'నా భర్తను నాతో పంపించండి'
ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. జీవితంపై రంగుల కలలు కన్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు చేశారు. ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. భర్త తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. భరించలేక భార్య కేసు పెట్టింది. అవమానంగా భావించిన భర్త బెయిల్‌పై విడుదలై తల్లిదండ్రుల వద్దకు చేరాడు. భర్తకోసం ఎదురుచూసిన ఆమె అతను రాకపోవడంతో, మెట్టినింటికి చేరుకుంది. వారి ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది.
తిరుపతి : భర్తను తనతో పంపించాలంటూ ఓ మహిళ అత్తగారి ఇంటి ముందు మౌనదీక్షకు దిగిన సంఘటన ఆదివారం తిరుపతిలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. కుప్పానికి చెందిన శాంతిప్రియ(24), తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన రామయ్య, భాగ్యలక్ష్మిల కుమారుడు పవన్‌కుమార్ మధ్య డిగ్రీ చదివే రోజుల్లో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారడంతో శాంతిప్రియ, పవన్‌కుమార్ తల్లిదండ్రులను ఎదిరించి ఏడాది కిందట అప్పలాయగుంటలో ప్రేమ వివావాం చేసుకున్నారు.
అనంతరం వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కొద్ది నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. శాంతిప్రియకు రెండుసార్లు గర్భస్రావం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అతను కొట్టడం తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో నాలు గు నెలల క్రితం ఆమె భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆ కేసులో భర్త అరెస్ట్ ...ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అతను నేరుగా తిరుపతిలోని తల్లిదండ్రుల వద్దకు చేరాడు. గతంలో భర్త అప్పులు చేయడంతో వారంతా ఇంటికి వచ్చి అడగడం మొదలుపెట్టారు. ప్రేమ వివాహం చేసుకుందని శాంతిప్రియను తల్లిదండ్రులు సైతం ఆదరించలేదు. ఆమె ఆదివారం తిరుపతికి చేరుకుంది. భర్తతో కాపురం చేస్తానని, అత్తమామల నుంచి భర్తను కాపాడి తమకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేసింది.
ఇంటిముందు శాంతిప్రియ మౌనదీక్షకు దిగడంతో అత్త, మామ, భర్త ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. కాగా శాంతిప్రియను మోసం చేసిన భర్తను, అత్త, మామను అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి డిమాండ్ చేశారు. ఈస్ట్ పోలీసులు శాంతిప్రియ వద్దకు చేరుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించారు.