హైదరాబాద్‌ను సినిమా రాజధాని చేయాలి
ప్రముఖ సినీ నటుడు సుమన్
మోత్కూరు: హైదరాబాద్ మహానగరాన్ని ఫిలిమ్ ఇండస్ట్రీ రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రముఖ సినీ హీరో సుమన్ అన్నారు. శుక్రవారం మోత్కూరులోని సంతోష్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్ అన్నిరకాలుగా అనుకూలమైన ప్రాంతమన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రెండు వేల ఎకరాలు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తాను సినీ పరిశ్రమలో 37 ఏళ్లుగా సుమారు 350 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. దేవుడి పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ తరువాత స్థానం తనకు దక్కిందన్నారు. తెలంగాణలో మంచి కళాకారులు ఉన్నారని, ప్రతిభావంతులైన కళాకారులను తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ‘జై తెలంగాణ’ అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో తానొక్కడినేనని గుర్తుచేశారు.
ఒకే రకమైన రిజర్వేషన్లు కల్పించాలి
కులాల రిజర్వేషన్లు రాష్ట్రానికో విధంగా ఉండడం సరికాదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారైనందున ఈ సమయంలోనే జాతీయ స్థాయిలో సమాన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. తనకు సమయం దొరికినప్పుడల్లా బీసీ, గౌడ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. రైతులకు ప్రత్యేక బీమా పాలసీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే క్రమంలో అమరులయ్యే పోలీసులు, జవాన్ కుటుంబాలకు భారీ పరిహారం ఇవ్వాలన్నారు. అన్ని రకాల ప్రయోజనాలతో కలుపుకొని కోటి రూపాయల వరకు పరిహారం అందిస్తే బాగుంటుందన్నారు. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో పేద ప్రజలకు విద్యాపరంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.
సమావేశంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు గనగాని మల్లేశ్‌గౌడ్, గుండ్లపెల్లి రజింత్, ప్రవీణ్, మల్లేశ్, చౌగోని సత్యం, గునగంటి సత్యనారాయణ, దబ్బెటి సోంబాబు, గీత సొసైటీ అధ్యక్షుడు బుర్ర యాదయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నాయకులు దబ్బటి రమేష్, సోమ రాములు, మొరిగాల వెంకన్న, కారిపోతుల వెంకన్న, బీసు యాదగిరి, రాజయ్య పాల్గొన్నారు.