Saradi
-
సాగు నీరివ్వకుంటే మంత్రి ఛాంబర్ ముట్టడి
వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి అవనిగడ్డ/కోడూరు : రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నాలుగు రోజుల్లోపు సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలసి ఇరిగేషన్‌మంత్రి ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి,మాజీమంత్రి కె.పార్థసారథి హెచ్చరించారు. కోడూరు మండలంలోని వివిధ తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి వచ్చిన అనంతరం శనివారం రాత్రి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సారథి మాట్లాడుతూ కృష్ణాడెల్టా పరిరక్షకునిగా చెప్పుకునే రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, అభినవకాటన్ దొరగా తనకు తానే అభివర్ణించుకుంటూ...రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారిన ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఈ విషయమై నోరుమెదపరేమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఖరీఫ్ సీజన్ సమయం కూడా మారిపోయిందని, జూన్, జులై మాసాల్లో నాట్లు పూర్తిచేసుకునే కృష్ణాడెల్టా రైతాంగం సెప్టెంబరు మాసం వచ్చినప్పటికీ నాట్లువేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని పదేపదే ప్రకటించిన ముఖ్యమంత్రి రైతుల కష్టాలు, వారు పడుతున్న ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బాధ్యతగల మంత్రులను భూసేకరణ కోసం భాగస్వాములను చేయటాన్ని చూస్తే రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అవగతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ పంట రుణాలకు, వ్యవసాయ రుణాలకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తుండటం రైతులు చేసుకున్న దురదృష్టమన్నారు. రైతులను అన్ని విధాలుగా మోసగించి అమలు సాధ్యంకాని వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రైతులు కనువిప్పు కలిగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశా రు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బా బు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడవకొల్లు నరసింహారావు, మొవ్వ మండల పార్టీ కన్వీనర్ చిందా వీరవెంకట నాగేశ్వరరా జు, అవనిగడ్డ సర్పం చి నలుకుర్తి పృధ్వీరాజ్, వి.కొత్తపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు రేపల్లె పిచ్చేశ్వరరావు, రైతు నాయకుడు గాజుల శ్రీనివాసరావు, రాధా-రంగామిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
డైలమాలో అన్నదాత
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు దెబ్బతినడంతో రబీలో సా గునీటిని విడుదలచేస్తే దాళ్వా పంట సాగు చేసుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని వారు మంగళవారం మచిలీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి సారథిని అడిగారు. నూటికి నూరుశాతం సాగునీరు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఇంతవరకు నీటిపారుదల సమీక్షా మండలి సమావేశం కూడా నిర్వహించలేదు. రబీకి నీటి విడుదల విషయంపై నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నిం చగా, ఆ జిల్లా నుంచి ఇంకా ప్రతిపాదనే రాలేదని, ప్రాజెక్టుల నీరు ఉందని చెప్పినట్లు ప్రచారం జరగడం జిల్లా నేతల పనితీరుకు అద్దం పడుతోంది. తిరుపతిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు మంత్రి సారథి తదితరులు వెళ్లి సాగునీరు విడుదల చేయాలని కోరినా బుధవారం రాత్రి 9.30 గంటల వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు మానసిక సంఘర్షణకు లోనవుతుంటే పాల కులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. -
ఆస్పత్రిలో.. మెరుగైన సేవలకోసం వైఎస్సార్ సీపీ ధర్నా
=మంత్రి సారథిని అడ్డుకునేందుకు యత్నం =సురేష్‌బాబు, మంత్రి మధ్య వాగ్వివాదం =అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ =సారథి హమీతో ఆందోళన విరమణ ఉయ్యూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వసతుల కల్పనకు అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని, గత తీర్మానాలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు మంత్రి సారథిని డిమాండ్ చేశారు. ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం అభివృద్ధి కమిటీ సమావేశం జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న సురేష్‌బాబు దీర్ఘకాలంగా తిష్టవేసిన సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా వైద్యాధికారులు ఇచ్చిన హమీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచుతామని, 24 గంటలు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి సారథి హమీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సురేష్‌బాబు మాట్లాడుతున్న క్రమంలో అభివృద్ధి కమిటీ సమావేశానికి హజరయ్యేందుకు మంత్రి సారథి ఆస్పత్రికి వచ్చారు. దీంతో సురేష్‌బాబుతోపాటు కార్యకర్తలు మంత్రి సారథిని అడ్డుకుని సమస్యల పరిష్కారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. అత్యవసర వైద్యసేవలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ప్రసూతి వైద్యసేవలకు వైద్యులు పేదల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సురేష్‌బాబు మంత్రికి ఫిర్యాధు చేశారు. సారథి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యుల కొరత ఉన్నందున పూర్తిస్థాయిలో సేవలు అందని మాట వాస్తవమేనన్నారు. గతంలో కన్నా రోజువారి అవుట్ పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో వైద్యసేవలు పొందుతున్నారని, మెరుగైన సేవలందించేందుకు వైద్యులను నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. పలు సమస్యలపై సమావేశంలో నిర్ణమయం తీసుకుంటామని చెప్పటంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. పోలీసులపై మంత్రి సారథి అసహనం.. వైఎస్సార్ సీపీ ఆందోళన నేపథ్యంలో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి సారథిని అడ్డుకుంటారన్న సమాచారంతో సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించటంతోపాటు, సారథి సమావేశపు హాల్ల్లోకి వెళ్లేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. దీంతో మంత్రి సారథి సీఐపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఇంతమంది పోలీసులు అవసరమా? రోడ్డుపై ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోండి’అంటూ మండిపడ్డారు. దీంతో అదనపు పోలీసులు వెనుదిరిగారు. 50 పడకలుగా అప్‌గ్రేడ్‌కు చర్యలు 30 పడకల ఆస్పత్రిని 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటునట్లు మంత్రి సారథి అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మెరుగైన వసతుల కల్పనకు, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డెంటల్ చైర్ ఏర్పాటు, వైద్య పరికరాలకు సంబంధించి నిధుల మంజూరు, ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటుకు భవన నిర్మాణం, తాత్కాలిక సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చించి చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం నూతనంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన న్యూ బోర్న్ స్టేబిలైజేషన్ యూనిట్(ఎన్‌బీఎస్‌యూ)ను ప్రారంభించారు. సమావేశంలో ఇన్చార్జ్ డీసీహెచ్ నరసింగరావు, సూపరింటెండెంట్ సుధాకర్, డాక్టర్లు రవిపాల్, అన్నపూర్ణ, మదుసూదనరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు తహశీల్దార్ మహేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఖలీల్, గండిగుంట సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.