‘చాంపియన్స్’గా సానియా, హింగిస్ జోడి.
లండన్: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ కలిసి మహిళల డబుల్స్‌లో అత్యద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఈ జోడిని మహిళల డబుల్స్ వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించింది. హింగిస్‌కు గతం (2000)లో సింగిల్స్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అనుభవముంది. ఈఏడాది మార్చిలో సానియా, హింగిస్ కలిసి డబుల్స్ ఆడడం ప్రారంభించి రెండు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఏడు ఇతర టైటిళ్లు సాధించారు.
యూఎస్ ఓపెన్ నుంచి తమ చివరి 22 మ్యాచ్‌ల్లో వీరికి ఓటమనేది లేదు. ఈ క్రమంలో గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యుటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్‌గా ఈ సీజన్‌ను 55-7తో ముగించారు. ‘మేం జత కట్టిన తక్కువ సమయంలోనే ఇన్ని విజయాలు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఐటీఎఫ్ నుంచి ఈ అవార్డునందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. కెరీర్లో ఇప్పటిదాకా సహాయపడిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా విజయాలు భారత క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అని సానియా తెలిపింది. మరోవైపు పురుషుల, మహిళల సింగిల్స్ వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్ ఐదోసారి, సెరెనా విలియమ్స్ ఆరోసారి ఎంపికయ్యారు.