సాక్షి, కర్నూలు : ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మంత్రాలయం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు బాలనాగిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్ది హత్యకేసును డైవర్ట్ చేయడానికే టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జిల్లాలోని మంత్రాలయం మండలం కగ్గల్లులో శనివారం తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలనాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు తిక్కారెడ్డి యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని... కోడ్ అమల్లో ఉన్నా గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి అలజడి సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తిక్కారెడ్డి రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల పట్ల వ్యతిరేకంగా ఉన్న గ్రామంలో ఒకవైపు పోలీసులు, అదనపు భద్రతా దళాలు ఉండగా తిక్కారెడ్డి తన గన్‌మెన్ ద్వారా కాల్పులు జరపడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్ కాల్పులు
అక్రమ కేసులు పెట్టి వేధించాలని
‘తిక్కారెడ్డికి ప్రైవేట్ గన్‌మెన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తిక్కారెడ్డి గన్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చి ఫైరింగ్ ఓపెన్ చేయించారు. తన సొంత గన్‌మెన్ కాల్పుల్లో తిక్కారెడ్డికి, ఏఎస్సై వేణుగోపాల్‌కు గాయాలైతే.. వైఎస్సార్ సీపీ నేతలు నాటు తుపాకులతో కాల్పులు జరిపారని మాపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. గ్రామంలో ప్రచారం చేసుకుంటున్న మా కార్యకార్తలపై తిక్కారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఈరోజు(శనివారం) తిక్కారెడ్డికి, ఏఎస్సైకి తగిలిన తూటాలు ఏ గన్ నుంచి వచ్చాయో పోలీసులు నిర్ధారిస్తారు. మాపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలి. ఎన్నికల సమయంలో మా ముఖ్య నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకే తిక్కారెడ్డి డ్రామాలాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని టీడీపీ ప్లాన్ వేసింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలి పోతుంది. టీడీపీ నేతలు ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా సంయమనం పాటించాలి’ అని బాలనాగిరెడ్డి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో లబ్ది కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచి పద్దతి కాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు.. ప్రజలు ఇచ్చే అంతిమ తీర్పే శిరోధార్యమని బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment