sanctioned funds
-
పోలవరం ఖర్చులో రూ.320 కోట్లు మంజూరు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.320 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను 2021–22 బడ్జెట్లో కేంద్ర జల్ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశించారు. ఇవి గురువారం పీపీఏ ఖాతాలో చేరతాయి. శుక్రవారం రాష్ట్ర ఖజానాకు చేరతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. 2014 ఏప్రిల్ 1న నీటి పారుదల విభాగం వ్యయం వంద శాతం తిరిగిస్తామని (రీయింబర్స్ చేస్తామని) హామీ ఇచ్చింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.18,372.14 కోట్లు ఖర్చు చేసింది. అందులో 2014 ఏప్రిల్ 1 తర్వాత చేసిన వ్యయం రూ.13,641.43 కోట్లు. ఇందులో కేంద్రం ఇప్పటిదాకా రూ.11,492.16 కోట్లు తిరిగిచ్చింది. ఇంకా రూ.2,149.27 కోట్లను కేంద్రం బకాయిపడింది. రూ.711.60 కోట్లు రీయింబర్స్ చేయాలని పీపీఏ ప్రతిపాదన.. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,149.27 కోట్ల బిల్లులను ప్రాజెక్టు అధికారులు పీపీఏకు సమర్పించారు. ఈ బిల్లులను పరిశీలిస్తున్న పీపీఏ.. ప్రస్తుతానికి రూ.711.60 కోట్లు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కూడా ఆమోదం తెలపడంతో, ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో తొలి దశలో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మంజూరు చేసింది. మిగతా మొత్తాన్ని మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా మంజూరు చేసిన రూ.320 కోట్లు పోను, కేంద్రం ఇప్పటికీ రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.1829.27 కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉంది. -
195 కి.మీ. ఎన్‌హెచ్‌కు నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 సంవత్సరానికి రాష్ట్రంలో రూ.1,005.38 కోట్ల వ్యయంతో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నిజాంపేట–బీదర్ ఎన్‌హెచ్ 161బీపై అదనంగా 2 లేన్ అప్‌గ్రెడేషన్ కోసం అవసరమైన భూ సేకరణకు రూ.27.79 కోట్లు మంజూరు చేసినట్లు వివరించా రు. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి కింద ఎన్‌హెచ్–565లోని నకిరేకల్–నాగార్జునసాగర్ మధ్య ప్రాంతంలో పునరావాసం, అప్‌గ్రేడ్ చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న పనులను మంజూరు చేసినట్లు మంగళవారం ట్విట్టర్ వేదికగా గడ్కరీ ప్రకటించారు. అంతేగాక హైదరాబాద్–బెంగళూర్ జాతీయ రహదారి–44లో రోడ్డు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన సర్వీసు రోడ్లు, వాహన అండర్ పాస్‌ల నిర్మాణం కోసం రూ.21.16 కోట్లు మంజూరు చేశామ న్నారు. ఎన్‌హెచ్–163లోని హైదరాబాద్–భూపాలపట్నం మధ్య రహదారికి రూ.48.32 కోట్లు మంజూరు అయ్యిందన్నారు. ఇదే జాతీయ రహదారిలోని 2 లేన్ల రహదారులను 4 లేన్లులుగా అభివృద్ధి చేసేందుకు రూ.317.19 కోట్లు కేటాయించామన్నారు. ఎన్‌హెచ్–63పై ఉన్న ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ మధ్య రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు పునరావాసం కల్పించడం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, రహదారి భద్రతా సదుపాయాలు తదితర అంశాల అభివృద్ధికి రూ.545.11 కోట్లు మంజూరు అయ్యాయని గడ్కరీ వెల్లడించారు. ఎన్‌హెచ్ –167లోని జడ్చర్ల్ల–కల్వకుర్తి మధ్య జడ్చర్ల్ల పట్టణంలో 4 లేన్ల ఆర్ఓబీ నిర్మాణం/పునర్నిర్మాణం కోసం రూ.45.81 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. చదవండి: 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ -
పాఠాలే సాగని బడులకు ‘నిర్వహణ నిధులు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా రోజువారీగా కొనసాగే పాఠశాలల అవసరానికి అనుగుణంగా ఏటా ప్రభుత్వం నిర్వహణ రూపంలో నిధులు మంజూరు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలకు రూ.7వేలు చొప్పున నిర్వహణ నిధులను విడుదల చేస్తారు. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా విద్యార్థులు లేకుండా తాళం పడిన స్కూళ్లకు నిర్వహణ నిధులు ఆయా పాఠశాలల ఖాతాల్లో జమచేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు వంద స్కూళ్లకు ఇదే తరహాలో నిధులు రిలీజ్ చేయడం గమనార్హం. తప్పులతడకగా... జిల్లాలో 2,280 ప్రభుత్వ పాఠశాలలకు 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధుల కింద రూ. 1.51కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. దీంతో ఈ పాఠశాలల ఖాతాలో నిధులను జిల్లా సర్వశిక్షా అభియాన్ అధికారులు ఆయా పాఠశాలల ఖాతాలో నిధులు జమచేశారు. ఇందులో 1,596 ప్రాథమిక పాఠశాలలు, 255 ప్రాథమికోన్నత, 429 ఉన్నత పాఠశాలలున్నాయి. విద్యార్థులు లేకపోవడంతో జిల్లాలో వందకుపైగా పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో వీటిని జాబితా నుంచి తొలగించిన అనంతరం కొనసాగుతున్న పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారులు ఎస్ఎస్ఏకు సమర్పించాలి. కానీ ఎంఈఓల నిర్లక్ష్య వైఖరితో పాత జాబితాలనే తిప్పి పంపారు. దీంతో ఆమేరకు నిధులు విడుదల చేశారు. నిర్వహణ నిధులందుకున్న మూతపడిన పాఠశాలలు మచ్చుకు కొన్ని.. * యాచారం మండలంలో పీఎస్ మర్లకుంటతండా, పీఎస్ కొత్తపల్లితండా, పీఎస్ మాల్(ఉర్దూ మీడియం) పాఠశాలలు మూతబడి చాలాకాలమవుతున్నా నిర్వహణ నిధులు మాత్రం ఆయా పాఠశాలల ఖాతాల్లో జమవుతున్నాయి. * మంచాల మండలం ఆరుట్ల గ్రామం పీఎస్ హరిజనవాడ-2, బగ్గతండా ప్రాథమిక పాఠశాలలు మూతబడి ఏడాది పూర్తయినా సర్వశిక్షా అభియాన్ అధికారులు నిర్వహణ నిధులు విడుదల చేశారు. * ఇలా ఐదారు పాఠశాలలే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో ఒకట్రెండు పాఠశాలలకు పైగా నిధులు జమచేశారు. అయితే నిధులు జమచేయడం సులువైనప్పటికీ.. వెనక్కు తీసుకోవడం మాత్రం అంతతేలికైన విషయం కాదు. ఎందుకంటే బడి మూతబడడంతో పాఠశాల ఖాతా ఫ్రీజ్ చేస్తారు. ప్రస్తుతం అన్ని పాఠశాలలకు కమిటీలున్న నేపథ్యంలో స్థానిక మండల విద్యాధికారితో పాటు సంబంధికులంతా ఆమోదం తెలిపిన తర్వాతే నిధులు వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది.