T20 WC 2024: ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు | England Announce Squad For Women T20 World Cup 2024 UAE, Heather Knight To Lead, Check Names Inside | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు

Published Tue, Aug 27 2024 4:30 PM | Last Updated on Tue, Aug 27 2024 5:25 PM

England Announce Squad For Women T20 World Cup 2024 UAE

మహిళల టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్‌ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.

సీనియర్లపై వేటు
హీథర్‌ నైట్‌ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెస్‌ హీత్‌, ఆల్‌రౌండర్‌ ఫ్రేయా కెంప్‌, రైటార్మ్‌ పేసర్‌ డేనియెల్‌ గిబ్సన్‌లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్‌ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. 

అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్‌ క్రాస్‌, టామీ బీమౌంట్‌లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ మహిళా టీ20 జట్టు సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.

సూపర్‌ ఫామ్‌లో ఇంగ్లండ్‌
ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్‌ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్‌ జాన్‌ లూయీస్‌ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.

ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్‌.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్‌ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్‌ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ మహిళా జట్టు గ్రూప్‌ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.

ముందుగానే అబుదాబికి హీథర్‌ బృందం
అయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు మార్చారు.

అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్‌ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్‌ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ద్వారా ప్రపంచకప్‌-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.

టీ20 ప్రపంచకప్‌-2024 కోసం ఇంగ్లండ్‌ మహిళా జట్టు
హీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.

చదవండి: యూఏఈలో అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు టోర్నీ  
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement