ఢిల్లీలో అల్‌కాయిదా సభ్యుడి అరెస్టు
దేశంలోని రోహింగ్యాలను రెచ్చగొట్టేందుకు కుట్ర
న్యూఢిల్లీ: భారత్‌లో శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలను రెచ్చగొట్టి మయన్మార్ సైన్యంపై పోరాడేలా చేయడానికి వచ్చిన ఉగ్రసంస్థ అల్‌కాయిదా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ సంతతి బ్రిటిష్ పౌరుడైన సమీయున్ రెహ్మాన్(27) అలియాస్ రాజుభాయ్‌ను సోమవారం తూర్పు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపారు.
షుమన్ హక్ పేరుతో బిహార్ కిషన్‌గంజ్ ప్రాంతానికి చెందినవాడిగా తప్పుడు ఓటర్ ఐడీ కార్డును కూడా అతను తయారుచేసుకున్నట్లు వెల్లడించారు. మయన్మార్ సైన్యంపై పోరాడటం కోసం భారత్‌లోని మిజోరాం, మణిపూర్‌లో బేస్‌లు ఏర్పాటు చేయడానికి, నిధులు సేకరించడానికి రెహ్మాన్ యత్నించాడన్నారు. రెహ్మాన్ కార్యకలాపాలపై జూలై నుంచి నిఘా ఉంచిన తాము పక్కా సమాచారంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 9 ఎంఎం పిస్టల్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, 2,000 అమెరికన్ డాలర్లు, దాదాపు రూ.13 వేల విలువైన భారత, బంగ్లాదేశ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.