధికారిణి కిరణ్ బేడిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని నైనా తెలిపింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ కుమార్తె 15 స్వర్ణ పతకాలు సాధించినట్లు నైనా తండ్రి, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ కార్యదర్శి అశ్విన్‌కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం. ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిం అలీ, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నరసింహారావు, ప్రముఖ బాడీ బిల్డర్ మోతేశ్యామ్ అలీ, టైపింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించిన ఖుర్షీద్ హుస్సేన్, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.