కనిపించని సంజయ్‌కుమార్ భార్య..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీప బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనపై మిస్టరీ వీడింది. అందరూ అనుమానిస్తున్నట్లుగానే బావిలో శవాలుగా తేలిన వారంతా హత్యకు గురైనట్లు తేలింది. ఈ మేరకు తానే హత్య చేశానని నిందితుడు, బీహార్‌కు చెందిన కార్మికుడు సంజయ్‌కుమార్ యాదవ్ ఆదివారం అంగీకరించినట్లు తెలిసింది. కుట్రపూరి తంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలిసింది.
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెకుంటలో మృతుల ఘటన మిస్టరీ వీడింది. ఈ హత్యలకు పాల్పడింది తానేనని బీహార్‌కు చెందిన కార్మికుడు సంజయ్‌కుమార్ యాదవ్ ఆదివారం అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఏడుగురిని చంపేయాలని భావించినా తర్వాత ఇద్దరు బీహారీలను సైతం మట్టుపెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇందుకు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం వరంగల్ నగరంలో నాలుగైదు మెడికల్ షాపుల నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేసిన సంజయ్, హత్య చేసే రోజు కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. నిద్రమాత్రల కారణంగా అపస్మారక స్థితికి చేరిన వారిని స్నేహితులతో కలిసి గోనే సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా హత్యలకు కారకుడు సంజయ్‌కుమార్ యాదవే అయినా.. అతని వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. హత్యలకు కారణం ఆర్థిక లావాదేవీలా? వివాహేతర సంబంధాలా? అన్న చర్చ జరుగుతుండగా, అయితే ఢిల్లీలో ఉన్న మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ ప్రమేయం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా సంజయ్‌కుమార్ యాదవ్‌తో పాటు మక్సూద్ ఆలం మరదలు, యాకూబ్, మంకుషా, ఆటోడ్రైవర్ మోహన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమచారం. పూర్తి వివరాల కోసం వారిని విచారిస్తున్నట్లు తెలిసింది.(గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్.. )
స్తంభంపల్లి ఇంట్లో ఆధారాలే కీలకం..
సంజయ్‌కుమార్ యాదవ్ నివాసం ఉండే స్తంభంపల్లిలో అతడు నివాసం ఉండే ఇంట్లో లభ్యమైన ఆధారాలే పోలీసుల విచారణకు కీలకంగా మారినట్లు తెలిసింది. తొమ్మిది మంది మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు గొర్రెకుంట బావికి సమీపాన రాంచందర్ అనే వ్యక్తి ద్వారా లభ్యమైన రెండు సెల్ఫోన్లు దొరకడం.. ఆ సెల్ఫోన్లు మక్సూద్ ఆలం. ఆయన భార్య నిషా ఆలంలకు చెందినవి కావడం.. ఆ ఫోన్ల కాల్‌డేటా ఆధారంగా కూపీ లాగారు. అలాగే హత్య జరిగే కొద్ది గంటల ముందు(20న సాయంత్రం 7 గంటలకు) వెంకట్రామ థియేటర్ సమీపంలో యాకూబ్, డ్రైవర్ షకీల్, సంజయ్‌కుమార్ కలుసుకుని గొర్రెకుంటలో మక్సూద్ ఇంటికి వెళ్లడం, ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్‌కుమార్ మాత్రమే వెంకట్రామ థియేటర్ చౌరస్తా నుంచి ఇంటికి వెళ్లడం రికార్డయిన సీసీ ఫుటేజీలు పోలీసుల పరిశోధనకు ఉపకరించినట్లు సమాచారం. మక్సూద్ ఆలం వారం రోజుల క్రితం రంజాన్ పండుగ కోసం ఓ షాపింగ్ మాల్లో సుమారు రూ.25 వేల సామగ్రి ఖరీదు చేసినట్లు తెలిసింది. అయితే హత్యలు జరిగిన మరుసటి రోజు(21న) ఉదయం మక్సూద్ ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్ప సిలిండర్‌తో సహా సామగ్రి పోలీసులకు కనిపించలేదు. ఆ సిలిండర్, సామగ్రి సంజయ్‌కుమార్ యాదవ్ ఇంట్లో కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో ఆ ఇంట్లో అతని భార్య కనిపించకపోవడంతో సంజయ్‌ను వాకబు చేయగా, బీహార్‌కు వెళ్లినట్లు చెప్పినట్లు తెలిసింది. పోలీసులు బీహార్‌లో ఆయన భార్య బంధువులను కూడా ఫోన్లో వాకబు చేయగా, ఆమె అక్కడకు రాలేదని చెపినట్లు సమాచారం.
ఏ రోజు ఏం జరిగింది..
తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏమిటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం(55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. మరుసటి రోజు శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం(18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బీహార్ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా(21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం, సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్ (30) అనే డ్రైవర్ మృదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ కాల్‌డేటా, స్తంభంపల్లిలో నివాసం ఉంటున్న సంజయ్‌కుమార్ యాదవ్ ఇంట్లో దొరికిన ఆధారాలతో అనుమానితుడిగా విచారించడంతో గొర్రెకుంట గుట్టు రట్టయ్యింది.