ఈతకెళ్లి కానరాని లోకానికి..
నగరి : ఈత సరదా ప్రాణాలను హరించింది. ఇంటి పరిసరాల్లో అడుకుంటూ పక్కన ఉన్న చెరువులోకి ఈతకెళ్లిన అక్క, తమ్ముడు కనరానిలోకానికి వెళ్లిపోయారు. ఈ ఘటన తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులను శోకసంద్రం లో ముంచింది. చిత్తూరు జిల్లా, విజ యపురం మండలం కేవీశ్రీరామపురం గ్రామానికి చెందిన సురేష్, సుమతి దంపతులకు సంగీత (11), కుమార్(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంగీత నగరి మున్సిపల్ పరిధి కోర్టు వెనుక ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ 6వ తరగతి చదువుతోంది. అలాగే కుమార్ తల్లిదండ్రుల దగ్గర ఉంటూ స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
శనివారం ఆడి కృతిక కావడంతో హాస్టల్ సెలవు ప్రకటించారు. దీంతో సంగీత తన సొంత ఊరైన కేవీశ్రీరామపురానికి వచ్చింది. సాయంత్రం తన తమ్ముడుతో ఆడుకుంటూ పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు. ఈత నేర్చుకొందాం అని సరదాగా సంగీత, కుమార్ పక్కనే ఉన్న చెరువులోకి దిగి లోతుకు వెళ్లి ముగి పోయి మృత్యువాతపడ్డారు. పక్కన పొలంలో పశువుల కాపర్లు గుర్తించి విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు.
మీరు లేని జీవితం మాకు వద్దు నాయనా...
అసలే పేద కుటుంబం. ఒక్క రోజు పనికి వెళ్లకపోయినా జీవనం గడిచిదే చాలా కష్టం. అయిన పిల్లలను ఎలాగైనా మంచి చదువు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. పిల్లలు పెరి గి బాగా చదివి ప్రయోజకులు అవుతారని అనుకున్నామని, ఇలా చెరువు తన పిల్లలను పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బిడ్డలు కళ్ల ఎదుట శవాలుగా పడుకుని ఉంటే మేము ఎవ్వరి కోసం బతకాలి, ఎందు కు బతకాలి అని విలపించారు. ఆ పిల్లలను చూడడానికి వచ్చిన బంధువులు సైతం వారి తల్లిదండ్రులను ఓదార్చలేకపోయారు. పిల్లల తల్లిదండ్రులు, బం దువుల రోదనలు చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఆ పిల్లల మృతి ఆ గ్రామాన్నే శోకసంద్రంలో ముంచేసింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది మృతదేహాలను సందర్శించి సమాచారం సేకరించారు.