బీహార్లో భద్రత సిబ్బంది గుట్టుముట్లను మావోయిస్టులకు చేరవేస్తున్నాడనే అభియోగంపై సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంజయ్ కుమార్ యాదవ్ను నిన్న అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాక్స్ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గయా జిల్లాలోని ఇమామ్గంజ్ పోలీసుస్టేషన్లో సంజయ్పై కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వివరించారు. మావోల కోసం భద్రత దళాలు గాలింపు చర్యలు చేపట్టే సమాచారం ముందుగానే సంజయ్ తన ఫోన్ ద్వారా మావోయిస్టులకు సమాచారం అందించేవారని ఎస్టీఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఇటీవల మావోయిస్టు ప్రదీప్ యాదవ్ను భద్రత దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, సంజయ్ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దాంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారిగా ఉన్న సంజయ్కి మావోయిస్టులతో కొనసాగిస్తున్న సంబంధంపై... బీహార్ హోంశాఖ, కేంద్ర హోంశాఖకు సమాచారం అందించింది.
దాంతో సంజయ్ అంశాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సంజయ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అయితే సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారిపై ఇలా కేసు నమోదు చేయడం బీహార్ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలో గయా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.