=మంత్రి సారథిని అడ్డుకునేందుకు యత్నం
=సురేష్‌బాబు, మంత్రి మధ్య వాగ్వివాదం
=అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్
=సారథి హమీతో ఆందోళన విరమణ
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వసతుల కల్పనకు అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని, గత తీర్మానాలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు మంత్రి సారథిని డిమాండ్ చేశారు. ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం అభివృద్ధి కమిటీ సమావేశం జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న సురేష్‌బాబు దీర్ఘకాలంగా తిష్టవేసిన సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా వైద్యాధికారులు ఇచ్చిన హమీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచుతామని, 24 గంటలు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి సారథి హమీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సురేష్‌బాబు మాట్లాడుతున్న క్రమంలో అభివృద్ధి కమిటీ సమావేశానికి హజరయ్యేందుకు మంత్రి సారథి ఆస్పత్రికి వచ్చారు. దీంతో సురేష్‌బాబుతోపాటు కార్యకర్తలు మంత్రి సారథిని అడ్డుకుని సమస్యల పరిష్కారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది.
అత్యవసర వైద్యసేవలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ప్రసూతి వైద్యసేవలకు వైద్యులు పేదల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సురేష్‌బాబు మంత్రికి ఫిర్యాధు చేశారు. సారథి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యుల కొరత ఉన్నందున పూర్తిస్థాయిలో సేవలు అందని మాట వాస్తవమేనన్నారు. గతంలో కన్నా రోజువారి అవుట్ పేషెంట్‌లు ఎక్కువ సంఖ్యలో వైద్యసేవలు పొందుతున్నారని, మెరుగైన సేవలందించేందుకు వైద్యులను నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. పలు సమస్యలపై సమావేశంలో నిర్ణమయం తీసుకుంటామని చెప్పటంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు.
పోలీసులపై మంత్రి సారథి అసహనం..
వైఎస్సార్ సీపీ ఆందోళన నేపథ్యంలో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి సారథిని అడ్డుకుంటారన్న సమాచారంతో సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించటంతోపాటు, సారథి సమావేశపు హాల్‌ల్లోకి వెళ్లేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. దీంతో మంత్రి సారథి సీఐపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఇంతమంది పోలీసులు అవసరమా? రోడ్డుపై ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోండి’అంటూ మండిపడ్డారు. దీంతో అదనపు పోలీసులు వెనుదిరిగారు.
50 పడకలుగా అప్‌గ్రేడ్‌కు చర్యలు
30 పడకల ఆస్పత్రిని 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటునట్లు మంత్రి సారథి అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మెరుగైన వసతుల కల్పనకు, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డెంటల్ చైర్ ఏర్పాటు, వైద్య పరికరాలకు సంబంధించి నిధుల మంజూరు, ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటుకు భవన నిర్మాణం, తాత్కాలిక సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చించి చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం నూతనంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన న్యూ బోర్న్ స్టేబిలైజేషన్ యూనిట్(ఎన్‌బీఎస్‌యూ)ను ప్రారంభించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీసీహెచ్ నరసింగరావు, సూపరింటెండెంట్ సుధాకర్, డాక్టర్లు రవిపాల్, అన్నపూర్ణ, మదుసూదనరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు తహశీల్దార్ మహేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఖలీల్, గండిగుంట సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.