పాఠాలే సాగని బడులకు ‘నిర్వహణ నిధులు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా రోజువారీగా కొనసాగే పాఠశాలల అవసరానికి అనుగుణంగా ఏటా ప్రభుత్వం నిర్వహణ రూపంలో నిధులు మంజూరు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలకు రూ.7వేలు చొప్పున నిర్వహణ నిధులను విడుదల చేస్తారు. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా విద్యార్థులు లేకుండా తాళం పడిన స్కూళ్లకు నిర్వహణ నిధులు ఆయా పాఠశాలల ఖాతాల్లో జమచేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు వంద స్కూళ్లకు ఇదే తరహాలో నిధులు రిలీజ్ చేయడం గమనార్హం.
తప్పులతడకగా...
జిల్లాలో 2,280 ప్రభుత్వ పాఠశాలలకు 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధుల కింద రూ. 1.51కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. దీంతో ఈ పాఠశాలల ఖాతాలో నిధులను జిల్లా సర్వశిక్షా అభియాన్ అధికారులు ఆయా పాఠశాలల ఖాతాలో నిధులు జమచేశారు.
ఇందులో 1,596 ప్రాథమిక పాఠశాలలు, 255 ప్రాథమికోన్నత, 429 ఉన్నత పాఠశాలలున్నాయి. విద్యార్థులు లేకపోవడంతో జిల్లాలో వందకుపైగా పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో వీటిని జాబితా నుంచి తొలగించిన అనంతరం కొనసాగుతున్న పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారులు ఎస్‌ఎస్‌ఏకు సమర్పించాలి. కానీ ఎంఈఓల నిర్లక్ష్య వైఖరితో పాత జాబితాలనే తిప్పి పంపారు. దీంతో ఆమేరకు నిధులు విడుదల చేశారు.
నిర్వహణ నిధులందుకున్న మూతపడిన పాఠశాలలు మచ్చుకు కొన్ని..
* యాచారం మండలంలో పీఎస్ మర్లకుంటతండా, పీఎస్ కొత్తపల్లితండా, పీఎస్ మాల్(ఉర్దూ మీడియం) పాఠశాలలు మూతబడి చాలాకాలమవుతున్నా నిర్వహణ నిధులు మాత్రం ఆయా పాఠశాలల ఖాతాల్లో జమవుతున్నాయి.
* మంచాల మండలం ఆరుట్ల గ్రామం పీఎస్ హరిజనవాడ-2, బగ్గతండా ప్రాథమిక పాఠశాలలు మూతబడి ఏడాది పూర్తయినా సర్వశిక్షా అభియాన్ అధికారులు నిర్వహణ నిధులు విడుదల చేశారు.
* ఇలా ఐదారు పాఠశాలలే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో ఒకట్రెండు పాఠశాలలకు పైగా నిధులు జమచేశారు. అయితే నిధులు జమచేయడం సులువైనప్పటికీ.. వెనక్కు తీసుకోవడం మాత్రం అంతతేలికైన విషయం కాదు. ఎందుకంటే బడి మూతబడడంతో పాఠశాల ఖాతా ఫ్రీజ్ చేస్తారు. ప్రస్తుతం అన్ని పాఠశాలలకు కమిటీలున్న నేపథ్యంలో స్థానిక మండల విద్యాధికారితో పాటు సంబంధికులంతా ఆమోదం తెలిపిన తర్వాతే నిధులు వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది.