కలెక్టర్కు కారు బహుమతి!
హాస్టల్ విద్యార్థుల కానుక
రాత్రి నిద్రలో నవ్వుల జల్లులు
సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ రాహుల్ బొజ్జా కారు బహుమతిగా అందుకున్నారు. హాస్టల్ నిద్రలో పాల్గొన్న ఆయనకు బహుమతి లభించింది. బహుమతిగా వచ్చిన కారు రంగు చూసిన ఆయన మెచ్చుకోవటంతోపాటు కారు భలే ఉందంటూ ప్రశంసించారు. దీంతో బహుమతి అందజేసిన వారు ఆనందంతో పొంగిపోయారు. అయితే జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అందుకుంది నిజమైన కారు కాదు. హాస్టల్ నిద్ర కోసం తమ వద్దకు వచ్చే జిల్లా కలెక్టర్కు మరచిపోలేని బహుమతి ఇవ్వాలని సంగారెడ్డిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 5, 6వ తరగతి విద్యార్థులు వర్థన్, వంశీ అనుకున్నారు. అనుకున్నదే తడువుగా అప్పటికప్పుడు హాస్టల్లో తమకు అందుబాటులో అట్టలు, రంగు కాగితాలు ఇతర వస్తువులతో అందమైన కారును తయారు చేశారు. సోమవారం రాత్రి 11కు హాస్టల్కు వచ్చిన కలెక్టర్ రాహుల్ బొజ్జా తమతో కలిసి మాట్లాడిన తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు విద్యార్థులు వర్థన్, వంశీలు తాము తయారు చేసిన బహుమతిని కలెక్టర్కు అందజేశారు. మరో విద్యార్థి సురేష్ చిన్న కుక్కపిల్ల బొమ్మ ఉన్న ఎర్రరంగు కారు కీస్ హోల్టర్ను కలెక్టర్కు బహుమతిగా అందజేశాడు. విద్యార్థులు బహుమతిగా ఇచ్చిన కారు బొమ్మ, కుక్కబొమ్మను చూసిన కలెక్టర్ ముచ్చపడిపోయారు, విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని ప్రశంసించారు. ఇంత విలువైన బహుమతులను తన వద్దే ఉంచుకుంటానని పిల్లలకు తెలపటంతో చిన్నారులు సంతోషించారు.
చిన్నారులతో కలెక్టర్ ముఖాముఖీ
సంగారెడ్డిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో సోమవారం విద్యార్థులతో కలిసి నిద్రించిన కలెక్టర్ రాహుల్ బొజ్జా పిల్లతో కలిసి రెండు గంటలపాటు కులాసాగా గడిపారు. కలెక్టర్ ఉపాధ్యాయుని అవతారం ఎత్తి విద్యార్థులను ప్రశ్నల్తో ముంచెత్తడంతోపాటు ఎలా చదువుకుంటే బాగా అర్థం అవుతుందో వివరించారు. హాస్టల్లోని విద్యార్థులతో కలిసి నేలపై కూర్చున్నారు. పిల్లలు ఏయే తరగతులు చదవుతున్నదీ ఆరా తీశారు. విద్యార్థులను పుస్తకాలు తెరిచి తెలుగు, ఇంగ్లీషు, సైన్స్ పాఠాలు చదవాల్సిందిగా సూచించారు. పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు చదవారు మరికొంత మంది హిందీ పద్యాలను చదివి వినిపించారు. జహీరాబాద్ ప్రాంతానికి చెం దిన వారు ఇంత దూరం వచ్చి హాస్టల్లో చేరటంపై విద్యార్థులను ప్రశ్నించగా ‘సార్ జహీరాబాద్లో హాస్టల్లో ఉంచితే ఆవారా గా తయారు అవుతారు, అందుకే మమ్మల్ని తల్లిదండ్రులు ఇక్కడ చేర్చారు’ అంటూ ఓ విద్యార్థి సమాధానం ఇవ్వటంతో కలెక్టర్ సహా అందరూ పెద్దగా నవ్వారు. హాస్టల్లోని విద్యార్థులంతా బాగా చదవుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు తమకు వాలీ బాల్, క్రికెట్ కిట్ కావాలని కోరగా వెంటనే పంపిస్తానని కలెక్టర్ రాహుల్ బొజ్జా హామీ ఇచ్చారు. రాత్రి 11.45కు కలెక్టర్ విద్యార్థులకు గుడ్నైట్ చెప్పి నిద్రకు ఉపక్రమించారు.