సాక్షికి ఎయిర్ ఇండియా నజరానా
రియో 2016 ఒలింపిక్స్ లో కోట్లాది భారతీయుల కలను సాకారం చేసిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు ఎయిర్ ఇండియా మరో అరుదైన బహుమతిని ప్రకటించింది. మహిళల ఫ్రీ స్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నహరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్ (23 ) విజయానికి గుర్తుగా నజరానాను అందించనుంది. ఒక సంవత్సరంపాటు వర్తించేలా ఏదైనా రెండు ప్రదేశాలకు, రెండు బిజినెస్ క్లాస్ రిటన్ టికెట్స్ ను (సాక్షి, ఆమెతోపాటు మరొకరికి) ఉచితంగా అందిస్తున్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విమానంలో ప్రయాణించే క్రీడాకారిణి కావాలని కలలు కన్న సాక్షిని తాము ఇలా సన్మానించనున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమకు గర్వకారణమని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.
రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై ఇప్పటికే ఒకవైపు అభినందనల వెల్లువ, మరోవైపు భారీ నజరానాలు అందుతున్నాయి. హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.20 లక్షల ప్రత్యేక అవార్డు, రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. అటు భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతిని ప్రకటించింది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. లక్ష అందజేయనున్నారు. 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాక్షి రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
#AI is happy to offer two Business class return tickets to the pride of Nation,#SakshiMalik.You made us proud.#Rio2016.
— Air India (@airindiain) August 19, 2016