Sakshi Maharaj
-
‘విల్లు, బాణాలతో జిహాదీలను ఎదుర్కొందాం’
లక్నో: జిహాదీలు దాడి చేస్తే ఎదిరించడానికి హిందువులు ఇళ్లల్లో విల్లు బాణాలు సిద్ధంగా ఉంచుకోవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ పిలుపునిచ్చారు. తలపై టోపీలు, చేతిలో కర్రలతో ఉన్న ఓ గుంపు ఫొటోను ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ‘‘ఈ మూక మీ వీధికి, మీ ఇంటికి అకస్మాత్తుగా వస్తే రక్షించుకోవడానికి మీకేదైనా మార్గం ఉందా? లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు రారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడో దాక్కుంటారు. జిహాద్ ముగిసి, మూక వెళ్లిపోయిన తర్వాతే వస్తారు. అలాంటి ‘అతిథుల’ కోసం రెండు బాక్సుల కూల్‌డ్రింక్ సీసాలను, విల్లులు, బాణాలను ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి’’ అని పోస్టు చేశారు. జైశ్రీరామ్ అంటూ ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఫేసుబుక్ పోస్టును సమర్థించుకున్నారు. సాక్షి మహారాజ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. -
ముస్లింలపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
లక్నో: మరో వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న వేళ ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కటియార్‌కు మద్దతుగా నిన్న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. హిందువులకు, ముస్లింలకు సంబంధించిన స్మశాన వాటికల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులకు ఇరుకైన శ్మశాన వాటికలుంటే, ముస్లింలకు మాత్రం విశాలమైన శ్మశాన వాటికలు ఉన్నాయని.. ఇది పూర్తిగా వివక్షేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జనాభా ప్రాతిపదికన శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకే ఒక్క ముస్లిం ఉన్నా వారి శ్మశాన వాటిక మాత్రం చాలా పెద్దగా ఉంటోందని, హిందువులు మాత్రం తమ ఆత్మీయులకు పొలాల పక్కన దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇదెక్కిడి న్యాయం?’ అని ప్రశ్నించారు. ఇక ఉపేక్షించలేమని, ఎవరూ మన ఓపికను పరీక్షించకూడదని సాక్షి మహరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికలపై ఏవిధంగా ప్రభావితం చూపుతాయో తెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఎన్నికలపై ఏవిధంగా ప్రభావం చూపనున్నాయో తెలియాల్సి ఉంది. చదవండి: ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు -
బాంబు పెట్టి చంపేస్తానంటూ ఎమ్పీకి బెదిరింపు
లక్నో: ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్‌ను బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బిజ్నోర్ జిల్లాకు చెందిన గఫర్‌గా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. గఫర్ కువైట్‌లో ఉండగా సాక్షి మహారాజ్‌కు ఫోన్ చేసి బాంబు పెట్టి ఆయనను చంపేస్తానని బెదిరించాడు. ఎమ్పీ పిర్యాదుతో గఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మీద సెక్షన్ 504 (శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్ 507 (క్రిమినల్ బెదిరింపు), ఐపీసీసెక్షన్ 66, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. గఫర్ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, సివిల్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం’
ఉన్నావ్(యూపీ): అయోధ్యలోని రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభం కానున్నట్లు శనివారం వివాదస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో రామ మందిర నిర్మాణంపై జరుగుతున్న విచారణ పూర్తికావచ్చిందని తీర్పు వెల్లడించడమే మిగిలి ఉందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు రామ మందిరానికి అనుకూలంగానే వస్తుందని నొక్కిచెప్పారు. నిరవధికంగా నలభై రోజులపాటు ఇరుపక్షాల వాదనలు విని, విచారించిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో పురావస్తు శాఖ వాస్తవాలను వెలికితీసి సుప్రీంకోర్టుకు సమర్పించిందని, ఇప్పటికే రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. ఒకవేళ అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అని ప్రశ్నించగా.. ‘నేను సాక్షిని. సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై నాకు స్పష్టత ఉంది. డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుంద’ని వక్కాణించారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆ భూమిని తాము ఎవరికీ ఇవ్వబోమని ఇటీవల లక్నోలో జరిగిన సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్మానించింది. -
‘డిసెంబర్ 6 నుంచి రామ మందిర నిర్మాణం’
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని ఆయన అన్నారు. రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. బాబర్ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్ బోర్డు అంగీకరించాలన్నారు .మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ..తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు. -
జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ ఎంపీ
లక్నో : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి ఎంపీగా గెలుపొందిన సాక్షి మహరాజ్.. జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను పరామర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్న సెంగార్‌ను కలిసిన సాక్షి మహరాజు కాసేపు అక్కడే గడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా కాలం నుంచి సెంగార్ జైల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు సెంగార్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాన’ని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాక్షి మహరాజు ఉన్నావ్‌లోని సెంగార్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
హిందూత్వ వాదుల అఖండ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడానికి కారణం ప్రజలు హిందూత్వ వాదానికి పట్టం గట్టడమేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ‘వికాస్’ ప్రధాన నినాదంగా ప్రచారం చేయడం ద్వారా గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈసారి ఆ నినాదాన్ని పక్కన పడేసి ‘హిందూత్వ’ నినాదాన్ని పట్టుకోవడం వల్ల గతంలోకెల్లా బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చాయి. గత బీజేపీ హయాంలో పెరిగిన గోరక్షక దాడులు, మూక హత్యలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ధరలు తదితర అంశాలన్నీ హిందూత్వ జాతీయవాదం ముందు తుడిచిపెట్టుకుపోయాయి. మూకుమ్మడి హత్యకు సంబంధించిన టెర్రరిస్టు కుట్ర కేసులో విచారణ ఎదుర్కొంటూనే బీజేపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌పై అఖండ విజయం సాధించడం మామాలు విషయం కాదు. కరుడుగట్టిన హిందూత్వ వాదులు సాక్షి మహరాజ్, గిరిరాజ్ సింగ్, అనంతకుమార్ హెగ్డేలు గతంకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడం అంటే హిందూత్వవాదానికి ప్రజలు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటకలోకి ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌కుమార్ హెగ్డే కేంద్రంలో వ్యాపారరంగంలో నైపుణ్యాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కరడుగట్టిన ఆర్ఎస్సెస్ వాదే కాకుండా దాని విద్యార్థి సంస్థ ఏబీవీపీలో కూడా పనిచేశారు. ముస్లింలు, దళితులకు వ్యతిరేకండా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఆయనకు అలవాటు. ఇస్లాం బతికున్నంతకాలం ప్రపంచంలో శాంతి అనేది ఉండదంటూ 2016లో ఆయన విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఆయనపై కేసు కూడా నమోదయింది. ఇక ఆయన 2018లో దళితులను మొరిగే కుక్కలంటూ అవమానించారు. ఆగ్రాలోని తాజ్ మహల్ కూడా ఒకప్పుడు ‘తేజో మహాలయ అనే శివాలయం’ అంటూ కొత్త వివాదాన్ని కూడా తీసుకొచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి ఏకంగా నాలుగు లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. గిరిరాజ్ సింగ్ కేంద్ర సూశ్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న గిరిరాజ్ సింగ్ బీహార్ ఎంపీ. ఇంతకుముందు ఆయన నావడా నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఈసారి సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఎదుర్కొనేందుకు బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపొందిన ఆయన ముస్లింల సంతానోత్పత్తిని ఎదుర్కొనేందుకు పదేసి మంది పిల్లల్ని కనాలంటూ హిందువులకు పలుసార్లు పిలుపునిచ్చారు. మోదీకి మద్దతివ్వని వారంతా పాకిస్థాన్‌కు వెళ్లాలంటూ హెచ్చరించారు. ఆయన పదే పదే మతపరమైన విమర్శలు చేస్తుంటే 2014 ఎన్నికల సందర్భంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు కూడా విధించింది. ఈసారి కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. గత ఎన్నికల్లో ఆయన 44.1 శాతం పోలింగ్‌తో 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈసారి మంచి స్పీకర్‌గా పేరుపొండడమేకాకుండా వినూత్న రీతిలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేసిన కన్హయ్య కుమార్‌పై 56.53 ఓట్ల శాతంతో రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సాక్షి మహరాజ్ కరుడుగట్టిన హిందూత్వవాది సాక్షి మహరాజ్‌పై ఏకంగా 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా 2011లో ఆయన ఓ మూకుమ్మడి రేప్ కేసు నుంచి బయటపడ్డారు. 2013లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన ఇప్పటికీ నిందితుడే. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడే. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా ఆయన పలుసార్లు వర్ణించారు. ప్రతి హిందువు కనీసం నలుగురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఆవును హింసించినా, మతం మారిన హత్య కేసు కింద మరణిదండన విధించాలంటూ ప్రచారం చేశారు. ఆయన గత ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి యూపీలోని ఉన్నావో నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అరుణ్ శంకర్ శుక్లాపై ఏకంగా నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆమె కరడుగట్టిన హిందూత్వ వాది. 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితురాలు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె అనారోగ్య కారణాలపై బెయిల్ తీసుకొని మూడుసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. మూడోసారి ఆపరేషన్‌తో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ నయం అయింది. అయితే తాను రోజు ఆవు మూత్రం తాగడం వల్ల తన క్యాన్సర్ నయం అయిందని కూడా ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసుకున్నారు. ఓ హత్య కేసు విచారణను ఎదుర్కొంటూనే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్ర సష్టించారు. తాను నిందితులుగా ఉన్న మాలెగావ్ కేసును విచారిస్తున్న ‘యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్’ చీఫ్ హేమంత్ కర్కరే అదే సంవత్సరం సంభవించిన ఓ బాంబు పేలుడులో మరణించగా తన శాపం కారణంగానే ఆయన మరణించారంటూ వ్యాఖ్యానించి తాత్కాలికంగా చిక్కుల్లో పడ్డారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో తాను ప్రముఖ పాత్ర వహించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని కూడా పదే పదే చెప్పుకున్నారు. ఆమె దిగ్విజయ్ సింగ్‌పై మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.