అనగనగా ఓ అమ్మ. అమ్మ ఎక్కడున్నా ప్రత్యేకతే కదా! ప్రతి అమ్మ తన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసమే పరితపిస్తుంది. అయితే ఈ అమ్మ మాత్రం కుటుంబంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం పరితపించింది. అదే ఆమెను అరుదైన వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చేస్తోంది. 87 యేళ్ల వయసులో ఇంతటి ఖ్యాతిని గడించిన ఆమె ఎవరో కాదు.. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ. కేవలం వెంకట్రామిరెడ్డి ఒక్కరే కాదు.. ఆమె భర్త ఎల్లారెడ్డి భీమిరెడ్డితో సహా నలుగురు కుమారులూ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ‘ప్రజాభిమానం దక్కాలంటే నిరంతర శ్రమ ఉండాలి’ అని చెప్పే లలితమ్మ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే... – ఆదోని/గుంతకల్లు
ఓ చిన్నపాటి రాచరిక వ్యవస్థనే..
మాది కర్నూలు జిల్లా ఆదోని దగ్గర ఉండే బద్నాల గ్రామం. అక్కడే పుట్టి పెరిగా. అదో చిన్నపాటి రాచరికం లాంటి కుటుంబం. మా తాతగారు తమ్మిరెడ్డి... బ్రిటీష్ వారి కాలంలో రావూబహుద్దూర్ బిరుదు పొందారు. వాళ్ల సంతానమైన హరిశ్చంద్రారెడ్డి అంటే మా నాన్నగారు అదే స్థాయిలో ప్రజా సంబంధాలు నెరిపేవారు. ఆ రోజుల్లో మా తాత వాళ్లు పొరుగూళ్లకు వెళ్లాలనుకుంటే వారు వచ్చేవరకూ బద్నాల వద్ద రైలు కదిలేది కాదు. దానిని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. నాకు పన్నెండేళ్ల వయసులో ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో వివాహమైంది. అప్పటి నుంచి మాకు ప్రత్యేకించి అనంతపురం జిల్లాతో అనుబంధం ఏర్పడింది. మా ఆయనను కర్నూలు జిల్లా రాంపురంలోని పార్వతమ్మ వాళ్లు దత్తత తీసుకోవడంతో రెండు జిల్లాలతో పరిచయ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు.
నాదెండ్ల వర్గానికి వెళ్లొదన్నా
మా రెడ్డి (భర్త భీమిరెడ్డి) సొంతూరు ఉరవకొండ మండలం కొనకొండ్ల గ్రామం. ఆదోని దగ్గర బదెనేహళ్లు వద్ద చాలా పెద్ద ఆస్తి ఉండడం వల్ల ఫ్యాక్టరీల నిర్వహణ చూసుకునేవాడు. 1983లో తెలుగుదేశంలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆరునెలలకే సంక్షోభం రావడంతో మా రెడ్డి నాదెండ్ల వర్గంలో చేరారు. ఆ నిర్ణయాన్ని ఆ రోజుల్లో నేను తీవ్రంగా వ్యతిరేకించాను. కాకపోతే ఎన్టీఆర్ ఒంటెద్దు పోకడలను తాను సహించలేకపోతున్నానని ఆయన అనేవాడు. అబ్బో చెప్పలేను కానీ.. మా రెడ్డికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన కేవలం ఎమ్మెల్యేగా కొంత కాలం మాత్రమే పనిచేశాడు. 1985లో ఆయన చనిపోయిన తర్వాత మా కొడుకులు రాజకీయాల్లోకి వచ్చేశారు.
నేను ఎంత చెబితే అంతే ..
ఎంతమంది పిల్లలనైనా తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. కానీ తల్లిదండ్రులను చూసుకోవడంలో పిల్లలు శ్రద్ధ తీసుకోవడం లేదు. సాధారణంగా ఇది చాలా మందిలో చూశా. కానీ మా ఇంట్లో పరిస్థితి వేరు. నేను ఏమి చెబితే మా కొడుకులైనా, కోడళ్లయినా, వారి పిల్లలైనా అదే వింటారు. వినాలి కూడా! మా తరం వారికి కాస్తా పట్టుదల ఎక్కువే. ముఖ్యంగా కొడుకులైతే నేను దగ్గరుంటే వారు విజయం సాధిస్తారన్న నమ్మకం బాగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ముగ్గురు కొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చిన్నవాడు వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టి ఎన్నికలకు నెల రోజుల ముందే గుంతకల్లుకు వచ్చేశా. ప్రచారంలో నా సలహాలు తీసుకుని ముందుకుపోయాడు.
నిజమైన నాయకుడు రాజన్నే
ముందు నుంచి మేము కాంగ్రెస్ వాదులమే. మరో బలమైన సామాజిక వర్గాన్ని ఢీ కొట్టాలంటే మేమైతేనే కరెక్ట్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజలు నమ్మూతూ వచ్చారు. తొలి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం ఎక్కువ. ఆయన కూడా మా పట్ల అభిమానంతో ఉండేవారు. నాయకుడంటే ఎలా ఉండాలో చూపించిన అంత గొప్ప వ్యక్తి మరెవ్వరూ ఉండరు. ఎంత మంది రాజకీయనాయకులున్నా నిజమైన నాయకుడు వైఎస్సారే.
జగన్‌ను మరో బిడ్డగానే భావించా
జగన్‌మోహన్‌రెడ్డి వయసులో చిన్నవాడే.. కానీ ఆలోచనలు, పట్టుదల, అనుకున్నది సాధించడం చూస్తే ఎవరైనా అతని తర్వాతేననిపిస్తుంది. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో వాళ్ల నాన్నను మించిపోయాడు. మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాడు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసేవాడు. ఒక్కరే కాకుండా భార్య భారతీరెడ్డిని కూడా పిలుచుకురావాలని ఒకసారి చెప్పా. అలాగే రాంపురంలో ఉన్నప్పుడు నా కోరిక తీర్చాడు. తన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చాడు. తనను కూడా కొడుకులాగానే భావిస్తున్నానని ఆ రోజుల్లోనే ఆయనకు నేను స్పష్టంగా చెప్పా.
కొడుకులంతా ఎమ్మెల్యేలు
నాకు మొత్తంగా ఏడుగురు సంతానం. మాకు అనుబంధం ఉన్న రెండు జిల్లాల్లోనూ వారు స్థిరపడ్డారు. మూడవవాడు జయరామిరెడ్డి చనిపోయాడు. పెద్ద కూతురు వరలక్ష్మి గుంతకల్లులోనే ఉంది. మొదటి కొడుకు సీతారామిరెడ్డి రాంపురం ఎంపీపీగా పనిచేశాడు. మూడో కొడుకు శివరామిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రస్తుతం వెంకటరామిరెడ్డి (గుంతకల్లు) సాయిప్రసాద్‌రెడ్డి (ఆదోని), బాలనాగిరెడ్డి (మంత్రాలయం) ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
చాలా గర్వంగా ఉంటుంది
రెండు జిల్లాలోనూ మా బంధు బలగం చాలా పెద్దది. మా ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలున్నారని ఆశ్చర్యంగా అంటుంటే ఒక తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. మా కుటుంబం మొత్తంగా దగ్గర, దూరం చుట్టాలలో దాదాపు పాతిక మంది ప్రజాప్రతినిధులుంటారు. మా వాళ్లకు నేను చెప్పేదొకటే .. ప్రజాభిమానం కావాలనుకుని కలలు కంటే వచ్చేది కాదు. అది నిరంతర శ్రమ. రేపు ఏమవుతుందో చెప్పలేం. ఉన్నన్ని రోజులూ ప్రజలను ఇంటివాళ్లుగా భావించాలి. వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండాలి. దీనినే మా బిడ్డలకు చెబుతూ వచ్చాను. వారు పాటిస్తూ వచ్చారు. పేదసాదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, నూతన వస్త్రాలు అందిస్తుంటారు. ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరమైన వారిని గుర్తించి వారి చదువులకయ్యే ఖర్చు భరిస్తున్నారు. ఇంతకంటే విజయ రహస్యం ఏమీ ఉండదు. తల్లిదండ్రులు చేసిన సత్కార్యాలు పిల్లలకు రక్షణ కవచంలా ఉంటాయి. అది జగన్ విషయంలోనైనా.. మా పిల్లల విషయంలోనైనా ఇది వాస్తమని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment