Balanagi Reddy
-
Mantralayam: తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి
మంత్రాలయం: యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి నాల్గవ సారి సైతం విజయ బావుటా ఎగురవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి గట్టెక్కలేకపోయారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి మధ్య ప్రధాన పోటీ సాగింది. మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం 2,08,350 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు, 1,02,155 మంది, మహిళలు 1,06,172 మంది , ఇతరులు 23 మంది ఉన్నారు. అందులో 1,76,077 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 84.51 శాతం పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి. విశ్వనాథ్ నేతృత్వంలో ఓట్ల లెక్కింపు సాగింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌటింగ్ మొదలైంది. 17 రౌండ్ల గణన ప్రక్రియ జరిగింది. మొదటి రౌండ్లో టీడీపీ 341 ఓట్ల మెజార్టీతో బోణీ చేసుకుంది. తక్కిన రౌండ్లలో వైఎస్సార్ సీపీ ఆధిక్యత కొనసాగించింది. 17వ రౌండ్ ముగిసిన సమయానికి 12,805 ఓట్ల మెజార్టీతో బాలనాగిరెడ్డి విజయం సాధించారు. మంత్రాలయం నుంచి విజయం సాధించిన వై. బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్ర రెడ్డికి 74,857 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి మురళీ కృష్ణంరాజుకు 4,660 ఓట్లు , బీఎస్పీ అభ్యర్థి గుడిపి సామేల్‌కు 3589 ఓట్లు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఆర్. రాఘవేంద్ర రెడ్డికి 608 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఎం. రాఘవేంద్ర రెడ్డికి 624 ఓట్లు, కె. నాగిరెడ్డికి 353 ఓట్లు, సి. పరమేష్‌కు 297 ఓట్లు , నోటాకు 2,674 ఓట్లు వచ్చాయి. -
ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు
అనగనగా ఓ అమ్మ. అమ్మ ఎక్కడున్నా ప్రత్యేకతే కదా! ప్రతి అమ్మ తన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసమే పరితపిస్తుంది. అయితే ఈ అమ్మ మాత్రం కుటుంబంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం పరితపించింది. అదే ఆమెను అరుదైన వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చేస్తోంది. 87 యేళ్ల వయసులో ఇంతటి ఖ్యాతిని గడించిన ఆమె ఎవరో కాదు.. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ. కేవలం వెంకట్రామిరెడ్డి ఒక్కరే కాదు.. ఆమె భర్త ఎల్లారెడ్డి భీమిరెడ్డితో సహా నలుగురు కుమారులూ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ‘ప్రజాభిమానం దక్కాలంటే నిరంతర శ్రమ ఉండాలి’ అని చెప్పే లలితమ్మ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే... – ఆదోని/గుంతకల్లు ఓ చిన్నపాటి రాచరిక వ్యవస్థనే.. మాది కర్నూలు జిల్లా ఆదోని దగ్గర ఉండే బద్నాల గ్రామం. అక్కడే పుట్టి పెరిగా. అదో చిన్నపాటి రాచరికం లాంటి కుటుంబం. మా తాతగారు తమ్మిరెడ్డి... బ్రిటీష్ వారి కాలంలో రావూబహుద్దూర్ బిరుదు పొందారు. వాళ్ల సంతానమైన హరిశ్చంద్రారెడ్డి అంటే మా నాన్నగారు అదే స్థాయిలో ప్రజా సంబంధాలు నెరిపేవారు. ఆ రోజుల్లో మా తాత వాళ్లు పొరుగూళ్లకు వెళ్లాలనుకుంటే వారు వచ్చేవరకూ బద్నాల వద్ద రైలు కదిలేది కాదు. దానిని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. నాకు పన్నెండేళ్ల వయసులో ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో వివాహమైంది. అప్పటి నుంచి మాకు ప్రత్యేకించి అనంతపురం జిల్లాతో అనుబంధం ఏర్పడింది. మా ఆయనను కర్నూలు జిల్లా రాంపురంలోని పార్వతమ్మ వాళ్లు దత్తత తీసుకోవడంతో రెండు జిల్లాలతో పరిచయ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. నాదెండ్ల వర్గానికి వెళ్లొదన్నా మా రెడ్డి (భర్త భీమిరెడ్డి) సొంతూరు ఉరవకొండ మండలం కొనకొండ్ల గ్రామం. ఆదోని దగ్గర బదెనేహళ్లు వద్ద చాలా పెద్ద ఆస్తి ఉండడం వల్ల ఫ్యాక్టరీల నిర్వహణ చూసుకునేవాడు. 1983లో తెలుగుదేశంలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆరునెలలకే సంక్షోభం రావడంతో మా రెడ్డి నాదెండ్ల వర్గంలో చేరారు. ఆ నిర్ణయాన్ని ఆ రోజుల్లో నేను తీవ్రంగా వ్యతిరేకించాను. కాకపోతే ఎన్టీఆర్ ఒంటెద్దు పోకడలను తాను సహించలేకపోతున్నానని ఆయన అనేవాడు. అబ్బో చెప్పలేను కానీ.. మా రెడ్డికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన కేవలం ఎమ్మెల్యేగా కొంత కాలం మాత్రమే పనిచేశాడు. 1985లో ఆయన చనిపోయిన తర్వాత మా కొడుకులు రాజకీయాల్లోకి వచ్చేశారు. నేను ఎంత చెబితే అంతే .. ఎంతమంది పిల్లలనైనా తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. కానీ తల్లిదండ్రులను చూసుకోవడంలో పిల్లలు శ్రద్ధ తీసుకోవడం లేదు. సాధారణంగా ఇది చాలా మందిలో చూశా. కానీ మా ఇంట్లో పరిస్థితి వేరు. నేను ఏమి చెబితే మా కొడుకులైనా, కోడళ్లయినా, వారి పిల్లలైనా అదే వింటారు. వినాలి కూడా! మా తరం వారికి కాస్తా పట్టుదల ఎక్కువే. ముఖ్యంగా కొడుకులైతే నేను దగ్గరుంటే వారు విజయం సాధిస్తారన్న నమ్మకం బాగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ముగ్గురు కొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చిన్నవాడు వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టి ఎన్నికలకు నెల రోజుల ముందే గుంతకల్లుకు వచ్చేశా. ప్రచారంలో నా సలహాలు తీసుకుని ముందుకుపోయాడు. నిజమైన నాయకుడు రాజన్నే ముందు నుంచి మేము కాంగ్రెస్ వాదులమే. మరో బలమైన సామాజిక వర్గాన్ని ఢీ కొట్టాలంటే మేమైతేనే కరెక్ట్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజలు నమ్మూతూ వచ్చారు. తొలి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం ఎక్కువ. ఆయన కూడా మా పట్ల అభిమానంతో ఉండేవారు. నాయకుడంటే ఎలా ఉండాలో చూపించిన అంత గొప్ప వ్యక్తి మరెవ్వరూ ఉండరు. ఎంత మంది రాజకీయనాయకులున్నా నిజమైన నాయకుడు వైఎస్సారే. జగన్‌ను మరో బిడ్డగానే భావించా జగన్మోహన్రెడ్డి వయసులో చిన్నవాడే.. కానీ ఆలోచనలు, పట్టుదల, అనుకున్నది సాధించడం చూస్తే ఎవరైనా అతని తర్వాతేననిపిస్తుంది. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో వాళ్ల నాన్నను మించిపోయాడు. మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాడు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసేవాడు. ఒక్కరే కాకుండా భార్య భారతీరెడ్డిని కూడా పిలుచుకురావాలని ఒకసారి చెప్పా. అలాగే రాంపురంలో ఉన్నప్పుడు నా కోరిక తీర్చాడు. తన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చాడు. తనను కూడా కొడుకులాగానే భావిస్తున్నానని ఆ రోజుల్లోనే ఆయనకు నేను స్పష్టంగా చెప్పా. కొడుకులంతా ఎమ్మెల్యేలు నాకు మొత్తంగా ఏడుగురు సంతానం. మాకు అనుబంధం ఉన్న రెండు జిల్లాల్లోనూ వారు స్థిరపడ్డారు. మూడవవాడు జయరామిరెడ్డి చనిపోయాడు. పెద్ద కూతురు వరలక్ష్మి గుంతకల్లులోనే ఉంది. మొదటి కొడుకు సీతారామిరెడ్డి రాంపురం ఎంపీపీగా పనిచేశాడు. మూడో కొడుకు శివరామిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రస్తుతం వెంకటరామిరెడ్డి (గుంతకల్లు) సాయిప్రసాద్‌రెడ్డి (ఆదోని), బాలనాగిరెడ్డి (మంత్రాలయం) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చాలా గర్వంగా ఉంటుంది రెండు జిల్లాలోనూ మా బంధు బలగం చాలా పెద్దది. మా ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలున్నారని ఆశ్చర్యంగా అంటుంటే ఒక తల్లిగా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. మా కుటుంబం మొత్తంగా దగ్గర, దూరం చుట్టాలలో దాదాపు పాతిక మంది ప్రజాప్రతినిధులుంటారు. మా వాళ్లకు నేను చెప్పేదొకటే .. ప్రజాభిమానం కావాలనుకుని కలలు కంటే వచ్చేది కాదు. అది నిరంతర శ్రమ. రేపు ఏమవుతుందో చెప్పలేం. ఉన్నన్ని రోజులూ ప్రజలను ఇంటివాళ్లుగా భావించాలి. వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండాలి. దీనినే మా బిడ్డలకు చెబుతూ వచ్చాను. వారు పాటిస్తూ వచ్చారు. పేదసాదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, నూతన వస్త్రాలు అందిస్తుంటారు. ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరమైన వారిని గుర్తించి వారి చదువులకయ్యే ఖర్చు భరిస్తున్నారు. ఇంతకంటే విజయ రహస్యం ఏమీ ఉండదు. తల్లిదండ్రులు చేసిన సత్కార్యాలు పిల్లలకు రక్షణ కవచంలా ఉంటాయి. అది జగన్ విషయంలోనైనా.. మా పిల్లల విషయంలోనైనా ఇది వాస్తమని తేలింది. -
మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు..
సాక్షి, మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి చేష్టలు శ్రుతిమించాయి. ఆయన తీరు కారణంగా మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిక్కారెడ్డి గన్మెన్లు అత్యుత్సాహం ప్రదర్శించి.. ఫైరింగ్ చేయడంతో ఆయనతో పాటు ఏఎస్ఐకి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగా ఎన్నికల ప్రచార నిమిత్తం తిక్కారెడ్డి అనుచరులతో కలిసి శనివారం ఉదయం 8.30 గంటలకు ఖగ్గల్ గ్రామం చేరుకున్నారు. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతూ అంగన్వాడీసెంటర్ ఎదుట టీడీపీ జెండాను ఎగురవేశారు. తర్వాత గ్రామ వీధుల్లో ప్రచారం ముగించుకుని మళ్లీ అంగన్వాడీ కేంద్రం వద్దకే వచ్చి కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఐదేళ్లలో తమ గ్రామం వైపు రాలేదని, ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని, పైగా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జెండా ఎలా ఎగురవేస్తారంటూ కొందరు యువకులు నిలదీశారు. అదే సమయంలో గ్రామానికి ప్రచారం నిమిత్తం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు కూడా అంగన్వాడీ సెంటర్ వద్దకు సమీపించారు. వారు మామూలుగానే వస్తుండగా.. తిక్కారెడ్డి గన్‌మెన్ శ్రీనివాసులు మాత్రం ఆవేశంతో ఊగిపోతూ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. బెంబేలెత్తిన ఇరువర్గాలతో పాటు గ్రామస్తులు కేకలు వేశారు. దీంతో శ్రీనివాసులు మరింత రెచ్చిపోయాడు. మరో గన్‌మెన్ ఆర్.విజయ్‌కుమార్‌తో కలిసి గాల్లోకి, నేలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తిక్కారెడ్డి ఎడమ కాలి మోకాలి పైభాగంలోనూ, ఏఎస్ఐ వేణుగోపాల్ కుడి కాలికి గాయాలయ్యాయి. దారి మళ్లించి గ్రామ ప్రవేశం వ్యూహంలో భాగంగా తిక్కారెడ్డి ముందుగా మంత్రాలయం చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రాలయం మండలం సౌలహళ్లి గ్రామానికి ప్రచారానికి వెళ్తున్నట్లు చెప్పి, కోసిగి మీదుగా ఐరన్‌గల్లు నుంచి ఖగ్గల్ గ్రామం చేరుకున్నారు. వెళ్లే సమయంలో ఎవరూ విలేకరులు రావద్దంటూ తన అనుకూల మీడియాను వెంటేసుకుని వెళ్లారు. గ్రామంలో అలజడి సృష్టించాలనుకుని.. ఎన్నికల కోడ్‌ను సైతం ఉల్లంఘించి అంగన్వాడీ కేంద్రం ఎదురుగా పార్టీ జెండాను ఎగుర వేశారు. గ్రామస్తులకు ఇష్టం లేకున్నా వీధుల్లో పర్యటించారు. కాగా.. ఉద్రిక్తత నేపథ్యంలో ఆదోని డీఎస్పీ వెంకటరాముడు నేతృత్వంలో పోలీసు బలగాలను గ్రామంలో మోహరించారు. ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు గ్రామం చేరుకున్నారు. టీడీపీ నాయకుడు సురేష్‌నాయుడు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సతీమణి జయమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మురళీరెడ్డి, భీమిరెడ్డి, పలువురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తిక్కారెడ్డిపై ఫిర్యాదు పాలకుర్తి తిక్కారెడ్డి, అనుచరులు ఖగ్గల్ గ్రామ చావిడిలో కూర్చున్న యువకులను పిలిచి టీడీపీకి ఓటేయాలని అడిగారు. గ్రామానికి ఏ పనీ చేయనందున తాము వేయబోమని అయ్యప్ప, అనుమంతు, సురేంద్ర అనే యువకులు చెప్పారు. దీంతో తిక్కారెడ్డితో పాటు టీడీపీ నాయకులు మాధవరం రాజశేఖర్‌రెడ్డి, గుడిసె శివన్న, గోతులదొడ్డి సరేష్నాయుడు, బూదూరు మల్లికార్జునరెడ్డి, రామాంజి, మంత్రాలయం యేబు యువకులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు అయ్యప్ప మాధవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తిక్కారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో మోహన్‌దాసుకు వైఎస్సార్సీపీ నాయకులు అత్రితనయగౌడ్, బెట్టనగౌడ్, వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ‘కొడకల్లారా’ అంటూ ... ఉద్రిక్తత పరిస్థితుల్లో సహనం పాటించాల్సిన గన్‌మెన్ శ్రీనివాసులు ‘కొడకల్లారా.. కాల్చి పాడేస్తా’నంటూ రెచ్చిపోయాడు. అలా అంటూ కొన్ని క్షణాల్లోనే తుపాకీ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో గన్మెన్లిద్దరూ 13 రౌండ్లు పేల్చినట్లు డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు. సంఘటన ప్రాంతంలో ఎనిమిది ఖాళీ బుల్లెట్లు కనిపించాయి. మిగతా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. కాల్పుల్లో గాయపడి కింద పడగానే తిక్కారెడ్డి కూడా ‘కొడకల్లారా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు అందుకున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇరువురిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. గన్మెన్ల సస్పెన్షన్ కర్నూలు : మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కాల్పులు జరపలేదని పోలీసు విచారణలో తేలింది. అక్కడి ఘటనపై కేసు నమోదు చేసి.. ఆదోని డీఎస్పీ వెంకటరాముడితో ఎస్పీ ఫక్కీరప్ప విచారణ చేయించారు. కాల్పులు జరపాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి కాల్పులు జరిపిన గన్మెన్లు క్రమశిక్షణ ఉల్లంఘించడమే కాక నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినట్లు తేలడంతో ఏఆర్ పీసీలు ఎం.సి.శ్రీనివాసులు (నం.1414), ఆర్.విజయ్‌కుమార్(నం.805)లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖలో విధుల పట్ల అలసత్వం వహించి..క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుష్ప్రచారం సరికాదు వైఎస్సార్సీపీ నాయకులు కాల్పులు జరపడంతోనే తిక్కారెడ్డి గాయపడినట్లు దుష్ప్రచారం చేయడం సరికాదని వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వేటకొడవళ్లు, గన్లతో దాడి చేశారని తిక్కారెడ్డి టీవీల్లో చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిజాలు తెలుసుకోకుండా మంత్రి లోకేష్ సైతం ట్విట్టర్లో పేర్కొనడం విడ్డూరకరమన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటే తాము అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. జనాలకు ఇష్టం లేకున్నా.. కోడ్‌ను కాదని ఇలాంటి ప్రచారాలకు యత్నించడం బాధాకరమన్నారు. జనాలను రెచ్చగొట్టడంతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఉద్దేశంతోనే గ్రామాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలెవ్వరూ అధైర్య పడవద్దన్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణులకు దూరంగా ఉండి ప్రశాంతతకు సహకరించాలని కోరారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే -
‘తిక్కారెడ్డి కావాలనే ఫైరింగ్ ఓపెన్ చేయించారు’
సాక్షి, కర్నూలు : ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మంత్రాలయం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు బాలనాగిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్ది హత్యకేసును డైవర్ట్ చేయడానికే టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జిల్లాలోని మంత్రాలయం మండలం కగ్గల్లులో శనివారం తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలనాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు తిక్కారెడ్డి యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని... కోడ్ అమల్లో ఉన్నా గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి అలజడి సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తిక్కారెడ్డి రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల పట్ల వ్యతిరేకంగా ఉన్న గ్రామంలో ఒకవైపు పోలీసులు, అదనపు భద్రతా దళాలు ఉండగా తిక్కారెడ్డి తన గన్‌మెన్ ద్వారా కాల్పులు జరపడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్ కాల్పులు అక్రమ కేసులు పెట్టి వేధించాలని ‘తిక్కారెడ్డికి ప్రైవేట్ గన్‌మెన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తిక్కారెడ్డి గన్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చి ఫైరింగ్ ఓపెన్ చేయించారు. తన సొంత గన్‌మెన్ కాల్పుల్లో తిక్కారెడ్డికి, ఏఎస్సై వేణుగోపాల్‌కు గాయాలైతే.. వైఎస్సార్ సీపీ నేతలు నాటు తుపాకులతో కాల్పులు జరిపారని మాపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. గ్రామంలో ప్రచారం చేసుకుంటున్న మా కార్యకార్తలపై తిక్కారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఈరోజు(శనివారం) తిక్కారెడ్డికి, ఏఎస్సైకి తగిలిన తూటాలు ఏ గన్ నుంచి వచ్చాయో పోలీసులు నిర్ధారిస్తారు. మాపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలి. ఎన్నికల సమయంలో మా ముఖ్య నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకే తిక్కారెడ్డి డ్రామాలాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని టీడీపీ ప్లాన్ వేసింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలి పోతుంది. టీడీపీ నేతలు ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా సంయమనం పాటించాలి’ అని బాలనాగిరెడ్డి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో లబ్ది కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచి పద్దతి కాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు.. ప్రజలు ఇచ్చే అంతిమ తీర్పే శిరోధార్యమని బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. -
రాజోలి రగడ
కర్నూలు(రూరల్)/ఎమ్మిగనూరు: రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రాయలసీమ-తెలంగాణ ప్రాంతాల మధ్య తరచూ గొడవలకు కారణమవుతున్న ఈ ఆనకట్టు.. తాజాగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. సీమ వైపు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధునికీకరణ పేరిట ఏకంగా అర అడుగు ఎత్తు పెంచే ప్రయత్నాం చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పూర్తిస్థాయిలో అమలు కాకమునుపే.. అందులోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపకాలు చేపట్టక ముందే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టడం జల వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై అడ్డంగా నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వివాదం ఆది నుంచి కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఎడమ కెనాల్ ద్వారా కర్ణాటకలో 7500 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు.. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే కర్ణాటక కుటిల రాజకీయంతో ఆంధ్రాలో కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. సుంకేసుల డ్యాం ద్వారా కేసీ కెనాల్‌కు అందుతున్న నీరే ఆర్డీఎస్ నీటి వాటాగా తెలంగాణవాదులు మెలికపెడుతూ వచ్చారు. 2003లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతల సహకారంతో ఆర్డీఎస్ ఆనకట్టకు కర్నూలు వైపు మూసి ఉన్న స్లూయిస్(వెంట్)లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులు.. ప్రజాప్రతినిధుల మధ్య జల వివాదం చెలరేగింది. రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అప్పట్లో పలువురికి గాయాలయ్యాయి. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొత్తం 5 స్లూయిస్‌లో నాలుగింటిని మూయించారు. అప్పటి నుండి ఈ వివాదం సద్దుమణిగింది. వైఎస్ మరణానంతరం ఆగస్టు 14, 2010న మరోసారి ఆర్డీఎస్ వివాదం చెలరేగినా అప్పటి మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, అబ్రహాం(అలంపూర్) చొరవతో ఇరుప్రాంత రైతులు శాంతించారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు కర్ణాటక కుట్ర ఆధునికీకరణ పనుల పేరిట ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అర అడుగు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పన్నిన కుటిల యత్నాన్ని కోసిగి మండలం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఇప్పటికే కర్నూలు వైపున్న అన్ని స్లూయిస్‌లను మూయించి మా కడుపులు కొట్టడమే కాకుండా ఏకంగా ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకొని పనులను నిలుపుదల చేయించారు. కర్నూలు రైతుకు కష్టకాలం: జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరరాలకు ప్రధాన వనరు తుంగభద్ర నది. తీరం వెంబడి విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు కేసీ కెనాల్ పరీహాహకమంతా ఈ నదితోనే పెనవేసుకుంది. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక, పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆది నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఆర్డీఎస్కు దిగువనున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.