Sajid javid
-
వీసా మోసంపై బ్రిటన్ హోంమంత్రికి లేఖ
లండన్: బ్రిటన్‌లో విద్యార్థి వీసాలు పొందేందుకు రాసే టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్(టీవోఈఐసీ)లో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులు గురువారం హోంమంత్రి సాజిద్ జావిద్‌కు లేఖ రాశారు. 2014లో జరిగిన టీవోఈఐసీ పరీక్షల్లో మోసానికి పాల్పడినట్లు తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వేలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను బ్రిటన్ హోంశాఖ అన్యాయంగా లాక్కుంది. ఈ జాబితా నుంచి మా పేర్లను తప్పించేందుకు ఐదేళ్లుగా పోరాడుతున్నాం. బ్రిటన్ హోంశాఖ మా భవిష్యత్‌ను నాశనం చేసింది. మేం మోసానికి పాల్పడ్డట్లు ఇప్పటివరకూ కనీసం ఒక్క సాక్ష్యాన్ని చూపలేకపోయింది. మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని హోంమంత్రి సాజిద్ జావిద్‌ను కోరుతున్నాం’ అని తెలిపారు. -
త్వరలో భారత్‌కు విజయ్ మాల్యా!
లండన్: బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావీద్ ఆదివారమే సంబంధింత పత్రాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు టైముంది. హైకోర్టు మాల్యా అప్పీల్‌ను తిరస్కరిస్తే ఆయన వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. విచారణకు స్వీకరిస్తే హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిస్థితులుంటాయి. మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గతేడాది డిసెంబర్ 10న తీర్పు చెప్పింది. ఆ తీర్పు హోం శాఖకు చేరింది. కాగా, పాక్ సంతతికి చెందిన మంత్రుల్లో అత్యంత సీనియర్ అయిన జావీద్.. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదివారం సంతకం చేశారు. కేసులోని అంశాలు, పరిస్థితులను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు సైతం మాల్యాకు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు రావడం వల్లే తాను అప్పులు తీర్చలేక పోయానని మాల్యా గతంలో లండన్ కోర్టులో వాదించగా, అప్పు రూపంలో లభించిన డబ్బును మాల్యా అసలైన అవసరానికి వాడకుండా, పక్కదారి పట్టించాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గతంలో గుర్తించింది. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయంపై భారతసర్కారు హర్షం వ్యక్తం చేసింది. అప్పీల్ చేసే పని ప్రారంభిస్తా: మాల్యా విజయ్ మాల్యా ఓ ట్వీట్ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే పనిని మొదలుపెడతానన్నాడు. ‘వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు డిసెంబర్ 10న తీర్పు వచ్చినప్పుడే, అప్పీల్‌కు వెళ్తానని నేను గతంలోనే చెప్పా. హోం మంత్రి దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో, ఇన్నాళ్లూ అప్పీల్ చేయలేకపోయా. ఇప్పుడు ఆ పని మొదలుపెడతా’ అని మాల్యా పేర్కొన్నాడు. మాట నిలుపుకుంటాం మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. మాల్యాను రప్పించడం ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని రాబట్టి, దోషులను చట్టం ముందు నిలబెడతామంటూ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చనున్నామని తెలిపింది. ‘బ్యాంకులను మోసగించి పరారైన విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వ అధికారులు చేసిన నిర్విరామ కృషి ఫలితమిది. ఈ పరిణామం మోదీ ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం’ అని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కుంభకోణాలు, మోసాలకు చట్టబద్ధమైన ముగింపు తెచ్చేలా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు అవకాశం కల్పించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు తీసుకువచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసిందని మంత్రి జైట్లీ అన్నారు. -
బ్రిటన్ హోం మంత్రిగా పాక్ సంతతి వ్యక్తి
లండన్: బ్రిటన్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీ సాజిద్ జావెద్ ఆ దేశ హోం మంత్రిగా నియమితులయ్యారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బలవంతంగా పంపించే విషయంలో పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు ఇంతవరకూ హోం మంత్రిగా ఉన్న అంబర్ రూడ్ సోమవారం పదవి నుంచి వైదొలిగారు. దీంతో సాజిద్‌ను హోంమంత్రిగా నియమించారు. ప్రస్తు తం ఆయన కమ్యూనిటీస్, స్థానిక సంస్థలు, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాజిద్ కుటుంబం 1960 ల్లో బ్రిటన్‌కు తరలివచ్చింది. బ్రిటన్ చరిత్రలో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించే మొదటి దక్షిణాసియా వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. ఇప్పటికే పాక్ మూలాలున్న సాదిక్ ఖాన్ లండన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగ తి తెలిసిందే. తన నియమాకం అనంతరం సాజిద్ మాట్లాడుతూ.. దేశంలోని వలస విధానాన్ని సమీక్షిస్తానని, ప్రజల్ని గౌరవం, మర్యాదతో చూస్తామని చెప్పారు. 2010 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్న సాజిద్.. గతంలో వాణిజ్య, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. -
రాష్ట్రానికి ఇంగ్లండ్ సహకారం
హైదరాబాద్: పలు రంగాల్లో రాష్ట్రంతో కలసి పనిచేసేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం ముందుకొచ్చిందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. హైదరాబాద్‌లోని టీ హబ్‌ను ఇంగ్లండ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ సహాయ మంత్రి సాజిద్ జావిద్ గురువారం సందర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, సైబర్ టెక్నాలజీ, గేమింగ్ యానిమేషన్ తదితర రంగాల్లో కలసి పనిచేసేందుకు సాజిద్ జావిద్ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. యూరప్ దేశాల్లో స్టార్టప్‌ల నిర్వహణలో ఇంగ్లండ్ నంబర్ వన్‌గా ఉందని సాజిద్ చెప్పారన్నారు. టీహబ్‌తో కలసి పనిచేసేందుకూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. చిన్న దేశమైన ఇజ్రాయెల్‌తో కలసి ఇంగ్లాండ్ ఎంతో ప్రగతి సాధించిందని, లండన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన 30-40 స్టార్టప్‌లు లిస్ట్ అయ్యాయని వివరించారు. ఇంగ్లండ్‌కు చెందిన లైఫ్ సెన్సైస్ మంత్రిత్వ శాఖకు చెందిన బృందం త్వరలో రాష్ట్రానికి వస్తోందని, వారితో ఈ రంగంలో అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. ఇంగ్లండ్‌లో పర్యటించాలని కేటీఆర్‌ను సాజిద్ ఆహ్వానించారు. టీ హబ్- లెడ్మ్యాక్తో ఒప్పందం గచ్చిబౌలిలోని టీ హబ్‌ను ఇంగ్లండ్ సహాయ మంత్రి సాజిద్ జావిద్.. కేటీఆర్‌తో కలసి పరిశీలించారు. టీ హబ్, ఇంగ్లండ్‌లోని లెడ్‌మ్యాక్ లిమిటెడ్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. కేటీఆర్, సాజిద్ల సమక్షంలో టీహబ్ సీఈఓ జయ్‌కృష్ణన్, లెడ్‌మ్యాక్ సీఈఓ సర్ఫరాజ్ హసన్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మ్యాకలిస్టర్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. భారత్‌లో ఇంక్యుబేటర్, స్టార్టప్, విద్య వంటి రంగాల్లో కలసి పనిచేయాలని టీ హబ్, లెడ్‌మ్యాక్ సంస్థలు నిర్ణయించాయి.