రాష్ట్రానికి ఇంగ్లండ్ సహకారం
హైదరాబాద్: పలు రంగాల్లో రాష్ట్రంతో కలసి పనిచేసేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం ముందుకొచ్చిందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. హైదరాబాద్‌లోని టీ హబ్‌ను ఇంగ్లండ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ సహాయ మంత్రి సాజిద్ జావిద్ గురువారం సందర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, సైబర్ టెక్నాలజీ, గేమింగ్ యానిమేషన్ తదితర రంగాల్లో కలసి పనిచేసేందుకు సాజిద్ జావిద్ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. యూరప్ దేశాల్లో స్టార్టప్‌ల నిర్వహణలో ఇంగ్లండ్ నంబర్ వన్‌గా ఉందని సాజిద్ చెప్పారన్నారు.
టీహబ్‌తో కలసి పనిచేసేందుకూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. చిన్న దేశమైన ఇజ్రాయెల్‌తో కలసి ఇంగ్లాండ్ ఎంతో ప్రగతి సాధించిందని, లండన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన 30-40 స్టార్టప్‌లు లిస్ట్ అయ్యాయని వివరించారు. ఇంగ్లండ్‌కు చెందిన లైఫ్ సెన్సైస్ మంత్రిత్వ శాఖకు చెందిన బృందం త్వరలో రాష్ట్రానికి వస్తోందని, వారితో ఈ రంగంలో అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. ఇంగ్లండ్‌లో పర్యటించాలని కేటీఆర్‌ను సాజిద్ ఆహ్వానించారు.
టీ హబ్- లెడ్‌మ్యాక్‌తో ఒప్పందం
గచ్చిబౌలిలోని టీ హబ్‌ను ఇంగ్లండ్ సహాయ మంత్రి సాజిద్ జావిద్.. కేటీఆర్‌తో కలసి పరిశీలించారు. టీ హబ్, ఇంగ్లండ్‌లోని లెడ్‌మ్యాక్ లిమిటెడ్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. కేటీఆర్, సాజిద్‌ల సమక్షంలో టీహబ్ సీఈఓ జయ్‌కృష్ణన్, లెడ్‌మ్యాక్ సీఈఓ సర్ఫరాజ్ హసన్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మ్యాకలిస్టర్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. భారత్‌లో ఇంక్యుబేటర్, స్టార్టప్, విద్య వంటి రంగాల్లో కలసి పనిచేయాలని టీ హబ్, లెడ్‌మ్యాక్ సంస్థలు నిర్ణయించాయి.