రాజధాని అఖండ జ్యోతి మళ్లీ కొండెక్కింది
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ సంకల్పానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతి మంగళవారం మళ్లీ కొండెక్కింది. సంకల్ప జ్యోతి పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే.. అమరావతి శంకుస్థాపనకు రెండు రోజుల ముందు గత ఏడాది అక్టోబరు 20వ తేదీన రాజధాని నిర్మాణ పనులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగాలని మంత్రి మాణిక్యాలరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్లు అమరావతిలోని అమరేశ్వరాలయంలో అఖండ దీపం వెలగించి, ఆ జ్యోతిని నవ్యాంధ్ర నూతన రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం తీసుకువచ్చారు. రాజధాని శంకుస్థాపన తరువాత సంకల్పజ్యోతి నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో అదే జ్యోతిని మళ్లీ క్రీడాకారులతో నవంబరు 21వ తేదీన అమరావతి అమరేశ్వరాలయానికి చేర్చారు.
రాజధాని నిర్మాణం 50 శాతం పూర్తయ్యే వరకు ఈ సంకల్ప జ్యోతిని వెలిగించే ఉంచుతామని, అమరేశ్వరాలయంలో వచ్చే శివరాత్రి వరకు ఉంచి, తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి అలయంలో ఉంచుతామని అనాడు దేవాదాయశాఖ, క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం వెలిగి ఉండాల్సిన అఖండ జ్యోతి గతంలో ఒకసారి కొండెక్కగా మళ్లీ ఇప్పుడు కొండెక్కడంలో దేవాలయ సిబ్బంది నిర్లక్ష్యం బయట పడింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.