సేలం లోక్‌సభ నియోజకవర్గంలో అంతా కొత్తవారే
ఇదో రికార్డు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న వారంతా కొత్తవారే. మొదటిసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన వారే. తమిళనాడులోని సేలం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలన్నీ కొత్త అభ్యర్థులకే అవకాశమిచ్చాయి. ఇక్కడి నుంచి ఏఐఏడీఎంకే తరఫున పనీర్‌సెల్వం, డీఎంకే నుంచి ఉమారాణి, కాంగ్రెస్ నుంచి మోహన్ కుమార మంగళం, ఆప్ నుంచి సతీశ్‌కుమార్‌లు పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఏడుసార్లు గెలుపొందింది. 2009లో మాత్రం ఏఐఏడీఎంకే అభ్యర్థి సెమ్మాలై గెలుపొందారు. సంవత్సరం క్రితం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆడిటర్ రమేశ్ హత్యకు గురయ్యారు. దాంతో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలని, రమేశ్ హత్యానంతర సానుభూతి ఓట్లు, మోడీ ప్రభావంతో ఈజీగా గెలుస్తామని బీజేపీ కార్యకర్తలు పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థించారు. కానీ పొత్తుల లెక్కల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ డీఎండీకేకు కేటాయించింది. డీఎండీకే అభ్యర్థి సుధీశ్ కూడా రాజకీయాలకు, ఎన్నికలకు కొత్తవాడే.