రీరిలీజ్‌తో రూ.50కోట్ల కలెక్షన్లు.. తొలి చిత్రంగా రికార్డు!
టాలీవుడ్ స్టార్స్ అభిమానులకు రీ రిలీజ్‌ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా మహేష్‌బాబు, ప్రభాస్,.. తదితరుల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు ధియేటర్లలో కాసుల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆయా సినిమా ధియేటర్ల వద్ద అభిమానుల జాతర కనిపిస్తోంది. తాజాగా రామ్‌చరణ్ సినిమా ఆరెంజ్ సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో మరికొన్ని సినిమాల రీ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాయి కూడా. ఈ ట్రెండ్ ఇటు టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్‌లోనూ జోరందుకుంది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇక్కడ లాగే అక్కడా కనిపిస్తోంది.ఇటీవలే అలా రీ రిలీజ్ అయిన ఓ సినిమా సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. పైగా ఆ సినిమా కధానాయకుడు కూడా ఏ సల్మానో, అమీర్ ఖానో కాకుండా ఒక చిన్న స్థాయి హీరో కావడం విశేషం. ఆ సినిమా హీరో గతంలో పలు తెలుగు సినిమాల ద్వారా మనకూ చిరపరిచితుడే. అతడే హర్షవర్ధన్ రాణే, అతను మావ్రా హోకేన్ నటించిన సనమ్ తేరి కసమ్(Sanam Teri Kasam ) మళ్లీ విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది. థియేటర్లలో రీరిలీజ్ అయిన తర్వాత ఇండియన్ హిస్టరీలో 50 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి సినిమాగా ఇప్పుడు రికార్డు సృష్టించింది.(చదవండి: మజాకా మూవీ రివ్యూ)చిత్ర నిర్మాత దీపక్ ముకుత్ ఇన్‌స్ట్రాగామ్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, ‘‘మా చిత్రం రికార్డులను బద్దలు కొడుతోంది, అదంతా మీ ఎడతెగని ప్రేమ వల్లనే’’ అంటూ. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 5, 2016న థియేటర్లలో విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇది వాలెంటైన్స్ వీక్‌లో మళ్లీ విడుదలై అప్పటి నుంచీ థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా హారర్ సినిమా తుంబాద్ కలెక్షన్స్‌ను అధిగమించింది దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన రీ–రిలీజ్ చిత్రంగా నిలిచింది. తుంబాద్.. రూ.32 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే...సనమ్ తేరి కసమ్ రీ–రిలీజ్ కేవలం 16 రోజుల్లోనే 32 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ రూ.53 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఈ సినిమా విజయం వినోద పరిశ్రమ హిట్ ఫార్ములాను మార్చివేసింది, చిన్న బడ్జెట్‌తో చేసిన సాధారణ ప్రేమకథ సైతం పెద్ద హిట్ అవుతుందని నిరూపించింది. .సనమ్ తేరి కసమ్ చిత్రానికి రాధికా రావు వినయ్ సప్రు దర్శకత్వం వహించారు చిరంతన్ దాస్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకానే, విజయ్ రాజ్ మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. తకిట తకిట అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగానికి పరిచయం కావడం విశేషం. హర్షవర్ధన్ రాణే... ఆ తర్వాత అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఫిదా వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.