విద్యార్థులకు దిక్సూచిలా ఎడ్యుకేషన్ ఫెయిర్
‘సాక్షి’ ప్రయత్నం భేష్
అభినందించిన తెలంగాణ
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
తొలిరోజు భారీగా తరలివచ్చిన
విద్యార్థులు, తల్లిదండ్రులు
నేడు కూడా...
ఖైరతాబాద్: ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో శనివారం విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్-2015ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ రంగాలతోపాటు విదేశీ విద్యనభ్యసించేందుకు విద్యార్థులకు గల అవకాశాలను ఫెయిర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇక్కడ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే నిపుణులుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులు రెండురోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఉపయోగించుకోవాలని సూచి ంచారు. కార్యక్రమంలో సాక్షి ఏడీవీటీ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి, అడ్వర్టైజింగ్ జీఎం రమణకుమార్, డీజీఎం సంతోష్, ఏజీఎం శ్రీనివాస్, వినోద్ పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన విద్యార్థులు
ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను మొదటి రోజు మూడు వేల మందికి పైగా విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మాక్ కౌన్సెలింగ్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాగా రెండవ రోజు.. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ కొనసాగుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
కన్ఫ్యూజన్ తొలగింది..
ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన తనకు ఎంచేయాలో తెలియక తికమక పడుతున్నాను. సాక్షి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను సందర్శించాక ఎలాంటి అవకాశాలున్నాయనే దానిపై అవగాహన ఏర్పడింది. కన్ఫ్యూజన్ తొలగింది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- ఎస్. కీర్తన, చైతన్యపురి
మాక్ కౌన్సెలింగ్ బాగుంది
ఎంసెట్ రాసిన వారికి మాక్ కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటితో పాటు వివిధ కళాశాలకు చెందిన స్టాల్స్‌లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా ఎలాంటి అవకాశాలున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఫెయిర్ ఉపయోగకరంగా ఉంది.
- ఎల్.మౌనిక, విద్యార్థిని, కూకట్పల్లి
ఫెయిర్ భేష్
విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎలాంటి కళాశాలలో చేర్పించాలి, అందుకు గల పూర్తి వివరాలను ఒకే వేదికపై సాక్షి - భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా ఏర్పాటుచేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా విద్యార్థులు తప్పక సందర్శించి వారి భవిష్యత్తును నిర్ణయించుకోవాలి.
- కె.మాణిక్ ప్రభు, అడ్వకేట్, మాదన్నపేట్
ఎంతో ఉపయోగకరంగా ఉంది
ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ చేయాలా లేదా డిగ్రీ చేయాలా అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్న వివిధ రకాల స్టాల్స్‌లో పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఫెయిర్ ఎంతో ఉపయోగకరంగా ఉంది.
- సుబ్బలక్ష్మి, కూకట్పల్లి (ఇద్దరు కుమార్తెలతో)