లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని ఆయన అన్నారు. రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. బాబర్ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్ బోర్డు అంగీకరించాలన్నారు .మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ..తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment