బ్రూక్ 317 రూట్ 262
ముల్తాన్ టెస్టులో రికార్డుల దుమ్ము దులిపిన ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్‌లో 823/7 డిక్లేర్డ్
బ్రూక్ ట్రిపుల్ సెంచరీ
రూట్ డబుల్ సెంచరీ
ఓటమి దిశగా పాకిస్తాన్
ముల్తాన్: టెస్టు ఫార్మాట్‌లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్‌పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు.
ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్‌తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఇవీ రికార్డులు
4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్‌పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్‌పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి.
1 పాకిస్తాన్‌పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.
454 టెస్టు క్రికెట్‌లో నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.
2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్‌ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment